monkey menace
-
కోతులదాడిలో మహిళకు గాయాలు
హైదరాబాద్ : న్యూనల్లకుంటలోని కొత్త రామాలయం వీధిలో రోజు రోజుకూ కోతుల బెడద అధికమవుతోంది. వీధుల్లో వృద్ధులు, పిల్లలు కనిపిస్తే చాలు దాడిచేసి గాయపరుస్తున్నాయి. అదే విధంగా ఇళ్లల్లోకిదూరి ఆహార పదార్థాలు ఆరగించి వెళ్లిపోతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు కోతుల కారణంగా భయంతో వణికిపోతున్నారు. శనివారం మధ్యాహ్నం ఓ మహిళ తమ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం కొత్త రామాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా దాదాపు 15 కోతులు ఆమెపై దాడి చేసి గాయపరిచాయి. న్యూనల్లకుంటలో రోజు రోజుకు కోతుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
'మా కార్యాలయానికి కోతుల బెడద'
పనాజి: రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై కోతులు దాడి చేస్తున్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఆదివారమిక్కడ జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యాలయం ముందు ఉన్న భద్రతా సిబ్బంది పని కోతులను లోపలికి రాకుండా చూడటమేనని చెప్పారు. అయితే అవి నిజమైన రామసేన కోతులని, కర్ణాటకకు చెందిన రామసేన కోతులు కాదని మంత్రి హాస్యమాడారు. పారికర్ గోవా సీఎంగా ఉన్నప్పుడు హిందూ మతసంస్థ రామసేనపై నిషేధం విధించారు. -
'ఈ కోతిగోల భరించలేం బాబూ'
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి అన్నిటికన్నా ప్రధానమైన ఇష్యూ నరేంద్ర మోడీ కారు. రాహుల్ గాంధీ అంతకన్నా కారు. టూజీ, బొగ్గు స్కామ్ ఇవేవీ ఎన్నికల ఇష్యూలు కావు. అక్కడ ఎన్నికల ఇష్యూ ఒకటే. కోతులే అక్కడ అసలు ఎన్నికల ఇష్యూ. అక్కడ పొలాల మీద పడి స్వైర విహారం చేస్తున్న కోతులను ఎవరు తొలగిస్తే వారికే మా ఓటంటున్నారు హిమాచల్ ప్రజలు. హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, బిలాస్పూర్, మండీ, చంబా తదితర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది. కోతులు, ఇతర జంతువులు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 80శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడింది. దాదాపు నాలుగు లక్షలకు పైఔగా కోతులు ఈ పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. దీని ఫలితంగా ఏడాదికి 500కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లుతోంది. మొత్తానికి ఈ కోతుల వ్యవహారం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నేతలు కూడా వానరాలపై ఓ లుక్కేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొమ్మని బిజెపి సలహానిస్తుండగా, కోతులకు స్టెరిలైజేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ అభయహస్తమిస్తోంది. ఇక సిపిఐ-ఎం ఏకంగా కోతులను చంపేందుకు అనుమతి కోసం కోర్టుకెక్కింది. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ లో కోతిగోల ఎక్కువైపోయింది.