Montana
-
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
అమెరికాలో దుమ్ము బీభత్సం
హర్డిన్: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్ సమీపంలో మోంటానా ఇంటర్ స్టేట్ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి. దారి కనిపించక ట్రాక్టర్ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు. -
ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్‌న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్‌ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్‌పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్‌డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్‌తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్‌ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్‌లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
మనవడిని కొట్టి చంపిన తాతకు వందేళ్ల జైలు
మొంటానా: మనవడిని కొట్టి చంపిన కేసులో మొంటానాలోని ఎల్లోస్టోన్కు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జేమ్స్ సస్సెర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోవడంతో అతడి కొడుకు అలెక్స్ హరీ(12)తాత వద్దకు వచ్చి ఉంటున్నాడు. అదే సమయంలో భార్య పాట్రిసియాకు విడాకులు ఇచ్చేందుకు జేమ్స్ సస్సెర్ సిద్ధమయ్యాడు. అయితే, విడాకుల తర్వాత మనవళ్లను చూసే అవకాశం ఇవ్వనంటూ ఆమె బెదిరించడంతో వెనక్కి తగ్గాడు. మనవడు అలెక్స్ కుటుంబసభ్యుల మాట వినడం లేదని పాట్రిసియా చెప్పడంతో అతడిపై జేమ్స్ సస్సెర్ జూనియర్ ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి అలెక్స్‌పై అమ్మమ్మ, తాతతోపాటు వారి కొడుకు సస్సెర్(14)కూడా వేధింపులు ప్రారంభించారు. అలెక్స్ అక్కడ గడిపిన రెండేళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. ఆహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో అలెక్స్ హర్లీ(12)చనిపోయాడు. అంతకు ముందు 36 గంటలపాటు అతడిని తీవ్రంగా కొట్టారు. తల భాగం సహా అతడి శరీరం నిండా గాయాలే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ ఇవ్వాల్సిన కుటుంబసభ్యులే అభంశుభం తెలియని బాలుడిని క్రూరంగా హింసించి చంపడంపై విచారణ సందర్భంగా జడ్జి బ్రౌన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జేమ్స్ సస్సెర్కు 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అతడి 14 ఏళ్ల కొడుకుకు 18 ఏళ్లు వచ్చే వరకు జువనైల్ డిటెన్షన్ సెంటర్లో, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రొబేషన్‌లో గడపాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో పాట్రిసియాపై మేలో విచారణ జరగనుంది. -
తాలిబన్‌గా తయారవుతాడేమోనని భయపడి..
హెలెనా(అమెరికా): ఓ శిక్షణ కార్యక్రమం వచ్చి అఫ్గనిస్థాన్ సైనికాధికారిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఏ శిక్షణ కోసమైతే అతడు వచ్చాడో దానికి హాజరుకాకుండా ఆ బాధ్యతలను వదిలేసి తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఓ రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్తాఫా టానిన్ అఫ్గనిస్థాన్‌లో లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమెరికా, అఫ్గనిస్థాన్ దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా టెక్సాస్ లోని సాన్ అంటానియో వద్దగల లాక్లాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ప్రత్యేకంగా నిర్వర్తిస్తున్న బేసిక్ అమెరికన్ లాంగ్వేజ్ ఇన్ స్ట్రక్టర్ కోర్స్ చేసేందుకు మరికొందరు అఫ్గనిస్థాన్ సైనికులతో కలిసి వచ్చాడు. ఈ శిక్షణలో వారికి ఆంగ్లంపై పట్టు నేర్పుతారు. దానిని వారు నేర్చుకుని వారి దేశాల్లో మిగతా సైనికులకు చెప్పాల్సి ఉంటుంది. అలా శిక్షణ కోసం వచ్చిన టానిన్ ఎవరికీ చెప్పకుండానే గత నెల సెప్టెంబర్ 25న మధ్యలోనే ఆ కార్యక్రమంలో నుంచి తప్పించుకుని తిరిగి రాకుండా వెళ్లిపోయాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు శిక్షణా సంస్థ అధికారులు తెలిపారు. దీంతో అతడికోసం తీవ్రంగా గాలింపులు జరిపిన పోలీసులు చివరికి మంగళవారం మోంటానా వద్ద ఓ రైలులో అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో అమెరికా అధికారులు అతడి వీసాను కూడా రద్దు చేశారు. అఫ్గనిస్థాన్‌లోని సైనికులు ఒక్కోసారి తాలిబన్లకు అనుకూలంగా మారి దాడులకు పాల్పడే అవకాశం ఉందనే భయంతో అమెరికా అతడి విషయంలో వేగంగా స్పందించింది.