‘ముంబై’ ముష్కరులకు శిక్ష ఎప్పుడు?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 166 మందిని బలిగొన్న ఉగ్ర దాడులకు ఈ నెల 26తో ఐదేళ్లు పూర్తి కానున్నాయి. 2008 నవంబర్ 26 నాటి ఆ నరమేధంలో నేరుగా పాల్గొని పట్టుబడిన పాక్ ఉగ్రవాది కసబ్‌ను భారత్ గత ఏడాది నవంబర్‌లో ఉరి తీసింది. అయితే ఆ ఘాతుకానికి తెగించిన సూత్రధారులకు శిక్ష పడే సూచనలు మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు.
దాడుల కేసులో పాక్ అరెస్టయిన ఏడుగురు ఆ దేశ ఉగ్రవాదులపై విచారణ నత్తనడకన సాగుతోంది. ‘26/11’లో వారి హస్తముందంటూ భారత్ పలుసార్లు గట్టి ఆధారాలు ఇచ్చినా పాక్ మాత్రం అవి తమ కోర్టుల్లో చెల్లవని, ఇంకా గట్టి సాక్ష్యాలు కావాలని విచారణకు మోకాలడ్డుతోంది. దాడుల కుట్ర తమ దేశంలోనే జరిగిందని ఒప్పుకున్న ఆ దేశం.. నిందితులకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలుంటేనే చర్యలంటూ రెండు నాల్కలతో మాట్లాడుతోంది.