సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొనుగోలు చేసే బియ్యంలో ఇకపై 1 శాతం ఫోర్టిఫైడ్ (బలవర్థక) బియ్యం గింజలు కలపాలని నిర్దేశిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్రం సెంట్రల్ పూల్‌లో భాగంగా సేకరించే గ్రేడ్ ‘ఏ’, కామన్ రైస్ నిల్వల్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్(ఎఫ్‌ఆర్‌కే) కలపాలని నిర్దేశించింది. గత ఏడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020–21 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. వరి ధాన్యం, ఇతర ఆహార ధాన్యాలైన జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, రాగుల్లో ఒక శాతం బలవర్థక ఆహార గింజలు కలపాలని నిర్దేశించింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రజాపంపిణీ పథకం ద్వారా, ఇతర సంక్షేమ పథకాల ద్వారా సరఫరా చేసే బియ్యానికీ ఈ నిర్దేశించిన ప్రమాణాలు వర్తిస్తాయి. రైతుల ఉత్పత్తులను నిరాకరించడం ఉండదని ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో తప్పనిసరిగా ఈ ఏకరూప నిర్ధేశించిన ప్రమాణాలు అమలు చేస్తూ ధాన్యం సేకరించాలని సూచించింది.
బలవర్థక బియ్యం..
నూకలైన బియ్యం గింజలను పిండిగా మార్చి దానికి కృత్రిమంగా సూక్ష్మ పోషకాలను జోడించి బియ్యం గింజల ఆకృతిలోకి మార్చుతారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్(ఎఫ్‌ఆర్‌కే)ను మిల్లర్లకు సరఫరా చేస్తారు. మిల్లర్లు వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. ప్రత్యేక ఎఫ్‌ఆర్‌కే యంత్రాల ద్వారా ప్రతీ క్వింటాల్ బియ్యంలో ఒక కిలో ఎఫ్‌ఆర్‌కేను కలుపుతారు.
పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకే..
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ బలవర్థక ధాన్యాన్ని ప్రస్తావించారు. సంక్షేమ పథకాల ద్వారా సరఫరా అయ్యే బియ్యంలో బలవర్థక బియ్యం కలపడం ద్వారా పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 వేల టన్నుల మేర మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ తయారీ సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా పంపిణీ బియ్యం మొత్తానికి కలపాలంటే సుమారు 3.5 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment