చంద్రబాబుకు మిగిలింది.. జైలు దారి ఒక్కటే!
సీఎంగా కొనసాగే అర్హత లేదు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫైర్
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ. కోట్లకు కొనాలని చూసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిప్పులు చెరిగారు. ఓటకు కోట్లు కేసులో బాబు తప్పించుకోలేడని, ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఒక్క జైలు దారి మాత్రమే తెరిచి ఉందని ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాలరాజు, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్ గురువారం విలేకరులతో వేర్వేరుగా మాట్లాడుతూ.. బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న ఏపీ మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్న బాబు సెక్షన్-8ను తెరపైకి తెచ్చి రాద్దాంతం చేస్తున్నాడని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. కేసు నుంచి బయటపడేందుకు, హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని బాబు కుట్ర పన్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు.