అమెజాన్ లో ఆ వస్తువులు ఫేక్ అట!
శాన్ ఫ్రాన్సిస్కో: ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, గ్రూపాన్ లు అధికారికంగా అమ్ముతున్న ఆపిల్ మొబైళ్లకు సంబంధించిన కొన్ని వస్తువులు నకిలీవని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్పత్తుల అమ్మకదారు 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ'పై కోర్టులో కేసు వేసింది. 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' ఈ-కామర్స్ సైట్లకు అందిస్తున్న ఆపిల్ ఉత్పత్తుల్లో 90శాతం నకిలీవని పిటిషన్ లో పేర్కొంది.
అమెజాన్ లో అమ్ముడవుతున్న ఆపిల్ యూఎస్ బీ కేబుల్స్, పవర్ అడాప్టర్లు నకిలీవని అమెజాన్ బ్రాండ్ కు ఉన్న వ్యాల్యూతో వినియోగదారులను 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' మోసం చేస్తోందని ఆపిల్ ఆరోపించింది. అమెజాన్ లో లభ్యమవుతున్న పది రకాల ఆపిల్ ప్రొడక్ట్స్ లో తొమ్మిది నకిలీవని చెప్పింది.
కాపీరైట్స్ నిబంధనల ఉల్లంఘన కింద 15లక్షల డాలర్లు, ఆపిల్ కంపెనీ పేరును ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నందుకు మరో రెండు మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరింది. కాగా, దీనిపై స్పందించిన అమెజాన్ నకిలీ వస్తువుల అమ్మకాన్ని కంపెనీ సహించబోదని తెలిపింది. తయారీదారులు, ప్రముఖ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని చెప్పిన అమెజాన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.