‘చావు’కొచ్చింది..!
♦ పాల్వంచ హత్యే.. ప్రాణసంకటంగా మారింది..
♦ మోరె రవి టార్గెట్‌గా ఎన్డీ రామన్న దళంపై పంజా
♦ త్రుటిలో తప్పిన ఎన్కౌంటర్
ఇల్లెందు :
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన మోరె రవి పాల్వంచ వద్ద చేసిన హత్య సంఘటనే ఆ పార్టీకి ప్రాణసంకటంగా మారింది. పాల్వంచ హత్య తర్వాత పోలీసులు మోరె రవిని అప్పగించాలని ఎన్డీ నాయకత్వంపై ఒత్తిడి పెంచారు. లేదంటే అజ్ఞాత దళాలను మట్టుబెడతామని కూడా అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం తెల్లవారు జామున టేకులపల్లి మండలం సిద్దారం అటవీ ప్రాంతంలో విడిది చేసిన ఎన్డీ జిల్లా కార్యదర్శి సింగరబోయిన రాము అలియాస్ రామన్న దళంపై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో దళం తప్పించుకుని ఆయుధాలు, కిట్ బ్యాగులు వదిలి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. అయితే ఈ ఘటనతో పోలీసులు ఎన్డీ దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నట్లు తేటతెల్లమైంది.
ఇతర నక్సల్స్ దళాల కోసం కూంబింగ్‌కు వెళ్లిన క్రమంలో ఎన్డీ దళాలు యాదృచ్ఛికంగా అటవీ ప్రాంతంలో తారసపడితే కాల్పులు జరగటం ఒక ఎత్తయితే.. ఎన్డీ దళం విడిది పొందిన ఆచూకీతో వెళ్లి దాడి చేయటంతో ఎన్డీ దళాల కోసం పోలీసులు వేట మొదలు పెట్టినట్లు తేలిపోయింది. ఇప్పటివరకు ఎన్డీ దళాల సంచారం ఉన్నప్పటికీ పోలీసులు ప్రత్యేకంగా వేట ప్రారంభించిన దాఖలాలు లేవు. కేవలం పాల్వంచలో పట్టపగలు ఆయుధాలు ధరించిన అజ్ఞాత దళం గ్రామంలోకి చేరుకుని హత్యకు పాల్పడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఈ క్రమంలో పోలీసులు దీనికి మోరె రవి కారకుడని, అతడిని అప్పగించాలని పట్టుబట్టింది. అయితే రవిని అప్పగించడమా.. హతమార్చడమా.. అనే కోణంలోనే ఎన్డీ దళాలే లక్ష్యంగా కూంబింగ్ సాగుతోంది.
సిద్దారం అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా ఒకేచోట విడిది పొందిన సమాచారం అందుకున్న పోలీసులు స్పెషల్ పార్టీలను రంగంలోకి దింపి.. సంఘటనా స్థలానికి చేరుకుని మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. అయితే దళం తారసపడినా లక్ష్యాన్ని ఛేదించకపోవడంతో పోలీసుల్లో అంతర్మథనం మొదలైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వెంకటాపురం అటవీ ప్రాంతాలు మినహా కొత్తగూడెం, మణుగూరు డివిజన్లలో కూంబింగ్ లేకపోవటం వల్ల పోలీసుల్లో సైతం గురి తప్పిందంటున్నారు.