ఏసీ బస్సులు కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ‘దేశవ్యాప్తంగా ప్రీమియం నమూనా ఏసీ సిటీ బస్సులు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అయినా... మెట్రోపాలిటన్ నగరాల్లో వాటిని తిప్పాల్సిందే. ఇప్పటి వరకు ఆ మోడల్ బస్సులు హైదరాబాద్‌లో తిప్పలేదు. ఈసారి కొనాల్సిందే..’’ అని తాజాగా జేఎన్ఎన్యూఆర్ఎం హుకుం జారీ చేసింది. దాంతో ఆర్టీసీ హడావుడిగా రూ.80 కోట్ల విలువైన వోల్వో ఏసీ బస్సులను కొంటోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర నగరాల్లో వీటిని తిప్పుతున్నారు. ఇందులో ఒక్క ఢిల్లీలో మాత్రమే ఈ బస్సులు ఆర్థికంగా విజయవంతమయ్యాయి.
మిగతా చోట్ల నష్టాలనే మిగిల్చాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో సాధారణ ఏసీ బస్సులతో తీవ్ర నష్టం వాటిల్లుతున్న తరుణంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఒత్తిడితో ఆర్టీసీ వాటిని కొంటోంది.
వ్యాట్.. ఎంవీ ట్యాక్స్ నుంచి మినహాయింపు...
ఈ బస్సులు కొంటే వ్యాట్.. మోటార్ వెహికల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామని జే ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తాయిలం ప్రకటించటంతో ఆర్టీసీ కూడా దానికి సరేననేసింది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం నిబంధనల ప్రకారం వ్యాట్ రూపంలో బస్సు ధర పై 14.5 శాతం, ఎంవీ ట్యాక్స్ రూపంలో బస్సు రాబడిపై 5 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మినహా ఈ ప్రీమియం మోడల్ బస్సులతో ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు ఉండదని ఆర్టీసీ నిర్ధారించుకుంది. ఒక్కోటి రూ.95 లక్షల విలువైన బస్సులు కొనేందుకు అవుతున్న రూ.80 కోట్ల మొత్తంలో జేఎన్ఎన్యూఆర్ఎం 35 శాతాన్ని గ్రాంటుగా ఇస్తుంది.
హైదరాబాద్‌కు ప్రస్తుతం ప్రీమియం మోడల్ ఏసీ బస్సులను మాత్రమే కేటాయిస్తామనే కొర్రీ పెట్టడంతో ఆర్టీసీకి గత్యంతరం లేకుండాపోయింది. ఇదే పథకం కింద ఇప్పుడు కరీంనగర్‌కు 70, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు 40 చొప్పున సాధారణ బస్సులు ఇచ్చేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం సమ్మతించింది. అలాగే వరంగల్ నగరాన్ని ఈ పథకం కిందకు తెచ్చే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఒప్పుకొంది. ఫలితంగా హైదరాబాద్ కోసం 80 ఏసీ బస్సులు కొనాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెల్ల ఏనుగుల్లా మారతాయని తెలిసి కూడా ఆర్టీసీ వోల్వో ఏసీ బస్సులను కొనేందుకు సిద్ధపడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీసీ రూ.32 కోట్లను ఖర్చు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు భరిస్తుంది.