దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను విదేశీ దిగ్గజం ఫిచ్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన స్టేబుల్(స్థిరత్వం) రేటింగ్‌ను నెగిటివ్(ప్రతికూలం)కు సవరించింది. ఇదివరకు ప్రకటించిన లోయస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 5 శాతం ప్రతికూల(మైనస్) వృద్ధిని నమోదు చేయనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డవున్‌లు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జీడీపీ 9.5 శాతం పురోభివృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ఈ ఏడాది మైనస్ వృద్ధి నమోదుకానుండటం(లోబేస్) సహకరించే వీలున్నట్లు తెలియజేసింది.
6-7 శాతం వృద్ధి!
లాక్‌డవున్‌లు నెమ్మదిగా సరళీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటం రిస్కులను పెంచుతున్నట్లు ఫిచ్ పేర్కొంది. దీంతో ఇండియా గతంలో వేసిన 6-7 శాతం ఆర్థిక వృద్ధిని అందుకునేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ రుణ భారం పెరగడంతో సవాళ్లు ఎదురుకానున్నట్లు వివరించింది. కాగా.. ప్రస్తుతం దేశ సావరిన్ రేటింగ్స్‌కు విదేశీ రేటింగ్ దిగ్గజాలన్నీ లోయస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌ను ప్రకటించినట్లయ్యిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నెగిటివ్ ఔట్‌లుక్‌ను ప్రకటించగా.. స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment