నరహంతకుల ముఠా లీడర్ ఓ సిపాయి !
అత్యాధునిక తుపాకీ,యూఎస్ఏ కత్తుల వినియోగ ం
రెండు వందలకుపైగా నేరాలు
కానిస్టేబుల్, హోంగార్డు హత్యకేసులో వెలుగుచూస్తున్న అంశాలు
పలమనేరు, న్యూస్‌లైన్ : సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించాల్సిన ఓ సిపాయి నరహంతకుల ముఠాకు నాయకుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇలా లెక్కలేనన్ని నేరాలు చేస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అతని నాయకత్వంలోని ముఠా మూడేళ్లుగా మూడు రాష్ట్రాల్లో రెండు వందలకుపైగా నేరాలకు పాల్పడింది. పలమనేరులో కానిస్టేబుల్, హోంగార్డు హత్యకేసులో అరెస్టయిన ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి..
తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరికి చెందిన వెల్లయన్ మణికంఠ అలియాస్ సంపత్ (27) చిన్నతనం నుంచే దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవాడు. ఇప్పటికే పదేళ్లపాటు జైల్లో గడిపాడు. ఇతనికి జైలులో ధర్మపురి జిల్లా ఆరూరుకు చెందిన కృష్ణ పరిచయమయ్యాడు. ఇతను చిన్నాన్నను హత్య చేసిన కేసులో జైలుకొచ్చాడు. పలు నేరాలకు పాల్పడిన ప్రేమ్ జైలులో వీరికి జత అయ్యాడు. కృష్ణను బెయిల్పైకి తీసుకువచ్చాడు అన్న గోవిందస్వామి. తర్వాత సంపత్, ప్రేమ్‌లను జైలు నుంచి బయటకు తీసుకువచ్చాడు. వీరిని కృష్ణ తన సొంతూరులో ఉంచాడు.
తమ్ముడు కృష్ణ సర్టిఫికెట్లతో మిలటరీలో ఉద్యోగం పొందాడు గోవిందస్వామి.అప్పటికే అతను పలు నేరాలు, మోసాల్లో ఆరితేరి ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సంపత్, ప్రేమ్, తమ్ముడు కృష్ణతో పాటు మరికొంత మందితో కలసి ఓ ముఠాను తయారుచేయాలని భావించాడు. అరక్కోణానికి చెందిన సతీష్, ఇతని భార్య బొమ్మి అలియాస్ లక్ష్మి, కరా్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌కు చెందిన శీను (కైగల్ ప్రేమికుల హత్య కేసులో ప్రధాన నిందితుడు), అన్నయ్య, మోహన్‌లను కలిపి గ్యాంగ్‌ను తయారు చేశాడు. అలాగే సేలానికి చెందిన పెరుమాల్‌ను ముఠాలో చేర్చాడు.
జమ్ముకాశ్మీర్ నుంచి తుపాకులు
ఈ గ్యాంగ్‌ను మరింత పదును పెట్టే ఉద్దేశంతో మిలటరీ గోవిందస్వామి జమ్ముకాశ్మీర్ నుంచి రెండు అత్యాధునిక తుపాకులను తెచ్చాడు. అందులో ఒక దానిని బెంగళూరులో విక్రయించాడు. మరో తుపాకీని ముఠా సభ్యులకు ఇచ్చాడు. హత్యలు, దోపిడీలు కొత్త పద్ధతుల్లో ఎలా చేయాలో శిక్షణ ఇచ్చాడు. ఇలా మూడు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని నేరాలకు ఈ ముఠా పాల్పడింది.
అనుమానం వస్తే ఎవరినీ వదలరు
గ్యాంగ్‌లో ఎవరిపైన అయినా అనుమానం కలిగితే వారిని మట్టుపెట్టడం సంపత్ నైజం. ముఠాలోని పెరుమాల్, సతీష్‌లపై అనుమానం రావడంతో వారిని అంతమొందించాడు. పెరుమాల్‌ను బండరాయిలతో కొట్టి హత్య చేశాడు. అలాగే చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద సతీష్‌ను హత్య చేశా డు. తర్వాత సతీష్ భార్య లక్ష్మిని గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు.
కేటిల్‌ఫామ్‌లో కాపురం
ఈ గ్యాంగ్‌లోని సతీష్ హత్యకు గురికాకముందు పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్‌లో నివాసముండేవాడు. రైల్వే ఉద్యోగి అయిన ఇతను రైస్‌పుల్లింగ్, దొంగనోట్లు, నకిలీ వజ్రాలు తదితర మోసాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి స్థానికులైన నక్కపల్లె రామిరెడ్డి, కడతట్లపల్లెకు చెందిన రాజేంద్ర, కేటిల్ఫామ్నకే చెందిన విజయకుమార్ పరిచయమయ్యారు. సతీష్ వద్ద దొంగనోట్ల వ్యవహారంలో మోసానికి గురైన తవణంపల్లె మండలం రామాపురానికి చెందిన ప్రతాప్ వీరికి జతకలిశాడు. వీరందరూ సతీష్ ద్వారా సంపత్ గ్యాంగ్‌లో ఉంటూ నేరాలకు పాల్పడ్డారు.
లవర్స్స్పాట్లలో ఇన్ఫార్మర్లు..
జిల్లాలోని కైగల్ జలపాతం, మొగిలి ఘాట్, గాంధీనగర్, జగమర్ల అటవీ ప్రాంతాలు, ముసలిమడుగు, బోయకొండ, బంగారుపాళెం సమీపంలోని వజ్రాల గంగమ్మ ఆలయ అటవీ ప్రాంతం, చంద్రగిరి కోట, భాకరాపేట అటవీ ప్రాంతం, చిత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతం, పెనుమూరు, గంగాధరనెల్లూరులతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన ప్రేమజంటలు వెళ్లే ఏకాంత ప్రదేశాలను వీరు టార్గెట్ చేశారు. ఈ ప్రదేశాల్లో ఇన్ఫార్మర్లను పెట్టుకుని వారి ద్వారా అక్కడకు వెళ్లి అత్యాచారాలకు పాల్పడేవారు.
హంతకులను పట్టించిన సిమ్‌కార్డు
ఈ కరుడుగట్టిన గ్యాంగ్‌ను ఓ సిమ్‌కార్డు పట్టించింది. గతేడాది డిసెంబర్ రెండో వారంలో బంగారుపాళెం సమీపంలోని వజ్రాలపురం అటవీప్రాంతంలో ఓ ప్రేమజంటపై దాడి జరిగింది. ప్రియుడు ఈ గ్యాంగ్ సభ్యులపై ఎదురు తిరగడం అదే సమయానికి స్థానికులు రావడంతో వారు ఓ బైక్‌ను, జెర్కిన్, కత్తులను వదిలి పారిపోయారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ జెర్కిన్లోని సిమ్‌కార్డును గుర్తించి విచారణ చేపట్టారు. ఆ సిమ్‌కార్డు గంగాధర నెల్లూరు ప్రాంతానికి చెందిన ఓ యువతిగా తేలింది. తీగలాగితే డొంకంతా కదిలింది. అక్కడి నుంచి పలమనేరుకే చెందిన ఓ యువతి సైతం వీరి బారిన పడిందని తేలింది. ఆమెను పోలీసులు విచారించగా తవణంపల్లె ప్రతాప్ పేరు బయటకొచ్చింది. ప్రతాప్ ద్వారా గ్యాంగ్ బండారం బయటపడింది. వీరు ఉపయోగించే అత్యాధునిక కత్తులు యూఎస్ఏలో తయారైనవిగా పోలీసులు గుర్తించారు.