రీసైక్లింగ్ దందా
రైస్ మిల్లులకు చేరుతున్న రూ.కిలో బియ్యం
మరపట్టి.. బహిరంగ మార్కెట్లో విక్రయం
మిల్లుల్లో అక్రమంగా బియ్యం నిల్వలు
మామూళ్ల మత్తులో పౌరసరఫరాల శాఖ
సాక్షి, మంచిర్యాల: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమం గా రైస్ మిల్లులకు తరలుతోంది. కొంత మంది డీలర్లు, దళారులు రూ.కిలో రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లకు రూ.5 నుంచి రూ.10కి కిలో చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని మరపట్టి.. రీ సైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. మంచిర్యాల డివిజన్ కేంద్రంలోని ఎంసీసీ సమీపంలో ఉన్న ఓ రైస్‌మిల్ ఈ అక్రమ దందాకు కేరాఫ్‌గా మారింది. సదరు యజమాని అండ.. పలుకుబడితో తూర్పు జిల్లాలో చాలా మంది మిల్ల ర్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని తమ మిల్లులకు తరలించుకుని.. రీ సైక్లింగ్ చేసి వాటిని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
ఈ అక్రమ దందా జిల్లాలో జోరు గా సాగుతున్నా పౌరసరఫరాల అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, అం త్యోదయ, తెలుపు రేషన్‌కార్డులు 6.72 లక్షల వరకు ఉన్నా యి. ప్రతినెలా 94,117 క్వింటాళ్ల బియ్యం కోటా విడుదల అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,444 రేషన్ షాపుల ద్వా రా బియ్యం వినియోగదారులకు అందుతుంది. రేషన్ డీల ర్లు.. ముందస్తుగానే తమకు కావాల్సిన కోటాకు సంబంధిం చి డీడీ తీసి అధికారులకు అందజేస్తారు. ఆ మేరకు బియ్యం కోటా మంజూరవుతుంది. అయితే.. చాలా చోట్ల వినియోగదారులు బియ్యం తీసుకోకున్నా.. డీలర్లు మాత్రం వారి పేరి టా కోటా మంజూరు చేయించుకుని దాన్ని డీలర్లు, హోటల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రతినెలా డీలర్లు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని పక్కదారి పట్టించి.. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.
మామూళ్ల మత్తులో నిఘా వ్యవస్థ !
తరుచూ రేషన్ షాపులు తనిఖీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా.. లేదా.. అని తెలుసుకోవాల్సిన అధికారులు, నిఘా వ్యవస్థ జిల్లాలో మొద్దునిద్రపోయింది. పేదల కు ఇవ్వాల్సిన బియ్యాన్ని డీలర్లు దాచిపెట్టుకుని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం మంచిర్యాల పట్టణంలోని పలు బియ్యం షాపులకు చేరుతుంది. అక్కడి నుంచి బడా వ్యాపారులు పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఏవైనా ఫిర్యాదులొచ్చి.. గ్రామస్తులు అక్రమ రవాణాను అడ్డుకున్నప్పుడే అధికారులు ఆ వాహనాల్లో తరలుతోన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకుని చర్యలు తీసుకోవడంలో మాత్రం సాహసించడం లేదు.
మిల్లుల్లో అక్రమ నిల్వలు
కరెంట్ కోతలు.. వర్షాభావ పరిస్థితులతో గత రబీ.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం.. పంట దిగుబడి భారీగా తగ్గింది. త్వరలో ప్రారంభం కానున్న రబీకీ కరెంట్ ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు వరి సాగు ఆలోచనను విరమించుకున్నారు. దీంతో దిగుబడి త గ్గే అవకాశాలున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు ఇప్పట్నుంచే అక్రమంగా తరలించుకున్న రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని సన్నరకాలుగా మార్చి తర్వాత బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లకు విక్రయించాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ బియ్యం కిలోకు రూ.30 నుంచి రూ.40కు అమ్మే ఆలోచనలో మిల్లర్లు ఉన్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వసంత్‌రావు దేశ్‌పాండే వివరణ ఇస్తూ.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే డీలర్ల షాపును రద్దు చేస్తామని చెప్పారు.