Mortuary rooms
-
మృతదేహాలనే మార్చేశారు..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో శనివారం అనూహ్య ఘటన చోటు చే సుకుంది. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ బిడ్డ చనిపోయాడని రోదించే క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది కట్టిన కట్టు విప్పి చూసే సరికి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో ఇరువురు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్పలి్లకి చెందిన రాగుల రమేశ్ (33) శుక్రవారం కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అశాడపు పరమేశ్ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో పరమేశ్ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శనివారం పోలీసుల పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్యులు పో స్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయిలో మృతదేహాలకు క ట్టు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి రోదిస్తున్న క్ర మంలో కట్టు విప్పి చూడగా మృతదేహం తమది కా దని భావించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు ల సహాయంతో మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్చురీ సి బ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరి మృతదేహాలను వారికి అప్పగించారు. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘గాంధీ’ మార్చురీ నుంచి భరించలేనంత దుర్వాసన
పద్మారావునగర్: సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్వాసనను తాము భరించలేకపోతున్నామని అభినవనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. ఈ మేరకు కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.రాజేష్ గౌడ్ ఆదివారం పద్మారావునగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 రోజుల నుంచి గాంధీ ఆస్పత్రి మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మార్చురీలోని ఏసీ పని చేయకపోవడంతో అక్కడ నిల్వ ఉంచిన మృత దేహాల నుంచి పక్కనే ఉన్న కాలనీలకు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతున్నదన్నారు. ఈ విషయమై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇతర అధికారులకు విన్నవించినా ఫలితంగా లేదన్నారు. దుర్వాసన వల్ల పద్మారావునగర్ పరిసర ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పద్మారావునగర్ కాలనీవాసులతో కలిసి గాంధీ ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాలనీ అధ్యక్షుడు రాజేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. -
మార్చురీలోని మృతదేహం ఎత్తుకెళ్లి..
కొత్తగూడెంరూరల్,జూలురూపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గల జిల్లా ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మార్చురీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని వారి బంధువులు ఎవరికీ చెప్పకుండా తీసుకవెళ్లిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జూలూరుపాడు మండలం బొజ్యాతండాకు చెందిన గుగులోతు రాందాస్ కుమారుడు శివ(13) తన సోదరుడితో గురువారం గొడవపడ్డాడు. శివను అన్న మందలించటంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు జూలురుపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకువెళ్లగా పరిస్థితి మిషమించటంతో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం శివ మృతిచెందాడు. వెంటనే శివ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు.. జిల్లా ఆసుపత్రిలో ఉన్న శివ మృతదేహానికి పోస్టుమార్టం కాకుండానే మృతుడి బంధువులు గురువారం రాత్రి ఇంటికి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం శివ మృతదేహం మార్చురీలో లేకపోవడంతో అధికారులు హైరానా పడ్డారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన మృతదేహం మాయం కావడంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దీంతో ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ సురేందర్ ఈ విషయమై త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో మృతుడికి సంబంధించిన బంధువులెవరూ కన్పించకపోవడంతో వారిని విచారించగా గురువారం రాత్రి వారే మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు తెలిసింది. అయితే రాత్రి వేళలో విధులు నిర్వహించే నర్సుల వద్ద మార్చురీ తాళాలు ఉండాల్సి ఉండగా, అవి అటెండర్ వద్దకు ఎలా వచ్చాయని, అటెండర్ సైతం ఎలా మృతదేహాన్ని బయటకు పంపించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహం వెలికి తీయించి పోస్టుమార్టం.. జూలూరుపాడు మండలం బొజ్యాతండాలో సమీపంలో శివ మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ పర్యవేక్షణలో మృతదేహాన్ని బయటకు తీయించి, ఆర్ఎంఓ డాక్టర్ రవిబాబు నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయమై డీసీహెచ్ గడ్డమీది రమేష్‌ను వివరణకోరగా మృతదేహం మాయంపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. -
శవాలు కదులుతుంటే తెలియని భయం..
శవాన్ని చూడగానే కొందరు భయపడతారు.. కొందరు పక్కకి జరిగిపోతారు. ఒకవేళ తెలిసిన వారు మృతిచెందినా ఆ దేహాన్ని తాకకుండానే నివాళులర్పించివెనుతిరుగుతారు.. సాధ్యమైనంత తొందరగా అంత్యక్రియలూ నిర్వహిస్తారు. ఇవీ సహజంగాఎక్కువ సందర్భాల్లో తారసపడే దృశ్యాలు.. కానీ వీరు మాత్రం శవాన్ని ముట్టుకోడానికి ఏమాత్రం సంకోచించరు.. ఆ శవంతో తమకు ఎలాంటి బంధం లేకున్నా దాని దగ్గరే నిలబడతారు. వైద్యుని సూచనల మేరకు శవం శరీర భాగాలను కోస్తారు.. వైద్యులు కాకున్నా కుట్లు వేయడానికీ వెనుకాడరు.. శవాల మధ్యే ఉంటున్నా భయమనేది ఏ కోశానా వారిలో కనిపించదు.. వారెవరో కాదు.. మార్చురీ వద్ద తోటీలుగా వృత్తి నిర్వహించే వారు.. మద్యం మత్తులో విధులు నిర్వర్తిస్తారని.. మనసు లేకుండా యాంత్రికంగా చేసుకుపోతారని అనుకుంటే పొరపాటే. సాక్షి పలకరించినప్పుడు కడప మార్చురీ వద్ద తోటీలు మనసును కదిలించే ఆసక్తికర అంశాలు వెల్లడించారు.. వీరి జీవన శైలిపై ప్రత్యేక కథనం.. సాక్షి కడప: శవాల గది (పోస్టుమార్టం రూం).. ఇక్కడ శవాలు తప్ప ఏమీ ఉండవు.. వివిధ కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు ఇక్కడ చేరుస్తారు. అయినవారు ఎవరూ లేని డెడ్‌బాడీలను ప్రీజర్ బాక్సులో ఉంచుతారు. ఈ పోస్టుమార్టం రూం పేరు వింటేనే ఒకరకమైన బాధ.. ఆందోళన కలుగకమానవు. ఇక అక్కడ అడుగు పెట్టాలంటే భయంగా ఉంటుంది. అలాంటిది ఆ శవాల గది వద్ద ప్రతినిత్యం ఉంటూ.. అక్కడే తిరుగుతూ ఆ గదిలోనే పనులు చేసుకుంటూ.. విధులు నిర్వహించే తోటీల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. చెప్పలేని ఆవేదన అనుభవిస్తున్నా... వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిని దైవంగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ సమక్షంలో శవాన్నికోసేటప్పుడు... శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ, లివర్, పొట్ట.. ఇలా అవయవాలను బయటికి తీస్తున్నప్పుడు.. ఎంతో వేదన అనుభవిస్తుంటామని.. కన్నీటి పర్యంతం అవుతుంటామని... అయినా విధి నిర్వహణలో ఇవన్నీ తప్పవని కడప రిమ్స్ పోస్టుమార్టం గదిలో పనిచేస్తున్న తోటీలు వెంకటయ్య, టి.నర్సారావు అంటున్నారు. విధి నిర్వహణలో వారు అనుభవిస్తున్న బాధ.. కష్టం.. ఎదుర్కొన్న సంఘటనలు సాక్షికి వివరించారు. ఆ ఇద్దరూ అక్కడే.. కడప మాసాపేటకు చెందిన వెంకటయ్య, నర్సారావులు నెల్లూరు జిల్లాకు చెందినవారైనా.. వాళ్ల పెద్దల కాలంలోనే కడపలో స్థిరపడ్డారు. ఇరువురికి వారి తండ్రులు చనిపోవడంతో తోటి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నర్సారావు 12ఏళ్ల నుంచి పోస్టుమార్గం గదిలో పనిచేస్తుండగా.. వెంకటయ్య 30 ఏళ్లుగా శవాల మధ్యన తోటిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు నాలుగు వేలకు పైగా...మరొకరు 10 వేలకు పైగా... కడప రిమ్స్ మార్చురీలో తోటిగా పనిచేసే గోవింద్ 1991లో చనిపోయారు. దీంతో ఆయన కుమారుడైన వెంకటయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 10 వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటయ్యకు మేనల్లుడైన మహాదేవ్ కూడా ఈ పనిలో సహకరిస్తుంటాడు. 12 ఏళ్ల క్రితం నాన్న చనిపోవడంతో కుమారుడు నర్సారావుకు తోటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇతను కూడా పోస్టుమార్టంలో భాగంగా వైద్యుల సమక్షంలో మృతదేహం కోతకు సంబంధించిన పనులు చేస్తున్నారు. దాదాపు నాలుగు వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహణలో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల నర్సారావు కుమారుడైన రాజా కూడా అక్కడే స్వీపర్‌గా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మార్చురీ రికార్డు గదిలో భోజనం చేస్తున్న తోటీలు మొదట్లో తినేవాళ్లం కాదు... కడపలోని క్రిస్టియన్‌లేన్ సమీపంలో ఉన్న పాత రిమ్స్‌లో ఆస్పత్రి ఉన్నప్పుడు తోటిగా జాయిన్ అయిన మొదట్లో వృత్తి రీత్యా జీతం వస్తుందని సంతోషమనిపించినా... ఆరు నెలలపాటు చాలా అవస్థలు పడ్డాం. అది ఎంత అంటే ఒక పక్క భయం, జంకు.. మరోపక్క ఇంటికి వెళితే తిండి కూడా తినలేని పరిస్థితి. పోస్టుమార్టం గదిలో శవాలపై చేసిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంటిలో అన్నం తిందామని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొన్నా ఏదో తెలియని బాధ. అన్నం గిన్నెలో చేయి పెడితే చాలు.. పోస్టుమార్టం గదిలో చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి ఆరు నెలల వరకు తినడమే తగ్గించాం. భోజనం ప్లేటులో చేయి పెడితే ఏదో పేగులు, గుండె, రక్తం మీద పెట్టినట్లుగా గుర్తుకు వచ్చి తినలేకపోయేవాళ్లం. తర్వాత తట్టుకోలేక అంతో ఇంతో మద్యం సేవించి తింటూ వచ్చాం. అలా ఏడాది గడిచేంత వరకు ఇబ్బందులు పడుతూ వచ్చాం. శవాలు మీదపడేవి.. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన రిమ్స్ ఆవరణలో విశాలమైన పోస్టుమార్టం గదితోపాటు శవాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్లు ఉన్నాయి. అదే 15 ఏళ్లు వెనక్కి వెళితే.. పాత రిమ్స్‌లో ఇరుకైన గది.. పోస్టుమార్టానికి ఒక టేబుల్ మాత్రమే ఉండేది. దీంతో చాలా సందర్భాలలో అనేక అగచాట్లు పడేవాళ్లం. రాయచోటి ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరిగి 10 మంది వరకు చనిపోయినప్పుడు శవాలను తీసుకొచ్చి పోస్టుమార్టం గదిలో పెట్టారు. అప్పట్లో స్థలంలేక ఒక బాడీ మీద ఒకటి వరుసగా పెట్టడం.. ఇతర ఏదైనా శవాలు వచ్చినా అన్ని వరుసగా పెట్టడంతో తిప్పలు చాలా ఎదుర్కొన్నాం. అంతేకాదు.. అనాథ శవాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్లు లేవు. ఒకదాని మీద ఒకటి శవాలను వరుసగా పేర్చి పెట్టేవాళ్లం. ఏదైనా చేయడానికి వెళ్లినపుడు ఒక్కసారిగా అవి వచ్చి మీద పడేవి. చిన్నగా మీద పడిన శవాలను ఒక్కొక్కటిగా పైకి చేర్చి మళ్లీ పనిచేసుకుంటూ ముందుకు పోయాం. అప్పుడు చాలా భయం అనిపించేది. కొన్ని సందర్భాల్లో శవం తెచ్చి మాకు అప్పగించడంతోపాటు ఐస్‌గడ్డ ఇచ్చేవారు. ఐస్‌గడ్డలపై పెట్టి దానిపై బాడీని పడుకోబెడుతుండగా ఐస్‌గడ్డ కరిగి బాడీ కిందికి జరిగే సందర్భం చూసినపుడు వణికిపోయేవాళ్లం. ఎందుకంటే మృతదేహాలు కదులుతుంటే తెలియని భయం. ఇలా ఒకటేమిటి? చాలా అనుభవించాం. శవాలు పట్టుకుంటే చేతిలోకి కండలు.. నాకు బాగా గుర్తు. 2001 సంవత్సరంలో బుగ్గవంక వరద నీరు కడప నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఆ సమయంలో అనేకమంది ఈ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో వంక నీటిలో చనిపోయారు. ఆ శవాల తాలూకు ఒకటి చెట్టుకు కరుచుకుంటే.. ఒకటి బ్రిడ్జి సందున, ఇంకోటి బురదలో ఇరుక్కుపోయి బాడీలు కనిపించాయి. బుగ్గ వంక ఉధృతి తగ్గి శవాల పోస్టుమార్టం వద్దకు వెళ్లేటప్పటికి కాళ్లు, చేతులు నీలక్కపోయి, చవికిపోయి ఉన్నాయి. కనీసం బురద నుంచో.. చెట్టు నుంచో పట్టుకొని పక్కకు లాగుదామన్నా చవికిపోయిన శరీరానికి సంబంధించిన కండలు, ఎముకలు చేతిలోకి వచ్చాయి. దీంతో ఏమీ చేయలేక ఉబ్బిపోయిన శవాలను చిన్నగా పట్టుకుని బయటకు తీస్తుంటే.. వారి అవయవాలు, ఎముకలు చేతిలోకి ఊడి రావడం చూసి మాలో మాకే ఏడుపొచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో అలాగే చేశాం. అరిష్టమని.. ఊరిలోకి రానివ్వరు.. 1800 నుంచి 2 వేల మంది గర్భవతులు చనిపోయిన ఘటనలలో నేను వారికి పోస్టుమార్టం చేసిన సందర్భాలలో చాలా బాధ అనుభవించానని తోటి వెంకటయ్య అంటున్నాడు. ‘వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు గర్భవతిని అలాగే పూడ్చి పెట్టరు. సాంప్రదాయం ప్రకారం చేయాలని....కర్మకాండలు చేసే ప్రాంతానికి తమను తీసుకెళ్లి అక్కడ బిడ్డను బయటకు తీయమని కోరేవారు. వారి కోరిక మేరకు బిడ్డను వారి చేతిలో పెట్టేవాళ్లం. అప్పుడు ఆ శిశువును వాళ్లు పూడ్చిపెట్టేవాళ్లు. అయితే ముందు ఏవేవో మాటలు చెప్పి తీసుకెళ్లిన కుటుంబీకులు, బంధువులు శవం పూడ్చిన తర్వాత మమ్ములను వెళ్లమని చెప్పేవారు. అప్పుడు వచ్చిన దారిన వెళదామంటే ఊరిలో వారు ఒప్పుకోరు. కారణం ఏమిటంటే గ్రామంలోకి వస్తే అరిష్టమని అలాగే వెళ్లండంటూ అడ్డుగా నిలబడడంతోపాటు కట్టెలు పట్టుకుని ఉంటారు. ఊరి పొలిమేరల్లోకి కూడా రానివ్వరు. ఆ ఊరిలో దారులు ఎటుంటాయో కొత్తగా వచ్చిన మాకు తెలియదు. ఇతర ప్రాంతాల మీదుగా దారి చెబితే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లినా వాహనాల్లో కూడా ఎవరూ ఎక్కించుకోరు. ఇలా ఒకసారి కాదు.. పదుల సార్లు కష్టాలు పడ్డాం’ అని ఆయన వివరించాడు. డాక్టర్‌కు వారధి తోటి.. దేవుడికి పూజారి ఎలా వారధిలా ఉంటాడో పోస్టుమార్టం గదిలో డాక్టర్‌కు తోటి వారధిగానే ఉంటాడు. నేను ఎప్పుడైనా ఇంటిలోని కుటుంబ సభ్యులపైన కొప్పడ్డా.. కానీ తోటీలను చిన్నమాట కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి పనులను సమాజంలో వారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్ ఏం చేయాలన్న తోటి ద్వారానే చేయిస్తారు. కొన్ని శవాలు కాలిపోయి వస్తాయి. మరికొన్ని కుళ్లిపోయి ఉంటాయి. అలాంటి శవాన్ని కూడా పోస్టుమార్టానికి ముందు, తర్వాత నీటితో కడిగి శుభ్రం చేసిది తోటీలే. – డాక్టర్ ఆనంద్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, రిమ్స్, కడప ఇప్పుడు భయం లేదు.. ఒకప్పుడు శవమంటేనే భయçపడే పరిస్థితి. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వాటి మధ్యనే తిరుగుతూ.. ఎవరూ లేని అనాథ శవాలను రోజూ భద్రపర్చడం మొదలుకొని ఇతర పనులన్నీ అక్కడే చేస్తుంటాం. పోస్టుమార్టం గదిలో శవాల మధ్య తిరుగుతూ వైద్యుల సమక్షంలో కత్తిరింపుల కార్యక్రమంలో వేల శవాలను చూశా. ఇప్పుడు భయం అనే పరిస్థితి లేదు. ఫీలింగ్ కూడా ఉండదు. – వెంకటయ్య, మార్చురీ తోటి, కడప నాన్న హయాం నుంచి.. మా నాన్న హయాం నుంచి మార్చురీలో తోటి పని చేస్తున్నా. నాన్న మరణం తర్వాత నాకీ బాధ్యత వచ్చింది. నాన్న ఎప్పుడైనా ఒకసారి మార్చురీలోకి తీసుకెళ్లేవారు. తర్వాత అనారోగ్యం బారిన పడడంతో నేనే వెళ్లేవాడిని. అయితే మొదట్లో భయం, జంకుతో ఇబ్బంది పడినా తర్వాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండానే అక్కడే తిరుగుతుంటాం. మా కుమారుడు రాజా కూడా నాకు మార్చురీలో సహకరిస్తున్నాడు. శవం మార్చురీలోకి తీసుకు రావడం దగ్గరి నుంచి పోస్టుమార్టం అనంతరం అప్పగించే వరకు అన్ని పనులు చేసి పంపిస్తాం. శవాల మధ్యనే తిరుగుతుంటాం. శవాలే మాకు ఆత్మ బంధువులు. – నర్సారావు, మార్చురీ తోటి, కడప -
నిర్మించి వదిలేశారు!
అన్నీఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత చందాన తయారైంది కేంద్రాస్పత్రిలో నిర్మించిన భవనాల పరిస్థితి. కోట్లాది రుపాయలు వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసినా ప్రారంభించకపోవడం వల్ల రోగులకు ఉపయోగపడకుండా పోయాయి. భవనాలు నిర్మించక ప్రారంభించలేదంటే అదీకాదు. నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు ఎందువల్లో వినియోగంలోకి తీసుకురావడం లేదు. విజయనగరం ఫోర్ట్ : కేంద్రాస్పత్రిలో ఉన్న మార్చురి గది శిథిలావస్థకు చేరుకోవడం ఆస్పత్రిలో ఆధునాతన మార్చరీ గదిని సుమారు రూ.1.13 కోట్లుతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతతవరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న మార్చురీ గది చాలా చిన్నది. శవాలను ఒక రోజు కూడ భద్రపరచుకునే వీలులేని పరిస్థితి. దీనికి తోడు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండడంతో మృతదేహాలు ఒకటి రెండు రోజులు ఉన్నా దుర్వాసన వెలువడుతుంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాథశవాలను మూడు, నాలుగు రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. అయితే మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు పాడవడంతో నేలపైనే మృతదేహాలను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణం పూర్తయిన ఐసోలేషన్ వార్డు వివిధ రకాల ఇనఫెక్షన్స్తో వచ్చే వారి కోసం రూ.20 లక్షలతో వార్డు నిర్మించారు. నెలరోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ ప్రారంభించలేదు. ఐసోలేషన్ వార్డు లేకపోవడం వల్ల వివిధ ఇన్ఫెక్షన్స్తో వచ్చే రోగులను ఇన్‌పేషేంట్స్‌గా చేర్చుకోవడం లేదు. ఓపీ సేవలకే పరిమతమవుతున్నాయి. వార్డు వినియోగంలోకి వస్తే ఇన్‌పేషేంట్ సేవలు అందుతాయి. హోమియో ఆస్పత్రిదీ అదే పరిస్థితి అల్లోపతి మాదిరి హోమియో రోగులకుకూడ ఇన్‌పేషేంట్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 10 పడకల హోమియో ఆస్పత్రిని రూ.30 లక్షలతో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయి నెలరోజులు కావస్తోంది. ఇదికూడా ప్రారంభానికి నోచుకోలేదు. హోమియో ఆస్పత్రి వినియోగంలోకి వస్తే రోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రారంభంకాని పిల్లల వార్డు ఆస్పత్రిలో పిల్లలకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు రూ.53 లక్షలతో పిల్లలవార్డును నిర్మించారు. ఈ వార్డు వినియోగంలోకి వస్తే పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుతాయి. ఇప్పడు మహిళల డయేరియా వార్డుపక్కన పిల్లల వార్డు ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతాయోమోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. వినియోగించని అటెండెంట్ షెడ్డు ఆస్పత్రిలో రోగులతో పాటు వచ్చే బంధువులు వి శ్రాంతి తీసుకోవడం కోసం అటెండ్ షెడ్డు నిర్మించారు. దీనివల్ల రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనినిర్మాణం కూడా పూర్తయి 15 రోజులు దాటి ంది. దీన్నికూడా వినియోగంలోకి తీసుకురాలేదు. త్వరలోనే ప్రారంభిస్తాం మార్చురీ గదిని త్వరలోనే ప్రారంభిస్తాం. ఐసోలేషన్ వార్డు నిర్మాణం పూర్తయినప్పటికీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పిల్లల వార్డును కూడా త్వరలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం – కె సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
ఆగని కాసుల వేట
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిలో శవాలపై కాసుల వేట ఆగడం లేదు. అధికారులు మెతక వైఖరి అవలంభిస్తుండడంతో సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కూడా ఓ ఉద్యోగి మృతుల బంధువుల నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. గాజులరేగకు చెందిన ఓ మహిళా మృతదేహానికి పోస్టుమార్టం చేసినందుకు గాను మృతురాలి బంధువు వద్ద కేంద్రాస్పత్రి ఉద్యోగి సిమ్మడు డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మృతిరాలి బంధువు ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించి మీడియాకు అందించారు. ఈ విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటిండెంట్ సీతారామరాజు వద్ద ప్రస్తావించగా, ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
హోలీలో అపశ్రుతి
► కాల్వలో మునిగి యువకుడి మృత్యువాత ► కల్వకోల్ శివారులో ఘటన ► శోకసంద్రంలో కుటుంబసభ్యులు పెద్దకొత్తపల్లి : తోటి స్నేహితులతో కలిసి ఆ యువకుడు హోలీ సంబరాలు జరుపుకొన్నాడు.. ఆనందడోలికల్లో తేలియాడాడు.. ఆ సంతోషం ఎంతోసేపు నిల్వలేదు.. స్నానం చేసేందుకు సమీపంలోని కాల్వకు వెళ్లగా నీట మునిగి మృత్యువాత పడటంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మండలంలోని కల్వకోల్‌కు చెందిన నలవాల లక్ష్మయ్య (28) కు వీపనగండ్ల మండలం కొప్పునూరు వాసి కవితతో సుమారు ఎనిమిదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం నెలరోజుల కుమారుడు ఉన్నాడు. భర్త స్థానికంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామ యువకులతో కలిసి హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకొన్నారు. అనంతరం సింగోటం రిజర్వాయర్ కాల్వ వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని కొల్లాపూర్ ఎస్ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
సచ్చినా కష్టమే..
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా వ్యాప్తంగా నిర్మల్, భైంసా, మంచిర్యాల ఏరి యా ఆస్పత్రులతోపాటు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్ (టి), బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ముథోల్, లక్సెట్టిపేట, చెన్నూర్, బోథ్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం జరుగుతాయి. పోస్టుమార్టం చేసేందుకు ఒక సివిల్ సర్జన్, ముగ్గురు ఎంఎన్‌వోలు అవసరం. వీరు షిఫ్ట్వైస్గా విధులు నిర్వర్తించాలి. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రుల్లో 26 మంది సివిల్ సర్జన్లు, 17 మంది ఎంఎన్‌వోలు ఉన్నారు. సీహెచ్‌సీల్లో 24 మంది సివిల్ సర్జన్లు, 20 మంది ఎంఎన్‌వోలు, సివిల్ ఆస్పత్రుల్లో 11 మంది మెడికల్ ఆఫీసర్లు, 13 మంది ఎంఎన్‌వోలు పనిచేస్తున్నారు. ఈ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ కిందకి వస్తాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 72 పీహెచ్‌సీల్లో ఎక్కడా కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించకపోవడంతో ఈ ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం గదులు ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కానరాని సౌకర్యాలు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో మూడు ఫ్రీజర్లు ఉండగా ఒకటి మూలనపడింది. గది చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తచెదారం ఉంది. పోస్టుమార్టం గదుల్లో మృతదేహాన్ని భద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్లు(మార్చురీ యూనిట్) కనిపించడం లేదు. పోస్టుమార్టం గదుల్లో నీటిసౌకర్యం, రెండు పెద్ద బెంచిలతోపాటు, ఒక విశాలమైన హాల్ ఉండాలి. మూడు మృతదేహాలను ఉంచే సామర్థ్యం గల ఫ్రీజర్లు అందుబాటులో ఉంచాలి. గదిని ఎప్పుడు శుభ్రం చేసేందుకు కెమికల్స్ ఉపయోగించాలి. పోస్టుమార్టం చేసే సమయంలో ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలి. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు ముందస్తుగా సెంట్ చల్లాలి. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం చేస్తున్న చాలా ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు. మృతదేహాలను పడుకోబెట్టేందుకు గద్దెలు (బెంచీ), శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు, ఇతర పరికరాలు కానరావడం లేదు. శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు లేకపోవడంతో అనాథ శవాలు వచ్చినప్పుడు రోజుల తరబడి ఉంచడం ద్వారా కుళ్లిపోతున్నాయి. ఒక రిమ్స్ ఆస్పత్రిలో తప్ప ఎక్కడ కూడా ఫ్రీజర్లు లేవని తెలుస్తోంది. పోస్టుమార్టం గది అంటేనే భయపడేలా కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదితోపాటు, ఇతర ఆస్పత్రుల్లో పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసేందుకు ఉపయోగించే సుత్తె, కత్తెర, ఇతర చిన్న పరికరాలు కూడా పాతవే వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గదిలోపల పోస్టుమార్టం తర్వాత శుభ్రపర్చకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలోపల సౌకర్యాలు లేక ఆరుబయటే పోస్టుమార్టం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఇక్కడి సిబ్బంది పోస్టుమార్టం గదులకు తాళం వేసి వెళ్లిపోవడంతో వైద్యులు, సిబ్బంది కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కేసుల్లో పోస్టుమార్టం ఒకరోజులో చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో బాధిత బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సౌకర్యాలు కల్పిస్తాం.. - బసవేశ్వరీ, డీఎంహెచ్‌వో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోస్టుమార్టం గదుల్లో లేని సౌకర్యాలపై దృష్టిపెట్టాం. ఫ్రీజర్లు లేని ఆస్పత్రులను గుర్తించి వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటాం. మృతదేహం వచ్చిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం నిర్వహించే వెసులుబాటు లేదు. అన్ని ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.