26 ఏళ్ల యువకుడిగా మార్చేశారు..
న్యూయార్క్ : వైద్యో నారాయణ హరిః అన్నమాటను న్యూయార్క్‌లోని వైద్యులు మరోసారి నిజం చేశారు. సుమారు 26 గంటలు కష్టపడి అతి క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి సృష్టికి ప్రతిసృష్టి చేశారు. 41ఏళ్ల మధ్యవయస్కుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసి 26 ఏళ్ల యువకుడిగా మార్చేశారు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన లాంగోన్ మెడికల్ సెంటర్ ప్రపంచంలోనే అరుదైన, అతి పెద్ద ఫేస్ లిఫ్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.
వివరాల్లోకి వెళితే... మిస్సిసిపికి చెందిన పాట్రిక్ హార్డ్సన్ , అగ్నిమాపక దళంలో వాలంటీర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో 2001 సంవత్సరంలో జరిగిన ఓ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పాట్రిక్ హార్డ్సన్ గుర్తు పట్టలేనంతగా మొహం కాలిపోయింది. కనీసం కళ్లను కదిలించలేనంతగా చర్మం దెబ్బతింది. పెదాలు, ముక్కు, కనుబొమ్మలు, చివరికి పెదాలు చెవులు కూడా పూర్తిగా కాలింది.
సుమారు 150 మంది వైద్యుల బృందం... 26 గంటల కష్టపడి ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించారు. తల మీద చర్మం, మొహం సహా కళ్లు, కనుబొమలు, ముక్కు, చెవులు, పెదాలు అమర్చి కొత్త రూపును తీసుకొచ్చారు. దీంతో పాట్రిక్ హార్డ్సన్ కంటి పాపల కదలికలతో పాటు, చూపు, వినికిడి శక్తి సాధారణ స్థితికి వచ్చాయి. అంతేకాదు మధ్యవయస్సుడు కాస్త యువకుడిలా మారిపోయాడు.
కాగా ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన 26 ఏళ్ల యువకుడి శరీర భాగాలను స్వీకరించిన వైద్యులు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అసాధ్యం అనుకున్న... పాట్రిక్ హార్డ్సన్ కంటి చూపును వెనక్కి రప్పించడం తాము సాధించిన పెద్ద విజయమని ప్లాస్టిక్ సర్జన్ ఎడ్యుర్డో రోడ్రిగ్యూజ్ తెలిపారు. తమ బృందం అత్యంత చాకచక్యంగా, అతి సున్నితంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద ట్రాన్స్‌ప్లాంటేషన్ అని ఆయన పేర్కొన్నారు.
ఇక పాట్రిక్ కూడా తన ముఖానికి కొత్త రూపు తీసుకొచ్చిన వైద్యులకు, అవయవదానం చేసిన యువకుని తల్లికి కృతజ్ఙతలు తెలిపారు. ఆ కుటుంబం మంచితనానికి, మానవత్వానికి ప్రతిఫలం తన కొత్త రూపమన్నాడు. అలాగే ఒకప్పుడు పాట్రిక్ మొహం చూడ్డానికి భయపడిన పిల్లలు కూడా శస్త్రచికిత్స అనంతరం సంతోషం వ్యక్తం చేశారు.