ఆదర్శ బడుల్లో ప్రవేశానికి ఎంపిక
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న 10 ఆదర్శ పాఠశాలల్లో 2014-15 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపికను మంగళవారం నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. విద్యార్థుల ఎంపిక కమిటీ చైర్మన్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ లాటరీ తీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో దర్శి, ముండ్లమూరు, ఉలవపాడు, మార్కాపురం, కనిగిరి, రాచర్ల, వలేటివారిపాలెం, కందుకూరు, లింగసముద్రం, దోర్నాలలో ఆదర్శ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో 80 సీట్ల చొప్పున మొత్తం 800 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. దర్శి ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి అత్యధికంగా 431 మంది దరఖాస్తు చేయగా, దోర్నాలలోని పాఠశాలకు అతి తక్కువగా 111 దరఖాస్తులు అందాయి. ముండ్లమూరుకు 239, ఉలవపాడు 215, మార్కాపురం 209, కనిగిరి 196, రాచర్ల 193, వలేటివారిపాలెం 184, కందుకూరు 174, లింగసముద్రం పాఠశాలకు 125 మంది దరఖాస్తు చేశారు. 29న ఆయా పాఠశాలల్లోని నోటీసు బోర్డులో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రకటిస్తారు.
ఈ నెల 30 నుంచి జూన్ 7వ తేదీలోపు ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల (విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణలు, ఇతర పత్రాలు)ను ఆయా పాఠశాలల్లో సమర్పించి ప్రవేశం పొందాలి. విద్యార్థుల ఎంపిక జాబితాతో పాటు వెయిటింగ్ లిస్టును కూడా తయారు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులెవరైనా చేరకపోతే వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులోని వారికి ప్రవేశం కల్పిస్తారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.