ఎమ్మెల్సీ వాకాటిపై చీటింగ్ కేసు
బిల్డర్‌తో కుమ్మక్కై అక్రమ రిజిస్ట్రేషన్
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై తెలుగుదేశం పార్టీలో చేరిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డి ఓ బిల్డర్‌తో కుమ్మక్కై స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, బిల్డర్, సబ్ రిజిస్ట్రార్లపై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకృష్ణప్రసాద్కు గచ్చిబౌలి సర్వే నంబర్ 55, 56, 57ల్లో 600 చదరపు గజాల స్థలం ఉంది. 2010లో ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ యజమాని ఆర్.వెంకటేశ్వర్రావుకు ఈ స్థలాన్ని డెవలప్మెంట్కు ఇచ్చి జీపీఏ చేశారు.
రెసిడెన్షియల్ నిర్మా ణం రెండేళ్లలోపు, అదనంగా మరో మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి. జీహెచ్ఎంసీ నుంచి జీ ప్లస్ ఐదు అంతస్తుల అనుమతి పొందారు. అయితే బిల్డర్ రెసిడెన్షియల్‌గా కాకుండా ఇష్టానుసారంగా భవనాన్ని నిర్మించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే కమర్షియల్ అయితే లాభం వస్తుంద న్నాడు. ఈ క్రమంలో కమర్షియల్ నిర్మాణంగా 2013లో కృష్ణప్రసాద్ నుంచి మళ్లీ అగ్రిమెంట్ చేయించుకున్నారు. అయితే కృష్ణప్రసాద్ అమెరికా వెళ్లిపోవడంతో.. తన భార్య, న్యూరాలాజిస్ట్ డాక్టర్ పద్మ వీరపనేనికి పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చారు. కొద్ది నెలల్లోనే బిల్డర్ వెంకటేశ్వర్రావు.. హరిబాబు అనే వ్యక్తికి తన వాటాకు వచ్చే భవనాన్ని కుదువబెట్టి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. శ్లాబ్‌లు మాత్రమే వేసి భవనాన్ని అసంపూర్తిగా వదిలేశాడు.
ఎమ్మెల్సీకి అక్రమ రిజిస్ట్రేషన్
అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పు డు జీహెచ్ంఎసీకి చేసిన మార్ట్గేజ్ రిలీజ్ అవుతుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా 7,000చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాన్ని వాకాటి నారాయణరెడ్డికి సబ్‌రిజిస్ట్రార్ రిజిస్టర్ చేశారు. 2013 సెప్టెంబర్‌లో చదరపు అడుగుకు రూ.7,500 చొప్పున చెల్లించి మూసాపేట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ముగ్గురిపై కేసు నమోదు
డెవలప్మెంట్ పేరిట మోసానికి పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బిల్డర్ వెంకటేశ్వర్రావుకు పోలీసులు నోటీసులిచ్చా రు. తదుపరి విచారణ నిమిత్తం అమెరికాలో ఉన్న కృష్ణ ప్రసాద్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇద్దరూ కుమ్మక్కై చేశారు: పద్మ
బిల్డర్, ఎమ్మెల్సీ కుమ్మక్కై మోసానికి పాల్పడ్డారని, పూర్తికాని భవనాన్ని కొనే ముందు స్థలం యజమానులెవరు, అగ్రిమెంట్లు ఏం ఉన్నాయని తెలుసుకుని, కావాలనే ఎమ్మెల్సీ నారాయణరెడ్డి దీనిని కొన్నారని డాక్టర్ పద్మ ఆరోపించారు. మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేస్తానని నమ్మబలికినఎమ్మెల్సీ ఆ తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. తన భర్త పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని, అందుకే ఫిబ్రవరి 26న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు.