ఫెస్టివెల్ ఆర్టిస్టు
పుట్టింది ముస్లిం కుటుంబంలోనైనా హిందూ సంప్రదాయాలను, క్రిస్మస్ ఆచారాలను గౌరవిస్తాడు. ఉగాది, హోళీ, సంక్రాంతి, బతుకమ్మ, మహంకాళీ బోనాలు, రంజాన్, క్రిస్మస్, బక్రీద్... పండుగ ఏదైనా విశిష్టతను కాన్వాస్‌పై పరుస్తాడు. షడ్రుచులను... సప్తవర్ణాలతో ఆవిష్కరిస్తున్న ఆర్టిస్టు మహమ్మద్ రుస్తుమ్ను ఉగాది సందర్భంగా సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
మాది మెదక్ జిల్లా నెర్దొడ్డి మండలం అల్వాల్. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంటర్, డిగ్రీ సిద్ధిపేటలోని గవర్నమెంట్ కాలేజీల్లో చేశా. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ మీద ఉన్న ఆసక్తితో మైసూరు యూనివర్సిటీ నుంచి బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ చేశా. నా స్కూలింగ్ డేస్‌లో టీచర్ ఇబ్రహీం డ్రాయింగ్ పాఠాలు నేర్పాడు. ఊళ్లల్లో హిందువుల పండుగ సంబురాల్లో ముస్లింలు పాల్గొంటారు. రంజాన్, మొహర్రం వేడుకల్లో హిందువులూ పాలుపంచుకుంటారు. అందుకే హిందూ పండుగలను దగ్గరగా చూసే అవకాశం దొరికింది. క్రిస్మస్ వేడుకల్లోనూ ఫ్రెండ్స్ అందరం పాల్గొనేవాళ్లం. అలా నా ఊరే నాకు ఐక్యతా రాగాన్ని నేర్పింది.
పండుగతోనే...
మొదట్లో పల్లెటూరి అందాలను ఫోకస్ చేస్తూ పెయింటింగ్స్ వేసేవాన్ని. నెర్దొడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలోనే డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మెదక్ జిల్లా సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా సేవలందిస్తున్నా. పండుగ వచ్చిదంటే పల్లె వాతావరణమంతా మారిపోతుంది. అదే నా కాన్వాస్‌కు పనిచెబుతుంది. పండుగ నేపథ్యంతోనే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు గీశా. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో 50 ఎగ్జిబిషన్ల వరకు ఏర్పాటు చేశా.
సమాజంతో సంబంధం...
కళాకారుడికి సంబంధం ఉండాల్సింది మతంతో కాదు సమాజంతో. ఉగాది థీమ్ కూడా ఇలా ఎంచుకున్నదే. అడవికి పోయి చెరుకు గడలు, మామిడికాయలు, వేపపువ్వు, పచ్చి మిరపకాయలు, చింతకాయలు, ఆరు రకాల దినుసులతోని షడ్రుచి పచ్చడి తయారు చేయడం, వసంతంలో వచ్చే కొత్త రుచులతో పచ్చడి చేసి... అందరికీ పంచి... షడ్రుచుల్లాగే జీవితంలో కష్టనష్టాలను, సుఖసంతోషాలను ఆస్వాదించాలనే సందేశమిచ్చే పండుగ ఇది. మళ్లీ ఉగాది వరకు అంతా చల్లగా ఉండాలని పచ్చడి వితరణ చేస్తున్నట్టు కాన్వాస్‌పై చిత్రించేందుకు ప్రయత్నించా. ప్రస్తుతం బాచుపల్లి దగ్గర సాయినగర్‌లో క్వార్టర్ నంబర్ 88లో రుస్తుమ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నా.
వాంకె శ్రీనివాస్