MLC Meka Seshu Babu
-
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా శేషుబాబు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నియమితులయ్యారు. శేషుబాబు ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కాగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గ సింగిల్ కో–ఆర్డినేటర్‌గా గుణ్ణం నాగబాబుని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వైఎస్ జగన్ దృష్టికి జిల్లా సమస్యలు
పాలకొల్లు టౌన్ : జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తీసుకెళ్లారు. శనివారం హైదరాబాద్‌లో శేషుబాబు పార్టీ అధినేతను కలిశారు. అనంతరం ఫోన్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ప్రభుత్వం సరైన ఇసుక విధానం రూపొందించడంలో విఫలమైనందున గృహనిర్మాణ రంగం నిర్వీర్యమైందని, అసంఘటిత కార్మికులకు పనులు లేక ఉపాధి కోల్పోయారని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్లే జిల్లా రైతులకు ఈ పరిస్థితి వచ్చినట్టు వివరించానన్నారు. ఈ సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని, ప్రజలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని శేషుబాబు తెలిపారు. -
‘పట్టిసీమ’తో రైతులకు మన్నే
పాలకొల్లు :పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మన్నుకొట్టే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయప్రాజెక్టుగా ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు రూ.ఐదువేల కోట్లు ఖర్చుచేయగా దానిని ఎవరి ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడువేల టీఎంసీల నీరు సముద్రంలో కలవకుండా అనేక రాష్ట్రాలకు ఉపయోగపడుతుందన్నారు. వంతులవారీ విధానంతో అనేక అవస్థలు పడుతూ వేలాది ఎకరాలకు నీరు అందక ఫలసాయాన్ని పశుగ్రాసంగా ఉపయోగించుకోవల్సిన దుస్థితిలో రైతులున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలు కాలువల ద్వారా, మరో ఐదు లక్షల ఎకరాలు బోర్ల ద్వారా సాగు చేస్తుంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కాలువల ద్వారా నీరు అందకపోగా భూగర్బజలాలు ఇంకిపోయి బోర్ల ద్వారా సాగుచేయడం కష్టమవుతుందని సుబ్బారాయుడు వివరించారు. జూలై, ఆగస్టులో గోదావరి జిల్లాల్లో సార్వా నాట్లు వేస్తుండగా పట్టిసీమ వల్ల ఈ ప్రాంతంలో రెండవ పంటకు కూడా సక్రమంగా నీరందని దుస్ధితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సాగు, తాగు నీరివ్వాలని ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా భావిస్తే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించినా పోలవరం కుడికాలువ ద్వారానే నీరు పంపిణీ చేయాలని అయితే అక్కడ భూసేకరణపై రైతులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇవన్నీ పూర్తికావాలంటే మరొక నాలుగేళ్ల సమయం పడుతుందని, ఇటువంటి తరుణంలో రూ.1400 కోట్లు ఖర్చుచేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. అఖిలపక్షం, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పట్టిసీమ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో పోరాటం చేయడానికి పారీ ్టసిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేషుబాబు, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, పాలకొల్లు మండల పార్టీ కన్వీనర్ ఎం.మైఖేల్‌రాజు, మద్దా చంద్రకళ, నడపన గోవిందరాజులునాయుడు, సప్పరపు కోటేశ్వరరావు, కవురు సత్యనారాయణ, వన్నెంరెడ్డి శ్రీనివాస్, యర్రంశెట్టి బాబులు, పీఆర్కే మూర్తి, కర్ణి జోగయ్య, జి.లక్ష్మీనారాయణ, అనిశెట్టి గోపి పాల్గొన్నారు. -
దీక్షను చూసి ఓర్వలేకే టీడీపీ ర్యాలీలు
పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్షకు వచ్చిన విశేష స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు ర్యాలీల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. స్థానిక ఏఎంసీ అతిథి గృహంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలతోపాటు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ చరిష్మాతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన చంద్రబాబు సాకులు చూపుతూ రూ.82 వేల కోట్ల రుణమాఫీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయించేందుకు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన పోరాటానికి విశేష స్పందన వస్తోందని చెప్పారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణపై సీబీఐ విచారణ జరిపించుకుని నీతిమంతుడిగా నిరూపించుకోవాలని శేషుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రం విడిపోవడం వల్ల లోటుబడ్జెట్ అంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంగళ ం పాడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఏడు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రైతు దీక్ష విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తొలి సంతకంతోనే తొలి మోసం ప్రారంభించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. జగన్‌పై నిందలు వేస్తే సహించం వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ ప్రచారం కోసమో, చంద్రబాబు మెప్పుకోసమే జగన్మోహన్రెడ్డిపై నిందలు వేస్తే పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పార్టీ రైతు నాయకుడు కైలా నర్సింహరావు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే రామానాయుడు పెదవి విప్పకపోవడం సరికాదన్నారు. మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, కౌన్సిలర్లు దొమ్మేటి వెంకట్రావు, కావలి చంద్రావతి, ధనాని దుర్గమ్మ, నాయకులు ఖండవల్లివాసు, మద్దా చంద్రకళ, ఎం.మైఖేల్‌రాజు, జోగి లక్ష్మీనారాయణ, గవర బుజ్జి, కావలి శ్రీను పాల్గొన్నారు.