‘రాజీనామాలు చేయకపోతే సాంఘిక బహిష్కరణ’
చల్లపల్లి, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహనరెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకపోతే వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు ఈ నెల ఐదో తేదీ నుంచి చేపట్టిన సమైక్యాంధ్ర పరిరక్షణ చైతన్య పాదయాత్ర ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి స్థానిక ప్రధాన సెంటరులో సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహనరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు దొంగల్లా తిరుగుతున్నారని విమర్శించారు.
టీ-నోట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన సరిపోదని, రాజ్యాంగపరంగా మరింత ప్రక్రియ జరగాల్సి ఉందని చెప్పారు. ఉద్యమంలో రైతులు, విద్యార్థులు భాగస్వాములైతేనే మరింత తీవ్రరూపం దాల్చుతుందన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉద్యమం హింసాత్మకంగా మారితేనే కేంద్రం కళ్లు తెరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారో స్పష్టం చేయాలని మోహనరెడ్డి నిలదీశారు. కావేరీ జలాల సమస్య యాభయ్యేళ్లుగా రగులుతున్నా తాత్కాలిక పరిష్కారాలు చూపారే తప్ప శాశ్వతంగా పరిష్కరించకపోవడాన్ని గుర్తుచేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కె.చిదంబరం, బార్ కౌన్సిల్ సభ్యులు కె.రవీంద్రకుమార్, జి.రామారావు, హైకోర్టు న్యాయవాది ఎంవీఎస్ ప్రసాద్, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, కేసీపీ సీఈవో జీ వెంకటేశ్వరరావు, బందరు, చల్లపల్లి జేఏసీ నేతలు బీ ప్రసాద్, దాసి సీతారామరాజు, అవనిగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా విజయగోపాలకృష్ణ, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు జీవీ రామకృష్ణ తదితరులు ప్రసంగించారు.