మిగులు.. కొక్కులు!
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో చేతివాటం
- డిలర్‌కిచ్చే బియ్యంలో చిలక్కొట్టుడు
- క్వింటాకి రెండు కేజీల మేర దోపిడీ
- నెలసరి 5వేల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు..
- ఎందుకొచ్చిన తలనొప్పని డీలర్ల మౌనం
- బొక్కుడు తిలాపాపం తలా పిడికెడు
2962 - జిల్లాలోని చౌక ధరల దుకాణాలు
24 - ఎంఎల్‌ఎస్ పాయింట్లు
11.92 లక్షలు - కార్డులు
1.81 లక్షల క్వింటాళ్లు - ప్రతి నెలా సరఫరా చేస్తున్న బియ్యం
50 టన్నులు - నల్లబజారుకు తరలుతున్న బియ్యం
మడకశిర ఎంఎల్‌ఎస్ పాయింట్ లెక్కల్లో 1200 బస్తాలు తేడా వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి గోడౌన్ ఇన్‌చార్జిగా ఉన్న ఆర్‌ఐ రమేశ్‌ని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హిందూపురంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ జయశేఖర్‌ని ఆర్‌ఐగా నియమించారు. బదిలీపై వచ్చిన ఆర్‌ఐకి అప్పటి వరకు అక్కడున్న ఆర్‌ఐ క్లోసింగ్ రికార్డుతో పాటు స్టాక్ రికార్డును చూపి స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ సందర్భంగా 1200 బస్తాలు తేడా ఉన్నట్లు జయశేఖర్ గుర్తించారు. స్వాధీనం చేసుకుంటే సమస్య తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఆయన సెలవులో వెళ్లిపోయారు.
‘‘ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు.’’ జూన్ 9న ఎరువాకను ప్రారంభించేందుకు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామానికి వచ్చిన ఆయన, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ దుకాణాల్లో 1.5 శాతం అవినీతి జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఎక్కడా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతోంది.
పుట్టపర్తి మండల పరిధిలో 39 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 2,444.06 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 510 కార్డులు ఉండగా.. 69.90 క్వింటాళ్ల కోటాలో 67 క్వింటాళ్లు మాత్రమే తరలించారు.
మడకశిర మండల పరిధిలో 60 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 3,855.67 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 503 కార్డులు ఉండగా.. 82.50 క్వింటాళ్ల కోటాలో 80 క్వింటాళ్లతో సరిపెట్టారు.
అనంతపురం అర్బన్: పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. మండల లెవల్ స్టాక్ పాయింట్లు(ఎంఎల్‌ఎస్) కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. డీలర్లు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెలా దాదాపు 5వేల క్వింటాళ్ల(50 టన్నులు) బియ్యం నల్లబజారుకు తరలుతోంది. ఒక్కో ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సగటున 7,500 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది.
డీలర్లకు ఇచ్చే బియ్యంలో క్వింటాకు రెండు కేజీల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కనీసంగా 200 క్వింటాళ్ల బియ్యం మిగుల్చుకుంటున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితే డీలర్‌షిప్‌కు ఎసరు వస్తుందనే భయంతో డీలర్లు కూడా ఈ భారాన్ని మౌనంగానే భరిస్తున్నారు. 70 క్వింటాళ్లు ఇవాల్సి ఉన్న డీలర్‌కు 67 క్వింటాళ్లతో సరిపెడుతున్నారు. అధికారులతో గొడవ పడి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుంటున్నట్లు పుట్టపర్తికి చెందిన ఒక డీలర్ తెలిపారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుంటున్నట్లు వాపోయాడు.
బియ్యం ఎందుకు తక్కువిస్తున్నారంటే..
బియ్యం తక్కువగా ఇవ్వడంపై కొందరు అధికారులు ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని చెబుతున్నారు. క్వింటాకు రెండు బస్తాలు వస్తాయని, వీటి బరువు ఒక కేజీ 100 గ్రాములు ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యమే కింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక లోడింగ్ అన్‌లోడింగ్‌లో కనీసం ఒక కేజీ మేర తరుగు ఉంటుందని.. అంటే క్వింటా మీద రెండు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర వస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇస్తుండవచ్చని చెప్పుకొస్తున్నారు. తరుగుని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించిందని, ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నిర్దేశించిన ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తూకాలను, తరుగుని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
స్టాక్ తూకం వేయిస్తున్నాం
జయశేఖర్ శుక్రవారం విధుల్లో చేరారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఉన్న స్టాక్ తూకం వేయించే ప్రక్రియ శనివారం చేపడతాం. అక్కడికి ప్రత్యేకంగా టెక్నికల్ అధికారి భానుని పంపిస్తున్నాం. మొత్తం స్టాక్ తూకం వేయడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొరత ఎంతనే విషయం తెలుస్తుంది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం తక్కువగా ఇస్తుండొచ్చు. వీటిని నిరోధించేందుకే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఈ పాస్, లారీ వే బ్రిడ్జిని అమల్లోకి తీసుకొస్తున్నాం.
– డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ