వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది.
ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్‌ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది.
వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment