హోలీలో అపశ్రుతి
► కాల్వలో మునిగి యువకుడి మృత్యువాత
► కల్వకోల్ శివారులో ఘటన
► శోకసంద్రంలో కుటుంబసభ్యులు
పెద్దకొత్తపల్లి : తోటి స్నేహితులతో కలిసి ఆ యువకుడు హోలీ సంబరాలు జరుపుకొన్నాడు.. ఆనందడోలికల్లో తేలియాడాడు.. ఆ సంతోషం ఎంతోసేపు నిల్వలేదు.. స్నానం చేసేందుకు సమీపంలోని కాల్వకు వెళ్లగా నీట మునిగి మృత్యువాత పడటంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మండలంలోని కల్వకోల్‌కు చెందిన నలవాల లక్ష్మయ్య (28) కు వీపనగండ్ల మండలం కొప్పునూరు వాసి కవితతో సుమారు ఎనిమిదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం నెలరోజుల కుమారుడు ఉన్నాడు.
భర్త స్థానికంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామ యువకులతో కలిసి హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకొన్నారు. అనంతరం సింగోటం రిజర్వాయర్ కాల్వ వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఇది గమనించిన స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని కొల్లాపూర్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.