బెస్టు..వరస్టు.. కరప్టు
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అనుకూల,ప్రతికూలమైన రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్పీల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్ సీఏఈఆర్) విడుదల చేసింది. ఇందులో గుజరాత్, ఢిల్లీలు పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలుగా, బీహార్, జార్ఖండ్ లు వరస్ట్ అని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అత్యంత అవినీతి గల రాష్ట్రాలుగా, పశ్చిమ బెంగాల్ లో భూమి సేకరణ, పర్యావరణ అనుమతులు లభించడం కష్టమని నివేదిక తేల్చింది. లేబర్ , మౌలిక సదుపాయాలు, ఆర్థిక వాతావరణం , రాజకీయ స్థిరత్వం,పరిపాలన, ఒక మంచి వ్యాపార వాతావరణం అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు.
నివేదికను రూపొందించేందుకు వ్యాపార వేత్తల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఇందులో పరిశ్రమల స్థాపనకు 79 శాతం మంది అవినీతి అతిపెద్ద సమస్య అని, 72 శాతం మంది పరిపాలనాపరమైన అనుమతులు లభించడం కష్టమని,66.7 శాతం మంది పర్యావరణ అనుమతులు లభించడం కష్టమని చెప్పారని నివేదిక తెలిపింది. ట్రాన్పరెన్సీ ఇంటర్ నేషనల్ పర్సప్షన్ నివేదిక-2015 లో 168 దేశాలలో జరిపిన అధ్యయనంలో ఇండియా 76 వ స్థానంలో నిలిచింది.