MLS points
-
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్‌లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
‘సీసీ’ సక్సెస్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పేదల సరుకులు దారిమళ్లకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గోదాంల వద్ద ఏం జరుగుతుంది.. సరుకులు ఎలా తరలిస్తున్నారు.. అంతా సక్రమంగానే జరుగుతుందా? అనే విషయాలను తెలుసుకునే వీలు కలిగింది. గతంలో అక్రమాలు జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు అందగా.. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఫిర్యాదులు తగ్గుముఖం పడుతున్నాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా అర్హులైన పేదలకు బియ్యం, పంచదార వంటి రేషన్ సరుకులను సరఫరా చేస్తుంటారు. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద నుంచి రేషన్ డీలర్లకు వాహనాల్లో తరలిస్తుంటారు. ఈ క్రమంలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది. దీంతో సుమారు 8 నెలల క్రితం జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్లలో 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాల ఏర్పాటుతో ఆయా సెంటర్లలో ఏం జరుగుతున్నదనే విషయాలను అధికారులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండడంతో ఎవరూ అక్రమాలకు పాల్పడేందుకు సాహసించే అవకాశం ఉండదు. 79 సీసీ కెమెరాలు ఏర్పాటు.. పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు రేషన్ సరుకులను ప్రతినెలా పంపిణీ చేస్తుంటారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న గోదాంలలో నిల్వ చేస్తుంటారు. వాటిని ప్రతినెలా కోటా ప్రకారం ఎంఎల్ఎస్ పాయింట్ల(మండల లెవెల్ స్టాక్ పాయింట్)కు తరలిస్తారు. అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే ప్రతిసారి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద నుంచి సరఫరా అవుతున్న రేషన్ సరుకులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండేవి. వీటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. నేలకొండపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద 10 కెమెరాలు, కల్లూరులో 5, వైరాలో 11, ఖమ్మం అర్బన్ 7, ఖమ్మం రూరల్ 8, మధిర 16, సత్తుపల్లి 11, ఏన్కూరులో 11 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలు అమర్చిన ఎంఎల్ఎస్ పాయింట్లలో ఏం జరుగుతున్నది.. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంతోపాటు హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఇన్చార్జి, డేటా ఆపరేటర్ విధుల్లో ఉంటారు. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో డేటా నెల రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఈ నెల రోజుల సమయంలో ఏం జరిగిందనేది ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా చూడవచ్చు. జిల్లాలోని సివిల్ సప్లై కార్యాలయంలో.. హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో 24 గంటలకు సంబంధించి డేటా అందుబాటులో ఉంటుంది. ఆయా కార్యాలయాల నుంచి ఆ సమయంలో ఏం జరుగుతుందనేది చూసేందుకు వీలు కలుగుతుంది. అక్రమాలకు చెక్.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పౌరసరఫరాల శాఖలో జరిగే కొన్ని అవకతవకలకు చెక్ పెట్టే అవకాశం లభించింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో కొందరు బస్తాల నుంచి బియ్యం దొంగిలించారనే ఆరోపణలున్నాయి. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. అలాగే పలు పాయింట్ల వద్ద నుంచి గతంలో బియ్యం బస్తాలు మాయం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ బస్తాలు ఎలా తరలిపోయాయనే అంశం ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రస్తుతం సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రతి అంశాన్ని పౌరసరఫరాల శాఖ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారనే అంశాలను ఆ శాఖ అధికారులు మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. పటిష్ట నిఘా.. ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘా పెరిగింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఏం జరుగుతుందనే విషయాన్ని మా కార్యాలయంతోపాటు హైదరాబాద్ కార్యాలయంలో కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఖమ్మం -
మిగులు.. కొక్కులు!
ఎంఎల్ఎస్ పాయింట్లలో చేతివాటం - డిలర్కిచ్చే బియ్యంలో చిలక్కొట్టుడు - క్వింటాకి రెండు కేజీల మేర దోపిడీ - నెలసరి 5వేల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు.. - ఎందుకొచ్చిన తలనొప్పని డీలర్ల మౌనం - బొక్కుడు తిలాపాపం తలా పిడికెడు 2962 - జిల్లాలోని చౌక ధరల దుకాణాలు 24 - ఎంఎల్ఎస్ పాయింట్లు 11.92 లక్షలు - కార్డులు 1.81 లక్షల క్వింటాళ్లు - ప్రతి నెలా సరఫరా చేస్తున్న బియ్యం 50 టన్నులు - నల్లబజారుకు తరలుతున్న బియ్యం మడకశిర ఎంఎల్ఎస్ పాయింట్ లెక్కల్లో 1200 బస్తాలు తేడా వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి గోడౌన్ ఇన్చార్జిగా ఉన్న ఆర్ఐ రమేశ్‌ని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హిందూపురంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ జయశేఖర్ని ఆర్ఐగా నియమించారు. బదిలీపై వచ్చిన ఆర్ఐకి అప్పటి వరకు అక్కడున్న ఆర్ఐ క్లోసింగ్ రికార్డుతో పాటు స్టాక్ రికార్డును చూపి స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ సందర్భంగా 1200 బస్తాలు తేడా ఉన్నట్లు జయశేఖర్ గుర్తించారు. స్వాధీనం చేసుకుంటే సమస్య తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఆయన సెలవులో వెళ్లిపోయారు. ‘‘ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు.’’ జూన్ 9న ఎరువాకను ప్రారంభించేందుకు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామానికి వచ్చిన ఆయన, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ దుకాణాల్లో 1.5 శాతం అవినీతి జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఎక్కడా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. పుట్టపర్తి మండల పరిధిలో 39 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 2,444.06 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 510 కార్డులు ఉండగా.. 69.90 క్వింటాళ్ల కోటాలో 67 క్వింటాళ్లు మాత్రమే తరలించారు. మడకశిర మండల పరిధిలో 60 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 3,855.67 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 503 కార్డులు ఉండగా.. 82.50 క్వింటాళ్ల కోటాలో 80 క్వింటాళ్లతో సరిపెట్టారు. అనంతపురం అర్బన్: పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. మండల లెవల్ స్టాక్ పాయింట్లు(ఎంఎల్ఎస్) కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. డీలర్లు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెలా దాదాపు 5వేల క్వింటాళ్ల(50 టన్నులు) బియ్యం నల్లబజారుకు తరలుతోంది. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 7,500 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. డీలర్లకు ఇచ్చే బియ్యంలో క్వింటాకు రెండు కేజీల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కనీసంగా 200 క్వింటాళ్ల బియ్యం మిగుల్చుకుంటున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితే డీలర్‌షిప్‌కు ఎసరు వస్తుందనే భయంతో డీలర్లు కూడా ఈ భారాన్ని మౌనంగానే భరిస్తున్నారు. 70 క్వింటాళ్లు ఇవాల్సి ఉన్న డీలర్‌కు 67 క్వింటాళ్లతో సరిపెడుతున్నారు. అధికారులతో గొడవ పడి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుంటున్నట్లు పుట్టపర్తికి చెందిన ఒక డీలర్ తెలిపారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుంటున్నట్లు వాపోయాడు. బియ్యం ఎందుకు తక్కువిస్తున్నారంటే.. బియ్యం తక్కువగా ఇవ్వడంపై కొందరు అధికారులు ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని చెబుతున్నారు. క్వింటాకు రెండు బస్తాలు వస్తాయని, వీటి బరువు ఒక కేజీ 100 గ్రాములు ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యమే కింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక లోడింగ్ అన్‌లోడింగ్‌లో కనీసం ఒక కేజీ మేర తరుగు ఉంటుందని.. అంటే క్వింటా మీద రెండు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర వస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇస్తుండవచ్చని చెప్పుకొస్తున్నారు. తరుగుని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించిందని, ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నిర్దేశించిన ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకాలను, తరుగుని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. స్టాక్ తూకం వేయిస్తున్నాం జయశేఖర్ శుక్రవారం విధుల్లో చేరారు. ఎంఎల్ఎస్ పాయింట్లో ఉన్న స్టాక్ తూకం వేయించే ప్రక్రియ శనివారం చేపడతాం. అక్కడికి ప్రత్యేకంగా టెక్నికల్ అధికారి భానుని పంపిస్తున్నాం. మొత్తం స్టాక్ తూకం వేయడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొరత ఎంతనే విషయం తెలుస్తుంది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం తక్కువగా ఇస్తుండొచ్చు. వీటిని నిరోధించేందుకే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఈ పాస్, లారీ వే బ్రిడ్జిని అమల్లోకి తీసుకొస్తున్నాం. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
నిత్యావసర వస్తువుల పూర్తి బాధ్యత డీటీలదే
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో నిత్యావసర వస్తువులకు సంబంధించి నిల్వ, నాణ్యత, వంద శాతం పంపిణీ బాధ్యత ఎంఎల్ఎస్ పాయింట్లల్లో పనిచేసే పౌరసరఫరాల డెప్యూటీ తహశీల్దార్లదేనని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్థాయి స్టాక్‌పాయింట్ల (ఎంఎల్ఎస్) డీటీలు, మండల పౌరసరఫరాల శాఖ డీటీలతో సమీక్ష నిర్వహించారు. స్టాకు పాయిం ట్లకు సరుకులు వచ్చిన 10 రోజుల్లోపు డీలర్లకు సరఫరా చేయాలన్నారు. సరుకుల రవాణా, పరిమాణం, నాణ్యత విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బియ్యం స్టాకు వచ్చినప్పుడు నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. గోడౌన్లలో పనిచేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు బీడీలు, సిగరెట్లు కాల్చరాదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పక్కాగా అమలుచేయాలని చెప్పారు. బోగస్‌కార్డులను తొందరగా ఏరివేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రంజాన్, శ్రావణమాసం, వినాయకచవితి పండుగలకు చక్కెరను కిలో రూ.33 వంతున ప్రత్యేక కౌంటర్ల ద్వారా కార్డుదారులు, ఇతర గుర్తింపుకార్డులు కలిగిన వారికి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్ఓ విజయరాణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.