కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
బీబీనగర్: కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని, పార్టీని బతికించేందుకు కార్యకర్తలతో కలసి అహర్నిషలు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వారే కొందరు తమపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేని పార్టీ అని టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం కాంగ్రెస్సేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పూర్తిగా కుటుం బ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న మంత్రి హారీశ్రావుతో పాటు మరి కొందరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్లో ఉద్యమకారులు ఎవరూ లేరన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కోదండరాం లాంటి వారు ఇప్పుడు మళ్లీ ఉద్యమాల బాట పట్టారన్నారు. ప్రభుత్వం ఎర్పాటు చేయనున్న రైతు సమన్వయ కమిటీలు కుట్ర పూరితంగా జరుగుతున్నట్లు అనిపిస్తోందని, ఓట్ల కోసమే కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీ నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, జడ్పీటీసీ బస్వయ్య, ఎంపీటీసీ పంజాల వెంకటేశ్‌గౌడ్, మాజీ ఎంపీపీ టంటం లక్ష్మయ్య పాల్గొన్నారు.
2019లో కాంగ్రెస్‌దే అధికారం : వెంకట్‌రెడ్డి
నకిరేకల్ : 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రా వడం ఖాయమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెం కట్రెడ్డి అన్నారు. నకిరేకల్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలోని క్రేజీ గాయ్స్, 2వ వార్డు ఎస్సీ కాలనీలో ప్రతిష్టించిని వినాయక మండపాలలో ఆదివారం ఆయన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.
దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగులకు సీపీఎస్ విధానం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్తానిక సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నకిరేకంటి యేసుపాదం, నడికుడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు కొండ జానయ్య, సికిలం అరుణ్‌కుమార్, బ్రహ్మదేవర రమేష్, మామిడికాయల నాగయ్య, పల్లెబోయిన బద్రి, పల్లె విజయ్, ఆరుట్ల శ్రవణ్ ఉన్నారు.