కన్నబిడ్డల కోసం ఆ తల్లి పోరాడింది, చివరకు..
పిల్లలకు చిన్నగాయమైనా, కాసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. వాళ్లను తమ నుంచి శాశ్వతంగా దూరం చేసే యత్నం చేస్తే? తమ సంరక్షణలో పెరగనివ్వకుండా చట్టాలు అడ్డుకుంటే!. సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో దూరమైన బిడ్డలు.. స్వదేశంలో తల్లి చెంతకు చేరిన కథే ఇది. అందుకోసం చట్టం పోరాడిందామె. ఈ క్రమంలో భర్తకు దూరమైంది. ఆయినా ఆమె కుంగిపోలేదు. ప్రయత్నించి.. చివరకు పిల్లలను దక్కించుకుంది. ఆ కథనే రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో బాలీవుడ్లో ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’గా తెరకెక్కించారు.
తన కన్నబిడ్డల కస్టడీ కోసం భారత్‌కు చెందిన ఓ మహిళ.. నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం అప్పట్లో వార్తల్లో హెడ్‌లైన్స్ అయ్యింది. ఆ గడ్డపై ఓటమి పాలైనా.. అది తాత్కాలికమే అయ్యింది. చివరికి స్వదేశానికి చేరుకుని పిల్లల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ తల్లి విజయం సాధించి పదేళ్లు పూర్తైంది. ఇంతకీ అప్పుడేం జరిగింది..
పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన అనురూప్ ఛటర్జీ ఉద్యోగం రిత్యా నార్వేకు వెళ్లాడు. కూడా భార్య సాగరికాను తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబును చూసుకోవడంతోనే సాగరికకు సరిపోయేదట. ఈలోపు ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో కొడుకును చూసుకోవడం కష్టంగా మారిందామె. ఇదే ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, కన్నబిడ్డలను దూరం చేసేందుకు నార్వే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది.
నార్వేలో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందరూ వాటిని పాటించాలి. పిల్లలను కొట్టినా.. చివరకు చేత్తో తినిపించినా శిక్షార్హమైన నేరమే. అలాంటిది కొడుకు కోసం సెపరేట్ బెడ్ లేకపోవడం(తండ్రితోనే పడుకునేవాడు)తో.. ఆమె తన కొడుకును సరిగా చూసుకోవడం లేదంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్(Barnevarne అని కూడా అంటారు)కు ఫిర్యాదు వెళ్లింది. వెంటనే అనురూప్ ఇంటికి బార్నెవార్నె అధికారులు వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో..
ఆమె కొడుకు వెళ్లే ప్లే స్కూల్ నిర్వాహకులు.. సాగరిక దినచర్య సరిగా ఉండదని, తరచూ పిల్లాడి విషయంలో కౌన్సిలింగ్‌కు పిలిచేవాళ్లమంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్‌కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతలో మరో బిడ్డను ప్రసవించాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. పిల్లలిద్దరినీ ఆమె సరిగా పెంచడం లేదంటూ.. వాళ్లను తల్లిదండ్రులకు దూరంగా సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి.
ఇది జరిగింది 2011లో. అప్పటికి కొడుకు వయసు రెండున్నరేళ్లు కాగా, పాపకి ఏడాది వయసు కూడా లేదు. కోర్టుకు వెళ్తే.. సంరక్షణా కేంద్రానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. కావాలంటే ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వచ్చి చూడొచ్చంటూ కోర్టు తల్లిదండ్రులకు చెప్పింది. మానసికంగా వాళ్లకు కుంగదీసింది ఈ పరిణామం. ఆ ప్రభావంతో అనురూప్-సాగరికల మధ్య దూరం పెరిగి.. విడిపోయారు.
కోల్‌కతా కోర్టు తీర్పు అనంతరం బయట సంతోషంగా సాగరిక
మరోవైపు సాగరిక కథ హెడ్‌లైన్స్ ద్వారా భారత్‌కు చేరింది. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నించింది. కానీ, నార్వే ప్రభుత్వం మొండివైఖరి అవలంభించింది. చివరికి.. భారత్ ఒత్తిడికి తలొగ్గి బంధువులకు అప్పగించేందుకు నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అలా.. 2012లో పిల్లలు భారత్‌లోని తమ బంధువు వద్దకు వచ్చారు. కానీ, సాగరిక తన న్యాయపోరాటం ఆపలేదు. స్వస్థలానికి చేరుకున్నాక.. కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిందామె. 2013 జనవరిలో కోల్‌కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆ తల్లికి అవి వర్ణించలేని క్షణాలు. సాగరిక పోరాటాన్నే ఇప్పుడు తెరపై రాణీ ముఖర్జీ ప్రదర్శించబోతున్నారు. మార్చి 17వ తేదీన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రం విడుదల కానుంది.
:::సాక్షి ప్రత్యేకం