rice stock
-
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం: 1 శాతం బలవర్థక బియ్యం కలపాలి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొనుగోలు చేసే బియ్యంలో ఇకపై 1 శాతం ఫోర్టిఫైడ్ (బలవర్థక) బియ్యం గింజలు కలపాలని నిర్దేశిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్రం సెంట్రల్ పూల్‌లో భాగంగా సేకరించే గ్రేడ్ ‘ఏ’, కామన్ రైస్ నిల్వల్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్(ఎఫ్ఆర్కే) కలపాలని నిర్దేశించింది. గత ఏడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020–21 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. వరి ధాన్యం, ఇతర ఆహార ధాన్యాలైన జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, రాగుల్లో ఒక శాతం బలవర్థక ఆహార గింజలు కలపాలని నిర్దేశించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రజాపంపిణీ పథకం ద్వారా, ఇతర సంక్షేమ పథకాల ద్వారా సరఫరా చేసే బియ్యానికీ ఈ నిర్దేశించిన ప్రమాణాలు వర్తిస్తాయి. రైతుల ఉత్పత్తులను నిరాకరించడం ఉండదని ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో తప్పనిసరిగా ఈ ఏకరూప నిర్ధేశించిన ప్రమాణాలు అమలు చేస్తూ ధాన్యం సేకరించాలని సూచించింది. బలవర్థక బియ్యం.. నూకలైన బియ్యం గింజలను పిండిగా మార్చి దానికి కృత్రిమంగా సూక్ష్మ పోషకాలను జోడించి బియ్యం గింజల ఆకృతిలోకి మార్చుతారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్(ఎఫ్ఆర్కే)ను మిల్లర్లకు సరఫరా చేస్తారు. మిల్లర్లు వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. ప్రత్యేక ఎఫ్ఆర్కే యంత్రాల ద్వారా ప్రతీ క్వింటాల్ బియ్యంలో ఒక కిలో ఎఫ్ఆర్కేను కలుపుతారు. పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకే.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ బలవర్థక ధాన్యాన్ని ప్రస్తావించారు. సంక్షేమ పథకాల ద్వారా సరఫరా అయ్యే బియ్యంలో బలవర్థక బియ్యం కలపడం ద్వారా పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 వేల టన్నుల మేర మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ తయారీ సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా పంపిణీ బియ్యం మొత్తానికి కలపాలంటే సుమారు 3.5 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా. -
విజిలెన్స్ కొరడా...
అచ్యుతాపురం/యలమంచిలి రూరల్ : విజిలెన్స్ అధికారులు బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం శుక్రవారం యలమంచిలి మండలం తెరువుపల్లిలో రైస్‌మిల్లు, మండలంలోని గొర్లె ధర్మవరంలో బియ్యం నిల్వచేసిన ఇంటిపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వచేసిన పౌరసరఫరా బియ్యం గుర్తించారు. బొజ్జ చంద్రం, బొజ్జ నాగరాజులు డిపోల నుంచి బియ్యం కొనుగోలుచేసి కగడల అప్పారావు ఇంట్లో నిల్వచేశారు. ఇక్కడ నుంచి తెరువుపల్లిలో ఎస్.బాబూరావుకి చెందిన శ్రీసాయి సీతా ట్రేడర్స్ రైస్‌మిల్లులో గ్రైండింగ్ చేసి ఖరీదైన బియ్యంలో కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.బియ్యంతోపాటు బొలేరో వ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.రూ 5.19 లక్షల విలువైన 12 టన్నుల పీడీఎస్ బియ్యం నిల్వలను గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, ఎమ్మార్వో సుమబాల , హెచ్‌వి ముబారక్ పాల్గొన్నారు. రేషన్ బియ్యానికి బహిరంగ వేలం నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లు గ్రామంలో ఆరుమాసాల క్రితం పట్టుబడ్డ సివిల్ సప్లయిస్ బియ్యాన్ని శుక్రవారం స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాము వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. అప్పట్లో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి సుమారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వీటిని జాయింట్ కలెక్టర్‌కు అప్పగించడంతో స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాము వద్ద భద్రపరిచారు. వీటిని జేసీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం నిర్వహించారు. గతంలో వేలం నిర్వహిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర రాలేదు. తిరిగి శుక్రవారం రెండోసారి వేలం నిర్వహించారు. కిలో రూ.15.26 చొప్పున ఒక వ్యక్తి పాడుకున్నారని సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి నిర్ణయిం తీసుకుంటామన్నారు. -
రీసైక్లింగ్ దందా
రైస్ మిల్లులకు చేరుతున్న రూ.కిలో బియ్యం మరపట్టి.. బహిరంగ మార్కెట్లో విక్రయం మిల్లుల్లో అక్రమంగా బియ్యం నిల్వలు మామూళ్ల మత్తులో పౌరసరఫరాల శాఖ సాక్షి, మంచిర్యాల: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమం గా రైస్ మిల్లులకు తరలుతోంది. కొంత మంది డీలర్లు, దళారులు రూ.కిలో రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లకు రూ.5 నుంచి రూ.10కి కిలో చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని మరపట్టి.. రీ సైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. మంచిర్యాల డివిజన్ కేంద్రంలోని ఎంసీసీ సమీపంలో ఉన్న ఓ రైస్‌మిల్ ఈ అక్రమ దందాకు కేరాఫ్‌గా మారింది. సదరు యజమాని అండ.. పలుకుబడితో తూర్పు జిల్లాలో చాలా మంది మిల్ల ర్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని తమ మిల్లులకు తరలించుకుని.. రీ సైక్లింగ్ చేసి వాటిని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లాలో జోరు గా సాగుతున్నా పౌరసరఫరాల అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, అం త్యోదయ, తెలుపు రేషన్‌కార్డులు 6.72 లక్షల వరకు ఉన్నా యి. ప్రతినెలా 94,117 క్వింటాళ్ల బియ్యం కోటా విడుదల అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,444 రేషన్ షాపుల ద్వా రా బియ్యం వినియోగదారులకు అందుతుంది. రేషన్ డీల ర్లు.. ముందస్తుగానే తమకు కావాల్సిన కోటాకు సంబంధిం చి డీడీ తీసి అధికారులకు అందజేస్తారు. ఆ మేరకు బియ్యం కోటా మంజూరవుతుంది. అయితే.. చాలా చోట్ల వినియోగదారులు బియ్యం తీసుకోకున్నా.. డీలర్లు మాత్రం వారి పేరి టా కోటా మంజూరు చేయించుకుని దాన్ని డీలర్లు, హోటల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రతినెలా డీలర్లు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని పక్కదారి పట్టించి.. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మామూళ్ల మత్తులో నిఘా వ్యవస్థ ! తరుచూ రేషన్ షాపులు తనిఖీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా.. లేదా.. అని తెలుసుకోవాల్సిన అధికారులు, నిఘా వ్యవస్థ జిల్లాలో మొద్దునిద్రపోయింది. పేదల కు ఇవ్వాల్సిన బియ్యాన్ని డీలర్లు దాచిపెట్టుకుని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం మంచిర్యాల పట్టణంలోని పలు బియ్యం షాపులకు చేరుతుంది. అక్కడి నుంచి బడా వ్యాపారులు పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఏవైనా ఫిర్యాదులొచ్చి.. గ్రామస్తులు అక్రమ రవాణాను అడ్డుకున్నప్పుడే అధికారులు ఆ వాహనాల్లో తరలుతోన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకుని చర్యలు తీసుకోవడంలో మాత్రం సాహసించడం లేదు. మిల్లుల్లో అక్రమ నిల్వలు కరెంట్ కోతలు.. వర్షాభావ పరిస్థితులతో గత రబీ.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం.. పంట దిగుబడి భారీగా తగ్గింది. త్వరలో ప్రారంభం కానున్న రబీకీ కరెంట్ ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు వరి సాగు ఆలోచనను విరమించుకున్నారు. దీంతో దిగుబడి త గ్గే అవకాశాలున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు ఇప్పట్నుంచే అక్రమంగా తరలించుకున్న రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని సన్నరకాలుగా మార్చి తర్వాత బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లకు విక్రయించాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ బియ్యం కిలోకు రూ.30 నుంచి రూ.40కు అమ్మే ఆలోచనలో మిల్లర్లు ఉన్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వసంత్‌రావు దేశ్‌పాండే వివరణ ఇస్తూ.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే డీలర్ల షాపును రద్దు చేస్తామని చెప్పారు. -
నిత్యావసర వస్తువుల పూర్తి బాధ్యత డీటీలదే
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో నిత్యావసర వస్తువులకు సంబంధించి నిల్వ, నాణ్యత, వంద శాతం పంపిణీ బాధ్యత ఎంఎల్ఎస్ పాయింట్లల్లో పనిచేసే పౌరసరఫరాల డెప్యూటీ తహశీల్దార్లదేనని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్థాయి స్టాక్‌పాయింట్ల (ఎంఎల్ఎస్) డీటీలు, మండల పౌరసరఫరాల శాఖ డీటీలతో సమీక్ష నిర్వహించారు. స్టాకు పాయిం ట్లకు సరుకులు వచ్చిన 10 రోజుల్లోపు డీలర్లకు సరఫరా చేయాలన్నారు. సరుకుల రవాణా, పరిమాణం, నాణ్యత విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బియ్యం స్టాకు వచ్చినప్పుడు నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. గోడౌన్లలో పనిచేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు బీడీలు, సిగరెట్లు కాల్చరాదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పక్కాగా అమలుచేయాలని చెప్పారు. బోగస్‌కార్డులను తొందరగా ఏరివేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రంజాన్, శ్రావణమాసం, వినాయకచవితి పండుగలకు చక్కెరను కిలో రూ.33 వంతున ప్రత్యేక కౌంటర్ల ద్వారా కార్డుదారులు, ఇతర గుర్తింపుకార్డులు కలిగిన వారికి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్ఓ విజయరాణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.