జిల్లాలో ఇక మోడల్ హైస్కూళ్లు
కుప్పంలో భేటీ అయిన అధికారులు
{పైవేటుకు దీటుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ
తొలుత ప్రయోగాత్మకంగా కుప్పంలో ఏర్పాటుకు కసరత్తు
చిత్తూరు (టౌన్): జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మోడల్ హైస్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జిల్లా ప్రజాపరిషత్ ఆధీనంలో నడిచే విధంగా ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోనుంది. జిల్లాలో ఇప్పటివరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, బెస్ట్ కార్పొరేట్ కాలేజెస్ పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాలల నిర్వహణ సంస్థ పరిధిలో మాత్రమే నడుస్తున్నాయి.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఐదు నుంచి పదో తరగతి వరకు, బెస్ట్ కార్పొరేట్ కాలేజీలో జూనియర్ ఇంటర్ నుంచి, గురుకుల పాఠశాలల్లో ఏడవ తరగతి నుంచి అడ్మిషన్లు చేపడుతున్నారు. జిల్లాలో 9 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, 15 బెస్ట్ కార్పొరేట్ కాలేజీలు, 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా ప్రజాపరిషత్ ఆధీనంలో నడిచే విధంగా ప్రభుత్వం త్వరలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ముందుగా సీఎం నియోజకవర్గమైన కుప్పంలో ప్రయోగాత్మకంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
గురుకుల పాఠశాలలకన్నా మిన్నగా..
గురుకుల పాఠశాలల కన్నా మిన్నగా మోడల్ స్కూళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించే చర్యలు తీసుకుంటోంది. తరగతి గదులతో పాటు విద్యార్థులు నిద్రించేందుకు అవసరమైన గదుల నిర్మాణాలను కూడా చేపట్టనుంది. ప్రయోగాత్మకంగా దీన్ని ఒక హైస్కూల్లో చేపట్టి వచ్చే ఫలితాల ఆధారంగా తొలుత ఒక జిల్లా ఆ తర్వాత రాష్ట్రమంతటా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
అధికారుల భేటీ
ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మోడల్ స్కూల్‌ను కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించే బాధ్యతను కలెక్టర్ కొంతమంది అధికారులకు అప్పగించారని తెలిసింది. దాంతో జిల్లాకు చెందిన కొంతమంది అధికారులు మంగళవారం కుప్పంలో భేటీ అయ్యారు.
కడా స్పెషలాఫీసర్, జెడ్పీ సీఈవో, డీఈవోతో పాటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలస్పెషలాఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులంతా భేటీ అయి ఏ పాఠశాలను ఎంపిక చేయాలనే దానిపై చర్చించారు. జెడ్పీ పరిధిలో నడుస్తున్న హైస్కూళ్లలో ఖాళీస్థలం ఎక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని ఆ తర్వాత అన్నిటికీ అనువుగా ఉన్న దాన్ని ఎంపిక చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
ఆ తర్వాత పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ నిద్రించే వసతితో పాటు మరుగుదొడ్లు, స్నానపు గదులను నిర్మించేందుకు ఎంతెంత స్థలం, ఏమేరకు నిధులు అవసరం తదితర విషయాలను కూడా వీరు చర్చించారు. వీరంతా కలిసి కుప్పం పరిధిలోని మూడు హైస్కూళ్లను ఎంపిక చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ మూడింటిలో ఒకదాన్ని కలెక్టర్ ఎంపిక చేస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికంతటికీ కొంత సమయం పట్టే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు.