చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో నిత్యావసర వస్తువులకు సంబంధించి నిల్వ, నాణ్యత, వంద శాతం పంపిణీ బాధ్యత ఎంఎల్‌ఎస్ పాయింట్లల్లో పనిచేసే పౌరసరఫరాల డెప్యూటీ తహశీల్దార్లదేనని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల స్థాయి స్టాక్‌పాయింట్ల (ఎంఎల్‌ఎస్) డీటీలు, మండల పౌరసరఫరాల శాఖ డీటీలతో సమీక్ష నిర్వహించారు. స్టాకు పాయిం ట్లకు సరుకులు వచ్చిన 10 రోజుల్లోపు డీలర్లకు సరఫరా చేయాలన్నారు.
సరుకుల రవాణా, పరిమాణం, నాణ్యత విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బియ్యం స్టాకు వచ్చినప్పుడు నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. గోడౌన్‌లలో పనిచేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు బీడీలు, సిగరెట్లు కాల్చరాదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పక్కాగా అమలుచేయాలని చెప్పారు.
బోగస్‌కార్డులను తొందరగా ఏరివేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రంజాన్, శ్రావణమాసం, వినాయకచవితి పండుగలకు చక్కెరను కిలో రూ.33 వంతున ప్రత్యేక కౌంటర్ల ద్వారా కార్డుదారులు, ఇతర గుర్తింపుకార్డులు కలిగిన వారికి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్‌ఓ విజయరాణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల పూర్తి బాధ్యత డీటీలదే
Published Sat, Jul 19 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement