mominpet police station
-
పీఎస్‌లలో శుభ్రత పాటించాలి
మోమిన్‌పేట : పోలీస్ స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని ఎస్పీ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. పీఎస్‌ల వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శిరీషతో కలిసి సోమవారం ఆమె మోమిన్‌పేట స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కలియతిరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని.. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అభినందించారు. స్మార్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతీ స్టేషన్‌కు రిసెప్షనిస్ట్‌తో పాటు ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితం, పెన్నుతో పాటు టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగేందుకు చల్లని నీరు, చెట్ల కింద కూర్చునేందుకు బల్లలు వేశామన్నారు. రికార్టులను ఫైలింగ్ చేయడంతో పాటు సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని 14 పీస్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గతంలో కన్నా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు, డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రమా దాలు బాగా తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలతో పాటు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
తల్లిది ఆశయం.. తనయుడిది మోసం
♦ నకిలీ పోలీస్ రిమాండ్ ♦ యూనిఫాం ధరించి వసూళ్లకు పాల్పడిన వ్యక్తి ♦ కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ స్వామి మోమిన్‌పేట: పోలీస్‌నని నమ్మబలికి డబ్బు వసూళ్లు చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వికారాబాద్ డీఎస్పీ స్వామి తెలిపారు. మంగళవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన ధన్నారం బాలయ్య యూనిఫాం వేసుకొని పోలీస్‌నని చెప్పుకుంటూ కొంతకాలంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా సదాశివపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మెల్గిరిపేట దావిద్ తన బైక్‌పై తన అత్తను తీసుకొని సదాశివపేట మోమిన్‌పేట మీదుగా శంకర్పల్లి వైపు వెళ్తున్నాడు. మోమిన్‌పేట సమీపంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య అతడి బైక్‌ను నిలిపాడు. వాహనానికి సంబంధించిన కాగితాలు చూపించాలని దావిద్‌ను కోరాడు. ఆర్సీ బుక్ ఉందని, మిగతా పత్రాలు లేవని ఆయన బదులిచ్చాడు. కాగితాలు లేకపొతే రూ.1000 జరిమానా చెల్లించాలని బాలయ్య స్పష్టం చేశాడు. అంతడబ్బు తన వద్ద లేదని దావిద్ చెప్పగా బైక్‌ను సీజ్ చేస్తానని బెదిరించాడు. తన వద్ద కేవలం రూ.350లు ఉన్నాయని చెప్పగా మొత్తం డబ్బులు అతడు లాక్కున్నాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం రావడంతో దావిద్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ రాజు వెంటనే అక్కడికి చేరుకొని బాలయ్యను ఆదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోలీస్‌ను కావాలని తన తల్లి మాణెమ్మ కోరిక అని.. దీంతో యూనిఫాం కొనుగోలు చేసినట్లు జంగయ్య చెప్పాడు. ఈక్రమంలో జల్సాలకు అలవాటు పడి వసూళ్లకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ ఏవీ రంగా, ఎస్ఐ రాజు తదితరులు ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు యూనిఫాం వేసుకొని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ స్వామి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి వారి వల్లే పోలీసుల పరువుపోతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసులమంటూ బెదిరించిన వారి తీరుపై అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.