దివికేగిన దివ్యతేజం!
ప్రవక్త జీవితం
అది హిజ్రీశకం పదోసంవత్సరం. జీఖాదా నెల. ప్రవక్తమహనీయులు హజ్ యాత్రకోసం మక్కావెళ్ళాలని సంకల్పించుకున్నారు. అనుచరులు కూడా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ విషయం తెలియగానే విశ్వాసులంతా ఆనందడోలికల్లో తేలియాడుతూ యాత్రకు సన్నద్ధమయ్యారు. లక్షమందికి పైగా హజ్ యాత్రికుల జనవాహిని చీమల బారులా కదిలింది. ’హజ్జతుల్ విదా’ గా ప్రసిద్ధిగాంచిన ఈ హజ్ సందర్భంగా ప్రవక్త మహనీయులు ఓ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ’ప్రియ సోదరులారా! నా మాటలు శ్రద్ధగా వినండి. వచ్చే సంవత్సరం నేను మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటానో లేదో తెలియదు. కనుక దైవగ్రంధాన్ని, నా సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకోండి. దైవాదేశాలకనుగుణంగా, ధర్మమార్గంలో జీవితం గడపండి.
ప్రజల ధన మాన ప్రాణాలను గౌరవించండి. దగా వంచన, మోసాలకు పాల్పడకండి. రక్తపాతానికి, వడ్డీలావాదేవీలకు దూరంగా ఉండండి.
ప్రజలారా! మీ దేవుడు ఒక్కడే, మీ తండ్రీ ఒక్కడే. మీరంతా ఆదం సంతానం. ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడ్డారు. అరబ్బులకు అరబ్బేతరులపై, అరబ్బేతరులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యతా లేదు. దైవానికి భయపడేవారే మీలో అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు.
మహిళలను గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో ధర్మం ప్రకారం వారికి కూడా మీపై అలాంటి హక్కులే ఉన్నాయి.
ఈ విధంగా ప్రవక్త మహనీయులు ప్రజలకు అనేక విషయాలు బోధించారు. సమాజంలో మానవులమధ్య సంబంధ బాంధవ్యాలు ఎలాఉండాలి, ఒకరిపై ఒకరికి ఉండే హక్కులేమిటి, సృష్టిలోని ఇతరజీవరాసుల పట్ల మన బాధ్యతలేమిటి అన్న అనేక విషయాలు సోదాహరణంగా తెలియజేశారు. అవినీతి అధర్మాల పర్యవసానాలను వివరించారు. ముఖ్యంగా జాతి, తెగ, వర్ణవర్గవివక్షలు, నిమ్నోన్నతా భేదభావాలను తీవ్రంగా నిరసిస్తూ, సమానత్వం, సోదరభావం, సౌభ్రాభృత్వాలను గురించి నొక్కివక్కాణించారు.
ఆ మహనీయులు ఇహలోకం వీడేముందు పలికిన చివరి పలుకులు ‘నమాజ్... నమాజ్... సేవకులతో (బానిసలతో) మంచి ప్రవర్తన...’ తరువాత ఆయన చేయి పైకెత్తి చూపుడు వేలుతో సంజ్ఞ చేస్తూ,’ ఆ మహా మిత్రుడు తప్ప ఇప్పుడిక ఎవరూలేరు’ అన్నారు. ప్రవక్తమహనీయుని నోట ఈ అమృత పలుకులు వెలువడిన మరుక్షణమే ఆయనగారి చేయి కిందికి వాలిపోయింది. శరీరం చల్లబడిపోయింది. ఆ రోజు సోమవారం. హి.శ. పదకొండో సంవత్సరం. (మదీనాకు వలస వచ్చిన పదకొండవ సంవత్సరం) రబ్బివుల్ అవ్వల్ మాసం 12 వ తేదీ. అరవై మూడేండ్లపాటు విశ్వమానవ కళ్యాణం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ దివ్యతేజం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది.
ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మ సల్లిఅలా ముహమ్మదింవ వఆలాఆలి ముహమ్మదిం వబారిక్ వసల్లిం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
(సమాప్తం)