‘మార్పు’ లేనిదే నివారణ సాధ్యమేనా?
జిల్లాలో ‘మార్పు’ పథకం అమలు ప్రహసనంగా మారింది. మాతాశిశు మరణాల నివారణ కోసం అమలు చేస్తున్న ఈ పథకం అబాసుపాలవుతోంది. ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో డెలివరీ అయిన కేసులను కూడా పీహెచ్‌సీల్లో ప్రసవించినట్లు నమోదు చేస్తూ కాకి లెక్కలతో మాయ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గర్భిణుల గుర్తింపు సర్వే కూడా వాస్తవాలకు, అధికారిక లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ విషయం ఇటీవల కేంద్ర బృందం పరిశీలనలో తేలడంతో వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేగింది.
- ఆగని మాతా శిశు మరణాలు
- పీహెచ్‌సీల్లో కనీస సౌకర్యాలు మృగ్యం
- ప్రభుత్వానికేది గురి...
- సమీక్షలతోనే సరి...
విజయవాడ : జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించేందుకు ‘మార్పు’ పేరుతో మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. అందులో భాగంగా ప్రతి గర్భిణీని గుర్తించి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, ఆమెకు అవసరమైన పోషకాహారం అందించాల్సి ఉంది. ప్రతిరోజు పాలు, కోడిగుడ్డు, ఇతర పోషకాహారం అందించాలి. ప్రసవం ఖచ్చితంగా ప్రభుత్వాస్పత్రిలోనే జరగాలనేది ప్రభుత్వ నిబంధన. ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేసేందుకు జిల్లాలో ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. రెండుళ్లుగా పథకం అమలు జరుగుతున్నా.. ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి.
కనీస సౌకర్యాలూ కరువే...
జిల్లాలో సుమారు 75 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిలో సగానికిపైగా నెలలో ఒకటి, రెండు ప్రసవాలు మాత్రమే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పీహెచ్‌సీల పరిధిలో ప్రసవం కోసం గర్భిణీలు వచ్చినా సౌకర్యాలు లేకపోవడంతో మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు తరలించేస్తున్నారు. కొన్ని పీహెచ్సీలో డెలివరీ టేబుల్స్ కూడా లేని దయనీయ స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రసవాలు చేయాలని అక్కడి వైద్యులు సిబ్బందిప్రశ్నిస్తున్నారు. ఏరియా ఆస్పత్రుల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.
దాదాపు కేసులన్నీ ప్రభుత్వాస్పత్రికే...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పోవడంతో అన్ని ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అంతేకాక పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు జిల్లా ఆస్పత్రి, భీమవరం, తాడేపల్లిగూడెం నుంచి సైతం నిత్యం డెలివరీ కేసులు వస్తున్నాయి.
దీంతో గర్భిణీలు పడుకునేందుకు పడకలు కూడా లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రసవాలు చేసే లేబర్ వార్డులో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రసవాలు చేయలేమని, తక్షణమే యూనిట్లు పెంచడంతో పాటు, వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ ఆ విభాగం వైద్యులు ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్లకు లేఖ రాశారు.
తప్పుడు నివే దికలు...!
మార్పు పథకంలో బాగంగా ఖచ్చితంగా ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిబంధన ఆరోగ్య కార్యకర్తలపై తీవ్ర వత్తిడి పెంచుతోంది. నర్శింగ్హోమ్లలో జరిగిన వాటిని కూడా పీహెచ్‌సీల్లో జరుగుతున్నట్లు నమోదు చేయడం ఇటీవల వివాదస్పదంగా మారింది.
మాతశిశు మరణాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఇటీవల కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. వారి విచారణలో నర్శింగ్హోమ్లో ప్రసవించిన వారు పీహెచ్సీలో ప్రసవం జరిగినట్లు నమోదు చేసినట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల ప్రతి గర్భిణీ ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలని ఆదేశించడంతో, ఒక్కో గర్భిణీ రెండుసార్లు నమోదయినట్లు తేలింది. ఇలా విజయవాడలోనే అధికంగా జరిగినట్లు సమాచారం.