'ఈ కోతిగోల భరించలేం బాబూ'
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి అన్నిటికన్నా ప్రధానమైన ఇష్యూ నరేంద్ర మోడీ కారు. రాహుల్ గాంధీ అంతకన్నా కారు. టూజీ, బొగ్గు స్కామ్ ఇవేవీ ఎన్నికల ఇష్యూలు కావు. అక్కడ ఎన్నికల ఇష్యూ ఒకటే. కోతులే అక్కడ అసలు ఎన్నికల ఇష్యూ. అక్కడ పొలాల మీద పడి స్వైర విహారం చేస్తున్న కోతులను ఎవరు తొలగిస్తే వారికే మా ఓటంటున్నారు హిమాచల్ ప్రజలు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, బిలాస్‌పూర్, మండీ, చంబా తదితర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది. కోతులు, ఇతర జంతువులు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 80శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడింది. దాదాపు నాలుగు లక్షలకు పైఔగా కోతులు ఈ పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. దీని ఫలితంగా ఏడాదికి 500కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లుతోంది.
మొత్తానికి ఈ కోతుల వ్యవహారం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నేతలు కూడా వానరాలపై ఓ లుక్కేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొమ్మని బిజెపి సలహానిస్తుండగా, కోతులకు స్టెరిలైజేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ అభయహస్తమిస్తోంది. ఇక సిపిఐ-ఎం ఏకంగా కోతులను చంపేందుకు అనుమతి కోసం కోర్టుకెక్కింది. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ లో కోతిగోల ఎక్కువైపోయింది.