Mobile Money
-
సోషల్‌మీడియా పన్ను : యువత విలవిల
సాక్షి, వెబ్ డెస్క్ : ‘సోషల్ మీడియా పన్ను’ఈ మాట ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సాంకేతికత వృద్ధి చెందిన తర్వాత నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రలోకి జారుకునే వరకూ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, స్కైప్ ఇలా పలు రకాల మాద్యామాల వినియోగానికి ప్రపంచం అలవాటు పడింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వినియోగించాలి అంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలనే వార్తకు యువత నోట మాట రావడం లేదు. కేవలం వార్తకే ఇలా ప్రపంచ యువత షాక్‌కు గురవుతుంటే, జులై 1న ఉగాండా ప్రభుత్వం అధికారికంగా సోషల్ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది. దీనిపై ఆ దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది. అయితే, ఉగాండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నట్లుండి ఏమీ తీసుకోలేదు. ముందుగానే ఈ పన్నును విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్ వంటి సోషల్ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌ను చెల్లించాలి.దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు. 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(టీఆర్ఏ) ఎన్నికల సందర్భంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సోషల్ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియా పన్నును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టీఆర్ఏ సూచించింది. అమల్లోకి వచ్చిన పన్నును ఎలా చెల్లించాలనే దానిపై ఎంటీఎన్, ఎయిర్టెల్, ఆఫ్రిసెల్‌లు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కాగా, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. పోర్న్‌పైనా దృష్టి పోర్న్ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు ఉగాండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రత్యేక డివైజ్‌ను ఆ దేశం ఇందుకోసం తెప్పించినట్లు సమాచారం. దీని ద్వారా దేశంలో ఇంటర్నెట్ వినియోగించే ప్రతి ఒక్కరి కంప్యూటర్లను, మొబైల్ ఫోన్లను స్కాన్ చేస్తారని తెలిసింది. అయితే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండా ఇది అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఆదాయం కోసమే సోషల్ మీడియా పన్ను దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే ఈ పన్నును విధిస్తున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలో ఉగాండాది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆయిల్ నిక్షేపాలను వెలికితీసేందుకు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా పన్ను ద్వారా ఏటా 360 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆ దేశాధ్యక్షుడు ముసేవేని భావిస్తున్నారు. ఈ డబ్బును ఆయిల్‌ను వెలికి తీయడానికి ఉపయోగించాలని అనుకుంటున్నారు. -
బీఎస్ఎన్ఎల్ ‘మొబైల్ మనీ’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల తరహాలో బీఎస్ఎన్ఎల్ కూడా సెల్‌ఫోన్‌తో మరిన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టింది. టికెట్ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్‌తో పాటు డబ్బును బదిలీ చేసే విధానాన్ని సెల్‌ఫోన్ ద్వారా జరిపే కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్ఎన్ఎల్... దీన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. రూ.లక్షల లోపు పరిమితితో... ఈ సేవలు పొందాలనుకునేవారికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్‌తో పాటు ఆంధ్రాబ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఈ సేవ కావాలనుకున్న వినియోగదారులకు ఆంధ్రాబ్యాంకు ప్రత్యేకంగా వీసా సర్టిఫైడ్ ప్రీపెయిడ్ కార్డును ఇస్తుంది. దీనికి ప్రత్యేకంగా నంబర్ ఉంటుంది. ఈ కార్డుకు మొబైల్ నంబరును అనుసంధానిస్తారు. ఈ కార్డు గరిష్ట నగదు పరిమితి రూ.లక్ష. వినియోగదారు ఖాతా నుంచి ప్రీపెయిడ్ కార్డులోకి రూ.లక్షకు లోబడి అతను కోరుకున్న మొత్తాన్ని లోడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే అతనే తిరిగి దాన్ని బ్యాంకు ఖాతాలోకి మార్చుకోవచ్చు. షాపింగ్ చేసినప్పుడు బిల్లులను దుకాణదారు దగ్గరుండే ఈ తరహా కార్డుకు మొబైల్ ఫోన్ ద్వారా జమ చేయొచ్చు. ఆన్లైన్ షాపింగ్ సమయంలో ఈ కార్డు నంబరు ద్వారా డబ్బు చెల్లించొచ్చు. బస్సు, రైలు, సినిమా టికెట్ల బుకింగ్, ఫోన్, డీటీహెచ్ సర్వీస్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ చెల్లింపు దీని ద్వారా చేయొచ్చు. ఇక ఇలాంటి కార్డులు ఉన్నవారికి రూ.లక్షకు లోబడి డబ్బును కూడా బదిలీ చేయొచ్చు. ఇలాంటి కార్డు లేనివారికి చెల్లిం చాల్సి వస్తే... సమీపంలోని బీఎస్ఎన్ఎల్ రిటైలర్‌కు బదిలీ చేస్తే అక్కడి నుంచి ఆ వ్యక్తి డబ్బు పొందే వీలుంటుంది. మరో ఐదారు నెలల తర్వాత వేరే బ్యాంకు ఖాతాలకు కూడా చెల్లించే వసతి అందుబాటులోకి తేనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో బ్యాంకు ఖాతాతో సంబం ధం లేకుండా నేరుగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి మరో బీఎస్ఎన్ఎల్ మొబైల్‌కు నేరుగా నగదు బదిలీ చేసే విధానం కూడా ప్రారంభిస్తామని, అయితే ఈ మొత్తాన్ని నగదు రూపం లో పొందే అవకాశం ఉండదని.. షాపింగ్, ఇతర అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుం దన్నారు. కాగా, ఈ సేవలను పొందేవారు 0.30 నుంచి 1 శాతం వరకు కమీషన్‌ను బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. తన బ్యాంకు నుంచి తన కార్డుకు కమీషన్ లేకుండానే నగదును మార్చుకోవచ్చు. కానీ, షాపింగ్ బిల్స్, నగదు బదిలీలకు మాత్రం కమీషన్ చెల్లించాలి. -
సెప్టెంబరు నుంచి ఎయిర్‌సెల్ 4జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌సెల్ సెప్టెంబరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పైలట్ కింద కేవలం ఎంటర్ప్రైస్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని 120 పట్టణాల్లో మూడు నెలల్లో పూర్తి స్థాయి 4జీ అందుబాటులోకి తేనున్నట్టు ఎయిర్‌సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ హర్దీప్ జోహర్ తెలిపారు. బుధవారమిక్కడ ‘అయిదు రాష్ట్రాలు-ఒకే ధర’ పేరుతో ఉచిత రోమింగ్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రోమింగ్ పథకాన్ని ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల కు పరిమితం చేసినా, వచ్చే ఫలితాలనుబట్టి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న మొబైల్ మనీ సేవలను సైతం సర్కిల్లో డిసెంబరుకల్లా వాణిజ్యపరంగా తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. అయిదు రాష్ట్రాలు-ఒకే ధర..: కొత్త పథకంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ ఈ అయిదు రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. అదనంగా చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్కమింగ్ కాల్స్ ఉచితం. అన్ని ఔట్‌గోయింగ్ కాల్స్‌కు ఒక సెకనుకు ఒక పైసా చార్జీ చేస్తారు. రాష్ట్రం మారగానే ఈ పథకం దానంతట అదే వర్తిస్తుంది. ఎస్ఎంఎస్, పాకెట్ ఇంటర్నెట్ ప్యాక్‌లలో ఎటువంటి మార్పు ఉండదు. యదాతథంగా వాడుకోవచ్చు. కొత్త రోమింగ్ పథకం రాకతో కస్టమర్ల సంఖ్యలో 10% వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. -
రాష్ట్రంలో వొడాఫోన్ ఎం-పెసా సేవలు షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్ మనీ సేవలు ‘ఎం-పెసా’ ప్రారంభించింది. వొడాఫోన్ కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా మరే ఇతర టెలికం ఆపరేటర్లకు చెందిన మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ దేశంలో ఎక్కడున్నా నగదు పంపవచ్చు. ఈ మొత్తాన్ని స్వీకరించినవారు సమీపంలోని వొడాఫోన్ ఎం-పెసా కేంద్రానికి వెళ్లి నగదు స్వీకరించవచ్చు. బిల్లుల చెల్లింపులు, మొబైల్, డీటీహెచ్ రిచార్జ్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన దుకాణాల్లో మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఇ-కామర్స్ సైట్లలో వస్తువులను కొనుక్కోవచ్చు. డిపాజిట్‌పై 4 శాతం వడ్డీ కూడా పొందవచ్చు. బతుకుదెరువు కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్నవారికి ఇది ఎంతో ఉపయుక్తమని ఎం-పెసా బిజినెస్ హెడ్ సురేశ్ సేథి బుధవారమిక్కడ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3,826 ఎం-పెసా ఔట్లెట్లు ఉన్నాయని ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా పేర్కొన్నారు. ఇలా పనిచేస్తుంది..: వొడాఫోన్ కస్టమర్ తన ఫోన్ నుంచి గానీ, సమీపంలోని ఎం-పెసా ఔట్‌లెట్‌కు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ఫోన్ నంబరు ఆధారంగా ఒక ఖాతా(వాలెట్) తెరుస్తారు. పేరు నమోదుకు రూ. 200, యాక్టివేషన్‌కు రూ.100 రుసుం చెల్లించాలి. వాలెట్లో రూ.50 వేల వరకు డబ్బు జమ చేసుకోవచ్చు. నగదు స్వీకరించేవారికి ఎం-పెసా వాలెట్ ఉం డక్కరలేదు. రోజుకు రూ.5 వేలు, నెలకు రూ.25 వేల వరకే పంపొచ్చు. లావాదేవీనిబట్టి రూ.1-180 దాకా చార్జీ చేస్తారు. ఏపీలో అడుగు పెట్టడంతో ఎం-పెసా సేవలు దేశవ్యాప్తంగా విస్తరిం చినట్లయిందని వొడాఫోన్ ఇండియా సీవోవో సునిల్ సూధ్ తెలిపారు.