పేదల బియ్యం పెద్దల భోజ్యం
సంక్షేమ లక్ష్యం చెదిరిపోతోంది. బడుగుల కడుపులు నింపాల్సిన బియ్యం బడా బాబుల గోడౌన్లు చేరుతున్నాయి. తెల్లకార్డులపై కిలో రూపాయకు అందిస్తున్న బియ్యం నల్లబజారుకు తరలిపోతోంది. కొద్దిగా పాలిష్ పట్టించి తిరిగి బహిరంగ మార్కెట్‌లో అధిక దరలకు విక్రయిస్తున్నారు.
సత్తెనపల్లి/తెనాలి అర్బన్: పల్నాడులోని పలు రైస్‌మిల్లుల్లో కొద్ది రోజులుగా రేషన్ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ వ్యవహారంలో రైస్‌మిల్లుల యజమానులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేసి బియ్యం విక్రయిస్తే వచ్చే లాభాల కన్నా రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో సేకరించి కాస్త పాలిష్ పెట్టి అమ్మితే వచ్చే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ.
జిల్లాలో పల్నాడును కేంద్రంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం చేపడుతున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు,గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెల్లకార్డుదారులకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారా సేకరిస్తున్నారు.
చాలా మంది రేషన్‌కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడం లేదు. కొంత మంది తీసుకున్నా వ్యాపారులకు అమ్మేస్తున్నారు.
రేషన్ డిపో డీలర్లు కూడా మిగిలిపోయిన బియ్యాన్ని దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు క్వింటా రూ. 1200 నుంచి రూ. 1400లకు కొనుగోలు చేస్తున్నారు.
ఇలా సేకరించిన బియ్యాన్ని మరోసారి మరపట్టించి వివిధ బ్రాండ్‌ల పేరుతో అమ్ముకుంటున్నారు. క్వింటాకు రూ. 1500 నుంచి రూ. 2వేల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు.
ఈనెల 8న అర్ధరాత్రి సత్తెనపల్లిలో ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
ఈనెల 14న సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని శ్రీ విఘ్నేశ్వర రైస్‌మిల్లు నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు తరలించేందుకు సిద్ధం చేసిన 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సత్తెనపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు.
ఈనెల 15న రాజుపాలెం మండలం కొండమోడులోని విఘ్నేశ్వర సప్లయర్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
వెల్దుర్తి మండలంలోని కండ్లకుంట - గుండ్లపాడు గ్రామాల మధ్య రెండు లారీల్లో తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురజాల రూరల్ సీఐ పట్టుకున్నారు.
అధికారపార్టీ నేతల అండతో... రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించేందుకు అధికార పార్టీనేతల అండ ఎక్కువగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ఇరువురు వ్యాపారులు రెండు జట్లుగా ఏర్పడి నరసరావుపేటకు చెందిన అధికార పార్టీ చోటామోటా నేతల సహకారంతో ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు పంపుతున్నారు.