సాక్షి, వెబ్ డెస్క్ : ‘సోషల్ మీడియా పన్ను’ఈ మాట ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సాంకేతికత వృద్ధి చెందిన తర్వాత నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రలోకి జారుకునే వరకూ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, స్కైప్ ఇలా పలు రకాల మాద్యామాల వినియోగానికి ప్రపంచం అలవాటు పడింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వినియోగించాలి అంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలనే వార్తకు యువత నోట మాట రావడం లేదు. కేవలం వార్తకే ఇలా ప్రపంచ యువత షాక్‌కు గురవుతుంటే, జులై 1న ఉగాండా ప్రభుత్వం అధికారికంగా సోషల్ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది.
దీనిపై ఆ దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది. అయితే, ఉగాండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నట్లుండి ఏమీ తీసుకోలేదు. ముందుగానే ఈ పన్నును విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, స్కైప్ వంటి సోషల్ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌ను చెల్లించాలి.దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు. 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(టీఆర్‌ఏ) ఎన్నికల సందర్భంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
సోషల్ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియా పన్నును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టీఆర్‌ఏ సూచించింది. అమల్లోకి వచ్చిన పన్నును ఎలా చెల్లించాలనే దానిపై ఎంటీఎన్, ఎయిర్‌టెల్, ఆఫ్రిసెల్‌లు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కాగా, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.
పోర్న్‌పైనా దృష్టి
పోర్న్ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు ఉగాండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రత్యేక డివైజ్‌ను ఆ దేశం ఇందుకోసం తెప్పించినట్లు సమాచారం. దీని ద్వారా దేశంలో ఇంటర్నెట్ వినియోగించే ప్రతి ఒక్కరి కంప్యూటర్లను, మొబైల్ ఫోన్లను స్కాన్ చేస్తారని తెలిసింది. అయితే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండా ఇది అసాధ్యమని నిపుణులు అంటున్నారు.
ఆదాయం కోసమే సోషల్ మీడియా పన్ను
దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే ఈ పన్నును విధిస్తున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలో ఉగాండాది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆయిల్ నిక్షేపాలను వెలికితీసేందుకు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా పన్ను ద్వారా ఏటా 360 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆ దేశాధ్యక్షుడు ముసేవేని భావిస్తున్నారు. ఈ డబ్బును ఆయిల్‌ను వెలికి తీయడానికి ఉపయోగించాలని అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment