Modern Art
-
భళా.. చిత్రకళా..!
మనసులో మెదిలే భావాలకు రంగులరూపం దిద్దుతూ.. ప్రకృతి అందాలని మనసులో నిక్షిప్తం చేసుకుని సృజనాత్మకత జోడించి కుంచెతో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రాచీన కళ పెయింటింగ్.. ప్రాచీనకళగా గుర్తింపు పొందిన చిత్రలేఖనం నేడు ఆధునిక హంగులు అందుకున్న కార్పొరేట్ అవకాశాలను సైతం దక్కించుకుంటూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కోర్సు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉంది. ఏఎఫ్‌యూ : వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఏర్పాటైన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఏ పెయింటింగ్ అందుబాటులో ఉంది. 40 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందేందుకు అర్హులు. ప్రస్తుతం సమాజంలో కళాభిలాష పెరిగిన నేపథ్యంలో పెయింటింగ్ యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఆయిల్పెయింట్, వాటర్, ఆక్రిలిక్ పెయింట్, టెంపెరా పెయింట్ వంటి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో చిత్రలేఖనానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సృజనాత్మకత కలిగిన ప్రతిరంగానికి ఇది విస్తరించింది. కాలానికి అనుగుణంగా చిత్రలేఖనంలో సైతం మార్పులు చోటుచేసుకుని సాఫ్ట్వేర్ రంగం వరకు విస్తరించింది. వెబ్, గ్రాఫిక్డిజైనర్గా, యానిమేటెడ్ ఆర్టిస్ట్‌గా, త్రీడీ, టూడీ కన్సల్టెంట్‌గా, ఆర్ట్గేమ్ డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్, ఫాంట్ డిజైనర్, మ్యూరల్ ఆర్టిస్ట్, ఆర్ట్ హిస్టారియన్, బుక్ ఇలస్ట్రేటర్, కామిక్ ఆర్టిస్ట్, ఫర్చీనర్ డిజైనర్, పోలీస్ స్కెచ్ ఆర్టిస్ట్ ఇలా విభిన్న రంగాల్లో వీరికి కొలువులు లభిస్తాయి. విద్యార్థిదశ నుంచే ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా ఆర్జన ప్రారంభించవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో డ్రాయింగ్ టీచర్‌గా, అధ్యాపకులుగా రాణించవచ్చు. తమ చిత్రకళా ప్రదర్శనల ద్వారా ఆర్థిక పరిపుష్టి, పేరు ప్రఖ్యాతులు సాధించవచ్చు. ఉన్నతవిద్యలో అవకాశాలు.. బీఎఫ్ఏ పూర్తి చేసిన వారికి మాస్టర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ పెయింటింగ్, ఆర్ట్హిస్టరీ, ప్రింట్మేకింగ్లలో పీజీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు బెంగుళూరు ఐఐఎస్సీ, యూఉడీ, ఐడీసీ, నిఫ్ట్, ఎన్ఐడీ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లు పొందే అవకాశం ఉంది. ఉజ్వల భవిష్యత్‌కు మార్గం.. విభిన్నంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత కలిగిన వారికి ఈ కోర్సు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా సాఫ్ట్వేర్, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ చిత్రలేఖనం ద్వారా ఉపాధి మార్గాలతో పాటు చక్కటి పేరు ప్రఖ్యాతులు అందించే కోర్సు. – వై. మనోహర్‌రావు, కోఆర్డినేటర్, బీఎఫ్ఏ పెయింటింగ్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ -
మధ్య రాతియుగం ‘మోడ్రన్ ఆర్ట్’!
పాకుతున్న ఓ భారీ ఉడుము...ఆ పక్కనే తాబేలు డిప్పలో ఉండే ఆకృతుల సమ్మేళనం.. ఓ పక్కకు చూస్తే కుక్కలాంటి ఆకారం.. దానికి ఎదురుగా క్రమపద్ధతిలో పేర్చినట్టుగా అర్ధ చతురస్రాకారపు గీతల బొత్తి, అద్దంలో ప్రతిబింబంలా ఒకదానికొకటి విరుద్ధ దిశల్లో... మనిషిలాగా కనిపిస్తుంది, కాదు అది మృగమనే భావన ఆ వెంటనే కలిగే వింత ఆకృతి.. చుట్టూ మోహరించిన జలచరాలు, సరీసృపాలు, ఉభయచర జీవులను తలపించే మరిన్ని ఆకారాలు.. దాదాపు 28 అడుగుల పొడవున్న కాన్వాస్‌పై రూపొందించిన చిత్రాలివి. చూడగానే ఓ మోడ్రన్ ఆర్ట్‌ను తలపిస్తుందది. చిత్రాల ఆకారాలను సులభంగా పోల్చుకునేలా ఉండవు, కానీ మనసులో మెదిలే ఏవేవో భావాలకు ప్రతిరూపాలన్నట్టుగా తోస్తాయి. ఒకదాని కొకటి పొంతన ఉండవు, వేటికవే ప్రత్యేకం. ఇంతకూ ఆ చిత్ర విచిత్ర చిత్రాల సమాహారంగా ఉన్న కాన్వాస్ వయసెంతో తెలుసా? దాదాపు పది వేల నుంచి పదిహేను వేల ఏళ్లు - సాక్షి, హైదరాబాద్ ఆదిమానవుల చిత్రాలతో కూడిన గుహలు అడపాదడపా కనిపిస్తుంటాయి. దట్టమైన అడవులే కాదు, ఊరి పొలిమేరల్లో ఉండే గుట్ట రాళ్లపై ఎరుపురంగు చిత్రాలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తూనే ఉంటాయి. నాటి మానవులు ఆవాసంగా మార్చుకున్న గుహ గోడలు, పైకప్పుపై రెండుమూడు చిత్రాలు, కొన్ని అంతుచిక్కని గీతలుంటాయి. కానీ, ఓ కాన్వాస్ తరహాలో ఎక్కువ సంఖ్యలో చిత్రాల సమూహం వెలుగు చూడటం మాత్రం అరుదు. అలాంటి అరుదైన రాక్ పెయింటింగ్స్ ఇప్పుడు భద్రాచలం అడవుల్లో బయటపడ్డాయి. పాల్వంచ సమీపంలోని ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలుగుచూసింది. గతంలో సమీపంలోని అక్షరలొద్దిలో ఆదిమానవుల చిత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక ఉపాధ్యాయుడు కొండవీటి గోపివరప్రసాద్రావు వీటిని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కట్టా శ్రీనివాస్, శ్రీరామోజు హరగోపాల్, రాక్‌ఆర్ట్ సొసైటీ సభ్యులు డాక్టర్ మరళీధర్రెడ్డిలు వాటిని పరిశీలించి మధ్య రాతి యుగం నాటివి అయి ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని తరాల చిత్రాలు.. ఒంటి గుండుగా పేర్కొనే ఈ గుహలోని చిత్రాలు ఒకేసారి వేసినవి కావు. కొన్ని తరాలుగా వాటిని వేరువేరు మనుషులు గీస్తూ వచ్చారు. రంగు కొంత వెలిసిపోయి పాత చిత్రాలుగా కనిపిస్తుండగా, వాటిపై కొత్తగా వేసినట్టుగా మరికొన్ని చిత్రాలు ఎర్రటి రంగుతో మెరుస్తున్నాయి. ఈ గుహ కొన్ని తరాలపాటు మానవ ఆవాసంగా ఉందనటానికి ఇదో నిదర్శనం. చుట్టూ నీటి వనరులు ఉండటం, సమీపం అంతా మైదాన ప్రాంతంగా ఉండటం, గుండు ఎక్కితే దూరం నుంచే జంతువుల జాడ తెలుసుకునే వీలుండటంతో ఇది మానవ ఆవాసంగా చాలాకాలంపాటు వాడుకున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొన్ని తరాల జనం ఆ గుహ గోడలను బొమ్మలతో నింపేశారు. సాధారణంగా ఆదిమానవుల చిత్రాల్లో మనుషులకు మచ్చికయ్యే పశువుల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత తరం వారు ఎక్కువగా ఎద్దుల చిత్రాలు గీసేవారు, కొన్ని చోట్ల శునకాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పశువుల చిత్రాలు లేకపోవటం విశేషం. దీన్నిబట్టి వ్యవసాయ విధానం ప్రారంభించకపూర్వంనాటి మనుషులు ఈ చిత్రాలు గీసి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక మన దగ్గర కనిపించే చిత్రాలు ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు అన్ని చిత్రాలు ఎరుపు రంగుతోనే వేసినా, కొన్నింటికి తెలుపు రంగుతో అంచులు అద్దారు. మధ్య మధ్య తెలుపు రంగు చుక్కలతో ముస్తాబు చేసినట్టు ఉండటం విశేషం. ఆఫ్రికాలోని సాన్ థామస్ రివర్ ప్రాంతంలో కనిపించిన చిత్రాలను పోలి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో రాళ్లపై గీతలతో చెక్కిన పెట్రో గ్లివ్స్ చిత్రాలు కూడా కనిపించాయి. కొన్ని అసంపూర్తి శిల్పాలు కూడా కానవచ్చాయి. తరువాతి పాలకులు ఇక్కడ ఏదో నిర్మాణం చేపట్టాలనుకుని కొంత పనిచేసి వదిలేసినట్టు అనిపిస్తోంది. ఈ రాతి చిత్రాల గుహ ఆదిమానవులపై ఎన్నో పరిశోధనలకు వీలుగా ఉన్నందున అది ధ్వంసం కాకుండా ప్రభుత్వం కాపాడాల్సి ఉంది. -
ఇంటి అందం రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్ : గతంలో గోడలకు సున్నం వేయించడమే పెద్ద అలంకరణ. అలాంటిదిప్పుడు గోడలకు చిత్రాలు (ఆర్ట్స్) తగిలించుకోవటం ట్రెండ్. మోడరన్ ఆర్ట్ కేన్వాస్లు నివాస గృహాలతో పాటు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల గోడల మీద దర్శనమిస్తాయి. ► చిత్రాలను వేలాడదీయాల్సిన ఆయా ప్రదేశాలను బట్టి ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు, తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత చిత్రాలు వేలాడదీయవచ్చు. ► కార్యాలయాల్లో అతిథులు వేచి ఉండే చోట చూడగానే వెంటనే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వాటిని చూసీ చూడకముందే ఆ కార్యాలయ నిర్వాహకుడిపై అతిథులు ఒక అంచనాకు రాకూడదన్నమాట. అధునాతన చిత్రాన్ని అర్థం చేసుకునే పనిలో అతిథి మునిగిపోతే విసుగు పుట్టకుండా కాలం వెళ్లదీసే అవకాశం ఉంటుంది. కార్యాలయ గోడలకు వేలాడుతున్న మోడరన్ ఆర్ట్‌కు ఇచ్చేంత గౌరవాన్ని దానికి సంబంధించిన వారు కూడా అతిథుల నుంచి అందుకుంటారు. ► సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంతత కలగజేస్తాయి. ముదురు రంగులు మనసును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లోనూ తెలుపు, నీలం, చిలకాకుపచ్చ, పసుపు రంగులు మృదువుగా కనిపిస్తాయి. ఎరుపు, ముదురు ఆకుపచ ్చ, నలుపు రంగులు కంటిని సైతం బెదరగొడతాయి. తేలికపాటి రంగులను ఎంపిక చేసుకోవడ మంచిదేగానీ, గోడ రంగులో చిత్రాలు కలసి కనపడకుండాపోయే ప్రమాదం ఉంటుంది.