విశాఖ జిల్లాలో విషాదం.. అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో..
సాక్షి, విశాపట్నం: ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన విభేదాలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది. అన్నెం, పున్నెం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెంకు చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో డ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి భాను(4), పృధ్వీరాజ్(2) జన్మించారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తనే వస్తుందని భావించిన నాగరాజు పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, పృధ్వీలను తీసుకుని సమీపంలో ఉండే భావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది.
చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..)
ఈ ఘటనలో చిన్నారులు మృతి చెందగా, దూకిన తరువాత భయపడ్డ తల్లి సాయి బావిలో మెట్టుపట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఉదయం అటుగా వస్తున్న మనుషుల శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.