Moodys Investors
-
లాక్డౌన్ సుదీర్ఘకాలం కొనసాగితే వాటికి కష్టమే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కంపెనీలకు తాజా సెకండ్ వేవ్ మరో సమస్యగా మారుతోంది. ఇది సత్వరం అదుపులోకి వస్తే ఫర్వాలేదు .. లేకపోతే సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగిన పక్షంలో వ్యాపార సంస్థల ఆదాయాల రికవరీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ లాక్డౌన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో తాము రేటింగ్ ఇస్తున్న సంస్థల ఆదాయాల రికవరీ ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలించడం మొదలయ్యాక 2020 అక్టోబర్ తర్వాత వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. కానీ పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షల విధింపుతో ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ బలహీనపడవచ్చని, ఇటీవలి రికవరీని దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. ‘కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టడికి భారత్‌లో ప్రాంతీయంగా అమలు చేస్తున్న లాక్డౌన్లు మరీ అంత కఠినంగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకానైతే ఆర్థిక కార్యకలాపాలపై పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉంది. అయితే, వైరస్ వ్యాప్తి తగ్గి, పరిస్థితులు అదుపులోకి రాకపోయిన పక్షంలో..లాక్డౌన్లను మరింతగా పొడిగించాల్సి రావచ్చు.ఇంకా విస్తృతం చేయాల్సి కూడా రావచ్చు. ఇది మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చు‘ అని వివరించింది. జూన్ క్వార్టర్ కాస్త ఓకే.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని మూడీస్ అంచనా వేసింది. కానీ పరిస్థితి దిగజారితే మాత్రం కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని వివరించింది. ‘ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. కానీ వీటితో పోలిస్తే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తే యావత్‌దేశంలో కార్యకలాపాలు దెబ్బతింటాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే వ్యక్తుల రాకపోకలపై భారీ స్థాయిలో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ పడిపోతుంది. అలాగే సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడతాయి. కార్మికుల కొరత సమస్య తీవ్రమవుతుంది‘ అని మూడీస్ తెలిపింది. ఆటో, రియల్టీపై ప్రభావం.. కదలికలపై ఆంక్షల కారణంగా రవాణా ఇంధనానికి డిమాండ్ తగ్గిపోతుందని, చమురు రిఫైనర్ల ఉత్పత్తి పడిపోవచ్చని వివరించింది. అలాగే, పలు ఆంక్షల కారణంగా వినియోగదారులు .. కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకోవడం వల్ల్ ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో డిమాండ్ క్షీణిస్తుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల ఉక్కు, సిమెంట్, మెటల్స్, మైనింగ్ వంటి భారీ పరిశ్రమలకు చెందిన కంపెనీలు తమ పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి చేయలేకపోతాయని మూడీస్ తెలిపింది. విస్తృతంగా, సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లు విధిస్తే వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతింటుందని, వస్తు.. సేవలకు డిమాండ్ బలహీనపడుతుందని పేర్కొంది. నిత్యావసరయేతర కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకుంటారని.. ఫలితంగా దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయని వివరించింది. లాక్డౌన్లను కఠినంగా అమలు చేస్తే కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని, దీంతో తయారీ కార్యకలాపాలు నిల్చిపోతాయని మూడీస్ తెలిపింది. ఫలితంగా ఆంక్షలు సడలి, తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. లాక్డౌన్ సడలింపు తర్వాత కూడా వారాలు, నెలల పాటు ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చని మూడీస్ తెలిపింది. -
స్టేబుల్ నుంచి నెగిటివ్‌కు ఫిచ్ రేటింగ్
దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను విదేశీ దిగ్గజం ఫిచ్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన స్టేబుల్(స్థిరత్వం) రేటింగ్‌ను నెగిటివ్(ప్రతికూలం)కు సవరించింది. ఇదివరకు ప్రకటించిన లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 5 శాతం ప్రతికూల(మైనస్) వృద్ధిని నమోదు చేయనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డవున్లు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జీడీపీ 9.5 శాతం పురోభివృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ఈ ఏడాది మైనస్ వృద్ధి నమోదుకానుండటం(లోబేస్) సహకరించే వీలున్నట్లు తెలియజేసింది. 6-7 శాతం వృద్ధి! లాక్డవున్లు నెమ్మదిగా సరళీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటం రిస్కులను పెంచుతున్నట్లు ఫిచ్ పేర్కొంది. దీంతో ఇండియా గతంలో వేసిన 6-7 శాతం ఆర్థిక వృద్ధిని అందుకునేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ రుణ భారం పెరగడంతో సవాళ్లు ఎదురుకానున్నట్లు వివరించింది. కాగా.. ప్రస్తుతం దేశ సావరిన్ రేటింగ్స్‌కు విదేశీ రేటింగ్ దిగ్గజాలన్నీ లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను ప్రకటించినట్లయ్యిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నెగిటివ్ ఔట్‌లుక్‌ను ప్రకటించగా.. స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చింది. -
వృద్ధి లక్ష్య సాధన కష్టమే: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి లక్ష్య సాధన కొంత కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019-20లో 4.9 శాతం వాస్తవ వృద్ధి రేటు నమోదయ్యే వీలుందని, 2020-21లో ఈ రేటు 5.5 శాతానికి పెరగవచ్చని అంచనావేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధనకు ప్రధానంగా సంస్థాగత సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొంది. తాజా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ ప్రకారం- 2020-21లో భారత్ నామినల్ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా) స్థూల దేశీయోత్పత్తి 10 శాతం. 2021-22, 2020-23ల్లో ఇది 12.6 శాతం, 12.8 శాతానికి పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది. అయితే 2019-20లో ఈ రేటు 7.5 శాతంగా ఉంటుందని, 2020-21లో 8.7 శాతంగా నమోదవుతుందని మూడీస్ అంచనావేసింది. -
భారత్ ద్రవ్య విధానానికి రుణాల అడ్డంకి!
♦ స్వేచ్ఛగా వ్యవహరించలేకుంటే ఇబ్బందులే ♦ మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక అంచనాలు న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్య విధానాన్ని మరింత సరళీకరించడానికి అధిక రుణాలే అడ్డంకిగా నిలుస్తాయని రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవటం వల్ల ఆసియా పసిఫిక్ దేశాల రుణాలపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని కూడా స్పష్టంచేసింది. ‘సార్వభౌమదేశాలు, బ్రెగ్జిట్, ఆసియా పసిఫిక్ దేశాలు; పరిమిత డెరైక్ట్ క్రెడిట్ ప్రభావం; కొన్ని దేశాల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు’ అనే అంశాలను ప్రస్తావిస్తూ విడుదల చేసిన తాజా నివేదికలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఈ విషయాలు తెలియజేసింది. బ్రెగ్జిట్‌కు సంబంధించి వచ్చే ప్రకటనలతో రానున్న నెలల్లో ఫైనాన్షియల్ మార్కెట్లు ఆటుపోట్లకు గురికావచ్చని సంస్థ పేర్కొంది. ‘‘బ్రిటన్‌లో తక్కువ జీడీపీ వల్ల ఇతర ప్రపంచ దేశాల వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. కాకపోతే బ్రిటన్‌తో ఆసియా పసిఫిక్ దేశాలకున్న వాణిజ్య ఒప్పందాలు పరిమితమేనని గుర్తుంచుకోవాలి. ఇదేమీ లెక్కలు వేసి చెబుతున్నది కాదుగానీ... పోర్ట్‌ఫోలియో, బ్యాంకింగ్ నిధులు మళ్లింపు వల్ల ఆసియా పసిఫిక్ దేశాల్లో నిధులకు కటకట ఏర్పడి వృద్ధికి విఘాతం కలిగే అవకాశముంది’’ అని మూడీస్ నివేదిక వివరించింది. -
సంస్కరణల అమలు కీలకం
రేటింగ్ పెంపుపై కేంద్రానికి మూడీస్ స్పష్టీకరణ - ఆర్థిక పరిస్థితులపట్ల సానుకూలత న్యూఢిల్లీ: సంస్కరణలు అమలయితేనే రేటింగ్ అప్‌గ్రేడ్ అవకాశం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేశానికి పెట్టుబడులు, రుణాలు వంటి అంశాలు మూడీస్, ఫిచ్, ఎస్అండ్పీ వంటి ప్రముఖ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. 2004 నుంచీ ఇదే రేటింగ్‌ను భారత్‌కు కొనసాగిస్తోంది. ఈ రేటింగ్ ‘జంక్’ రేటింగ్‌కు ఒక మెట్టు మాత్రమే పైనుంది. పెట్టుబడులకు సంబంధించి ‘బీఏఏ 3’ ‘దిగువస్థాయి’ గ్రేడ్‌ను సూచిస్తోంది. ద్రవ్యోల్బణం వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలు వచ్చే ఏడాదీ సానుకూల రీతిలో ఉంటాయని భారత్ ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన విశ్లేషణా పత్రంలో పేర్కొంది. ద్రవ్యోల్బణంసహా ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలు సైతం రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగాల్సిన అవసరం ఉందనీ నివేదిక పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... - పాలసీ సంస్కరణల ప్రక్రియ మందగమనం, ఆయా అంశాల్లో వెనుకంజ, బ్యాంకింగ్ రంగం బలహీనంగా కొనసాగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే, రేటింగ్ అవుట్‌లుక్ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. - దిగువ స్థాయిలో చమురు ధరలు, పటిష్ట ద్రవ్య-పరపతి విధానాలు స్థూల ఆర్థిక వ్యవస్థ సమతౌల్యతకు దోహదపడతాయి. కమోడిటీ దిగుమతిదారుగా దేశం ప్రస్తుతానికి చక్కటి ప్రయోజనాలను పొందగలుగుతోంది. - అంతర్జాతీయంగా కొన్ని ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినా... దేశీయంగా ఉన్న పటిష్ట డిమాండ్ పరిస్థితులు దేశానికి రక్షణ కవచం - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతం ఉన్నా... ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి. - ప్రైవేటు రంగంలో ప్రత్యేకించి తయారీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు అన్నింటినీ చేస్తోంది. ఇది వృద్ధి రికవరీకి దోహదపడే అంశం. తయారీ రంగం భారీ వృద్ధిలో దేశం విజయవంతమైతే.. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. వ్యవస్థల పటిష్టత అంతంత మాత్రమే! భారత్‌లో పలు వ్యవస్థల పటిష్టత కూడా ఒక మోస్తరుగానే ఉందని (మోడరేట్-మైనస్) మూడీస్ తన నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ శాఖల మధ్య తగిన సమతౌల్య త సహా దేశంలో చక్కటి ప్రజాస్వామ్యం ఉందని పేర్కొంది. వ్యవస్థల పరంగా ఇవి పటిష్టంగా ఉంటే... రెగ్యులేటరీ వాతావరణంలో అనిశ్చితి, సత్వర న్యాయం అందని పరిస్థితి, పలు కుంభకోణాలు, ప్రభుత్వ సేవలు అందడంలో సామర్థ్యలోపం వంటివి బలహీనతలని వివరించింది. పటిష్ట వ్యవస్థలు సైతం పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి తగిన నిర్వహణాపరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని విశ్లేషించింది.