రికవరీ ఏజెంటే సూత్రధారి
ఫైనాన్సర్ ఇంట్లో దోపిడీ యత్నం కేసు...
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
పంజగుట్ట: ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో దోపిడీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేస్తున్న రికవరీ ఏజెంటే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సోమవారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... సోమాజిగూడలోని మార్వెల్ రెసిడెన్షీ ఫ్లాట్ నెం.302లో నివసించే సజ్జన్‌రాజ్ జైన్ పంజగుట్ట మహేశ్వరీ టవర్స్‌లో ననేష్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు.
ఇతని వద్ద రికవరీ ఏజెంట్‌గా బేగంపేట ప్రకాష్‌నగర్ నివాసి మహ్మద్ మాజీద్ (28) పని చేస్తున్నాడు. నిత్యం కోట్లలో లావాదేవీలు చేసే సజ్జన్‌రాజ్ జైన్ ఇంట్లో దోపిడీ చేసి.. ఆ డబ్బుతో దుబాయ్ వెళ్లి స్థిరపడాలని మాజీద్‌కు దురాశ పుట్టింది. యూసూఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో నివసించే తన స్నేహితులు ఫిరోజ్‌ఖాన్ (29), మహ్మద్ సలావుద్దీన్ అలియాస్ సల్లూ (29), లతీఫ్ (36), జహీర్ అహ్మద్ (29)లకు విషయాన్ని చెప్పి ముఠా ఏర్పాటు చేశాడు. సజ్జన్‌రాజ్ తన ఆఫీసులో ఉన్న సమయంలో భార్య అనితాదేవి ఒక్కతే ఇంట్లో ఉంటుందని తెలిసిన వీరు ఆ సమయంలో దోపిడీ చేయాలని పథకం వేశారు.
కారు అద్దెకు తీసుకొని...
ఇందులో భాగంగా మాదాపూర్‌లోని ఓ ట్రావెల్స్‌లో ఇన్నోవా కారును అద్దెకు తీసుకొని దానిలో ఈనెల మొదటివారంలో సజ్జన్‌రాజ్ ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఈనెల 6న దోపిడీ చేసేందుకు వెళ్లారు. ప్రధాన నిందితుడు మాజీద్ తన యజమాని కదలికలపై ఎప్పటికప్పుడు ఫోన్లో ముఠా సభ్యులకు సమాచారం ఇస్తుండగా... ఫిరోజ్ తన బైక్‌పై దోపిడీ చేసే ఇంటి వద్దకు వెళ్లి పరిసరాలను గమనిస్తున్నాడు. మహ్మద్ సలావుద్దీన్, లతీఫ్‌లు సజ్జన్ రాజ్ ఇంటికి వెళ్లి కాలింగ్ భెల్ కొట్టారు.
ఆయన భార్య అనితాదేవి లోపలి నుంచే ఎవరు అని ప్రశ్నించగా.. సార్.. కలెక్షన్ డబ్బు ఇంట్లో ఇవ్వమని పంపారని చెప్పారు. ఆమె తలుపుతీయగానే ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె భర్తకు ఫోన్ చేసేందుకు యత్నించగా వెంటనే వారు తమ వెంటతెచ్చుకున్న క్లోరోఫామ్ చల్లిన కర్చీఫ్ ఆమె ముఖంపై అదిమిపట్టారు. స్పృహకోల్పోగానే చేతులు, కాళ్లు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బెడ్రూలోకి వెళ్లి కబోర్డ్స్, బ్యాగులు, బీరువా తెరిచి డబ్బులు, నగదు కోసం వెతకసాగారు. మధ్యాహ్నం 1.15కి సజ్జన్‌రాజ్ భోజనానికి ఇంటికి వచ్చి కాలింగ్ భెల్ కొట్టాడు. అతను వచ్చిన విషయాన్ని తలుపు సందులోంచి గమనించిన సలావుద్దీన్ 2వ అంతస్తు బాల్కనీ నుంచిపైప్ పట్టుకొని కిందకు దిగగా... లతీఫ్ ఒక్కసారిగా కిందకు దూకేశాడు.
దీంతో లతీఫ్ రెండు కాళ్లూ, చెయ్యి విరిగాయి. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న జహీర్ అహ్మద్‌తో కలిసి సలావుద్దీన్..., బైక్‌పై ఫిరోజ్ పారిపోయారు. పోలీసులు గాయపడ్డ లతీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటి నుంచీ పరారీలో ఉన్న నిందితులు ఆదివారం సాయంత్రం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండగా.. పంజగుట్ట డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఇన్నోవా కారు, బైక్, కత్తి, క్లోరోఫామ్ బాటిల్, నాలుగు సెల్ఫోన్లు, గ్లౌజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారి సమయానికి ఇంటికి వెళ్లకపోతే దోపిడీ జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.