ఈసారి ఓటేసేందుకు గాభరాగా ఉంది!
భారత్ తొలి ఓటరు శ్యామ్ నేగి వ్యాఖ్య
కల్ప (కిన్నౌర్): ఆయన వయసు 97 ఏళ్లు.. హిమాచల్‌ప్రదేశ్ నివాసి, రిటైర్డ్ హెడ్‌మాస్టర్.. ఏమిటి ఆయన గొప్పతనం అంటారా? 1951లో తొలిసారిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల దగ్గరనుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. ఇప్పుడు జరుగుతున్న 16వ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటేయనున్నారు. ఇందులో విశేషముంది.. అలాంటివారు ఇంకా ఉండొచ్చంటారా? ఇలా ఓటేసినవారు ఇంకా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకత ఆయనదే.. ఎందుకంటే భారతదేశ తొలి ఓటరు ఆయనే..! పేరు శ్యామ్ నేగి. ఇప్పటివరకు 15 లోక్‌సభ ఎన్నికలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈనెల 7న జరగనున్న ఎనిమిదో విడత పోలింగ్‌లో నేగీ మరోసారి ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున ఆయన్ను ఘనంగా సత్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మీడియా దృష్టి మొత్తం తనపైనే ఉండటంతో ఈసారి ఓటేయడానికి కాస్త టెన్షన్‌గా ఉందని నేగి పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీన 98వ ఏట అడుగుపెట్టనున్న శ్యామ్ నేగి.. ఓటేయడం ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన విధి అని చెప్పారు. భారత్‌లో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి. అప్పుడు మొట్టమొదటి పోలింగ్ కేంద్రాన్ని కి న్నౌర్ జిల్లా కల్పలో ఏర్పాటుచేశారు. ఆ సమయంలో అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న నేగి.. తొలుత తానే ఓటేశారు. దీంతో ఆయన భారత తొలి ఓటరుగా రికార్డులకెక్కారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన నీరజ్ శర్మ చెప్పారు.