
వైఎస్ జగన్ దృష్టికి జిల్లా సమస్యలు
పాలకొల్లు టౌన్ : జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తీసుకెళ్లారు. శనివారం హైదరాబాద్‌లో శేషుబాబు పార్టీ అధినేతను కలిశారు. అనంతరం ఫోన్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ప్రభుత్వం సరైన ఇసుక విధానం రూపొందించడంలో విఫలమైనందున గృహనిర్మాణ రంగం నిర్వీర్యమైందని, అసంఘటిత కార్మికులకు పనులు లేక ఉపాధి కోల్పోయారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్లే జిల్లా రైతులకు ఈ పరిస్థితి వచ్చినట్టు వివరించానన్నారు. ఈ సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని, ప్రజలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని శేషుబాబు తెలిపారు.