తాలిబన్గా తయారవుతాడేమోనని భయపడి..
హెలెనా(అమెరికా): ఓ శిక్షణ కార్యక్రమం వచ్చి అఫ్గనిస్థాన్ సైనికాధికారిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఏ శిక్షణ కోసమైతే అతడు వచ్చాడో దానికి హాజరుకాకుండా ఆ బాధ్యతలను వదిలేసి తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఓ రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్తాఫా టానిన్ అఫ్గనిస్థాన్లో లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమెరికా, అఫ్గనిస్థాన్ దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా టెక్సాస్ లోని సాన్ అంటానియో వద్దగల లాక్లాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ప్రత్యేకంగా నిర్వర్తిస్తున్న బేసిక్ అమెరికన్ లాంగ్వేజ్ ఇన్ స్ట్రక్టర్ కోర్స్ చేసేందుకు మరికొందరు అఫ్గనిస్థాన్ సైనికులతో కలిసి వచ్చాడు.
ఈ శిక్షణలో వారికి ఆంగ్లంపై పట్టు నేర్పుతారు. దానిని వారు నేర్చుకుని వారి దేశాల్లో మిగతా సైనికులకు చెప్పాల్సి ఉంటుంది. అలా శిక్షణ కోసం వచ్చిన టానిన్ ఎవరికీ చెప్పకుండానే గత నెల సెప్టెంబర్ 25న మధ్యలోనే ఆ కార్యక్రమంలో నుంచి తప్పించుకుని తిరిగి రాకుండా వెళ్లిపోయాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు శిక్షణా సంస్థ అధికారులు తెలిపారు. దీంతో అతడికోసం తీవ్రంగా గాలింపులు జరిపిన పోలీసులు చివరికి మంగళవారం మోంటానా వద్ద ఓ రైలులో అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో అమెరికా అధికారులు అతడి వీసాను కూడా రద్దు చేశారు. అఫ్గనిస్థాన్లోని సైనికులు ఒక్కోసారి తాలిబన్లకు అనుకూలంగా మారి దాడులకు పాల్పడే అవకాశం ఉందనే భయంతో అమెరికా అతడి విషయంలో వేగంగా స్పందించింది.