Mohammad Usman Khan
-
చెడుల నిర్మూలనకు కంకణ బద్ధులు కావాలి
ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలి. నేడు సమాజంలో ఎటు చూసినా చెడులు, దుష్కార్యాలు పెరిగిపోతున్నాయి. మానవ జీవితంలోని అన్ని రంగాలనూ ఈ రుగ్మతలు పరివేష్టించాయి. చెడులతో పోల్చుకుంటే మంచి తక్కువగా కనబడుతోంది. నిజానికి మంచి అన్న మేరు పర్వతం ముందు చెడు చీడ పురుగులా గోచరించ వలసింది. కాని దురదృష్ట వశాత్తూ దుర్మార్గమే దొడ్డుగా ఉన్నట్లు కనబడతా ఉంది. ఈ దుస్థితి మారాలి. మార్చాల్సిన బాధ్యత సమాజ శ్రేయోభిలాషులందరిపై ఉంది. ముఖ్యంగా దైవ విశ్వాసులపై మరీ అధికంగా ఉంది. దుర్మార్గాల నిర్మూలన, సత్కార్యాల స్థాపన పైనే మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ’ మీలో కొందరు, ప్రజలను మంచి వైపుకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించే వారు, చెడులనుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యం పొందేవారు’..(3 –104). మరొక చోట:, ’విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే.. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు, దుష్కార్యాలనుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు’ అని చెప్పబడింది. (3–110) పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యాలు దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించాయి. దీన్నిబట్టి ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలని మనకు అర్ధమవుతోంది. అందుకే పవిత్ర ఖురాన్, ప్రజల్లో దైవ భీతిని, పరలోక చింతనను జనింపజేసి తద్వారా వారిని నీతిమంతులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషిస్తోంది. మూఢనమ్మకాలు, దురాచారాలతో సహా ప్రపంచంలోని అన్నిరకాల చెడులను నిర్మూలించి చక్కని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్యసాధన కోసం పవిత్ర ఖురాన్ దైవ విశ్వాసులపై మంచిని పెంచే, చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యత ను నిర్బంధం చేసింది. దీనికోసం దైవ విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తోంది. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
చిరస్మరణీయులు
పూర్వం ఇరాక్ దేశంలో నమ్రూద్ అనే చక్రవర్తి ఉండేవాడు. పరమ దుర్మార్గుడు. తనది సూర్యచంద్రాదుల వంశమని, తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. ప్రజలంతా బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజ దర్బారులో పూజారిగా పని చేస్తున్న‘అజర్’ ఇంట ఓ బాబు జన్మించాడు. అతని పేరే ఇబ్రాహీం. ఆయన్ని దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నమ్రూద్ దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధ రకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. తనయుని వైఖరి తండ్రికి నచ్చలేదు.మందలించాడు. చంపేస్తానని బెదిరించాడు. అయినా ఇబ్రాహీం అలైహిస్సలాం తన వైఖరి మానుకోలేదు. విషయం తెలుసుకున్న నమ్రూద్ ఇబ్రాహీం గారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నా దైవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావట. ఎవరో కనబడని దేవుణ్ణి గురించి చెబుతున్నావట. ఎవరా దేవుడు చెప్పు?’అని గర్జించాడు. ప్రశాంతచిత్తంతో మౌనంగా నిలబడి ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు. దీంతో.. ‘మాట్లాడవేం.. నీ దేవుడెవరో చెప్పు?’ అంటూ మళ్ళీ గాండ్రించాడు. అప్పుడు ఇబ్రాహీంగారు, ‘మహారాజా..! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు, ఆయనే మనందరి దేవుడు.’ అన్నారు. ‘..అలాగా..! అయితే చూడు..’ అంటూ ఒక ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన మరొక అమాయకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయేౖ ఖెదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత.., ‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతకవలసిన వాణ్ణి చంపేశాను. అంటే జీవన్మరణాలు నా చేతిలో ఉన్నాయి.. మరి నేను దేవుణ్ణికానా..?’ అంటూ చూశాడు గర్వంగా.. ఓహో.. జీవన్మరణాల అర్ధాన్ని ఈవిధంగా అన్వయించుకున్నావా..? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ణి తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింప జేస్తాడు. మరి నువ్వు, పశ్చిమాన ఉదయింపజేసి, తూర్పున అస్తమించేలా చేయి.’ అని సవాలు విసిరారు. దీంతో దైవద్రోహి అయిన నమ్రూద్ కు నోట మాట రాలేదు. గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఇతణ్ణి తీసుకెళ్ళి భగభగ మండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి.’ అని ఆదేశించాడు. రాజాజ్ఞ క్షణాల్లో కార్యరూపం దాల్చింది. పెద్ద అగ్నిగుండం రాజేసి, కణకణ మండుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయింది. ఇబ్రాహీం పాలిట పూల పానుపుగా మారిపోయింది. ఆయన సురక్షితంగా బయట పడ్డారు. తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతరప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్యధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినం ఆ మహనీయుని త్యాగస్మరణే. ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన కాబాలయం, జమ్ జమ్ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ అల్లాహ్ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆ మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కారుణ్యం కురిసే కాలం
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక అంశాల్లో ‘హజ్జ్’ కూడా ఒకటి. వెసులుబాటున్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్‌హజ్జ్ మాసంలో నిర్వహించబడుతుంది. అందుకే ఈ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ మాసంలోని మొదటి పదిరోజులు చాలా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడు రోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజాన్ మాసానికి, రమజాన్‌లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేకత ఉందో, అదేవిధంగా జిల్‌హజ్జ్ మాసంలోని మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. ఈ మొదటి దశకంలో అల్లాహ్ కారుణ్యం వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యతను కలిగి అల్లాహ్ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈదశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరమైనవికావు. అంటే, జిల్‌హజ్జ్ మాసం తొలి తొమ్మిది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహ్‌కు మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే అధిక ప్రీతికరం. ఈ రోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ఇందులోని ప్రతి రాత్రి ఆచరించే నఫిల్‌లు షబేఖద్ర్‌లో ఆచరించే నఫిల్లతో సమానం. నిజానికి ఇవి హజ్జ్ కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికి ప్రసాదించాడు. జిల్ హజ్జ్ మాసం ప్రారంభమవుతూనే, తమతమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళ వద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్జ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్జ్ మాసం పదవతేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. మక్కా వెళ్ళలేక పోయిన యావత్ ప్రపంచంలోని ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరిస్తూ వారితో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా జిల్ హజ్ మాసం మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన ఆయన కారుణ్యాన్ని పొందడానికి కృషిచేయాలి. మక్కా వెళ్ళి హజ్జ్ ఆచరించే స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్ తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కనుక హజ్జ్ పరమార్థాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దివికేగిన దివ్యతేజం!
ప్రవక్త జీవితం అది హిజ్రీశకం పదోసంవత్సరం. జీఖాదా నెల. ప్రవక్తమహనీయులు హజ్ యాత్రకోసం మక్కావెళ్ళాలని సంకల్పించుకున్నారు. అనుచరులు కూడా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ విషయం తెలియగానే విశ్వాసులంతా ఆనందడోలికల్లో తేలియాడుతూ యాత్రకు సన్నద్ధమయ్యారు. లక్షమందికి పైగా హజ్ యాత్రికుల జనవాహిని చీమల బారులా కదిలింది. ’హజ్జతుల్ విదా’ గా ప్రసిద్ధిగాంచిన ఈ హజ్ సందర్భంగా ప్రవక్త మహనీయులు ఓ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ’ప్రియ సోదరులారా! నా మాటలు శ్రద్ధగా వినండి. వచ్చే సంవత్సరం నేను మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటానో లేదో తెలియదు. కనుక దైవగ్రంధాన్ని, నా సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకోండి. దైవాదేశాలకనుగుణంగా, ధర్మమార్గంలో జీవితం గడపండి. ప్రజల ధన మాన ప్రాణాలను గౌరవించండి. దగా వంచన, మోసాలకు పాల్పడకండి. రక్తపాతానికి, వడ్డీలావాదేవీలకు దూరంగా ఉండండి. ప్రజలారా! మీ దేవుడు ఒక్కడే, మీ తండ్రీ ఒక్కడే. మీరంతా ఆదం సంతానం. ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడ్డారు. అరబ్బులకు అరబ్బేతరులపై, అరబ్బేతరులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యతా లేదు. దైవానికి భయపడేవారే మీలో అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు. మహిళలను గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో ధర్మం ప్రకారం వారికి కూడా మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. ఈ విధంగా ప్రవక్త మహనీయులు ప్రజలకు అనేక విషయాలు బోధించారు. సమాజంలో మానవులమధ్య సంబంధ బాంధవ్యాలు ఎలాఉండాలి, ఒకరిపై ఒకరికి ఉండే హక్కులేమిటి, సృష్టిలోని ఇతరజీవరాసుల పట్ల మన బాధ్యతలేమిటి అన్న అనేక విషయాలు సోదాహరణంగా తెలియజేశారు. అవినీతి అధర్మాల పర్యవసానాలను వివరించారు. ముఖ్యంగా జాతి, తెగ, వర్ణవర్గవివక్షలు, నిమ్నోన్నతా భేదభావాలను తీవ్రంగా నిరసిస్తూ, సమానత్వం, సోదరభావం, సౌభ్రాభృత్వాలను గురించి నొక్కివక్కాణించారు. ఆ మహనీయులు ఇహలోకం వీడేముందు పలికిన చివరి పలుకులు ‘నమాజ్... నమాజ్... సేవకులతో (బానిసలతో) మంచి ప్రవర్తన...’ తరువాత ఆయన చేయి పైకెత్తి చూపుడు వేలుతో సంజ్ఞ చేస్తూ,’ ఆ మహా మిత్రుడు తప్ప ఇప్పుడిక ఎవరూలేరు’ అన్నారు. ప్రవక్తమహనీయుని నోట ఈ అమృత పలుకులు వెలువడిన మరుక్షణమే ఆయనగారి చేయి కిందికి వాలిపోయింది. శరీరం చల్లబడిపోయింది. ఆ రోజు సోమవారం. హి.శ. పదకొండో సంవత్సరం. (మదీనాకు వలస వచ్చిన పదకొండవ సంవత్సరం) రబ్బివుల్ అవ్వల్ మాసం 12 వ తేదీ. అరవై మూడేండ్లపాటు విశ్వమానవ కళ్యాణం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ దివ్యతేజం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మ సల్లిఅలా ముహమ్మదింవ వఆలాఆలి ముహమ్మదిం వబారిక్ వసల్లిం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (సమాప్తం)