అచ్చం పాత తెలుగు సినిమా హీరోలాగే!
ఇది అచ్చం పాత తెలుగు సినిమా హీరోలకు ఉన్నలాంటి కథ. హీరో తల్లికి తీవ్రంగా జబ్బు చేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో తొలిసారి దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత పెద్ద గజదొంగగా మారుతాడు. ఢిల్లీలో కూడా ఒక యువకుడు నిజంగానే ఇలాంటి పరిస్థితిలోనే దొంగగా మారాడు. తన యజమానుల ఇంట్లోంచి ఏకంగా రూ. 90 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బబ్రాల్ గ్రామంలో గల అతడి ఇంట్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసినప్పుడు.. అతడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి పక్కనే కూర్చుని ఉన్నాడు. అతడిపక్కనే రూ. 90 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్ ఉంది. అతడి పేరు బ్రిజేష్. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఈనెల 8వ తేదీన తన యజమాని ఇంట్లోంచి 11 డైమండ్ నక్లెస్ లు, 8 డైమండ్ గాజులు, 24 బంగారు చెవిరింగులు, 20 ఉంగరాలు, రూ. 20వేల నగదు తీసుకుని పారిపోయాడు.
16వ తేదీన ఆ ఇంటి యజమానురాలు నమ్రతాకుమారి యూరప్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నగలు లేని విషయాన్ని గుర్తించి పోలీసులకు బ్రిజేష్ మీద అనుమానంతో ఫిర్యాదుచేశారు. గతంలో ఇంట్లో పనిచేసిన అతడిని, అతడి పనితీరు నచ్చక ఆమె తీసేశారు. కానీ, ఆమె దేశంలో లేని సమయంలో జూన్ 7 నుంచి 9 వరకు అతడు అక్కడే పనిచేసినట్లు తెలిసింది. దాంతో అతడిమీదే అనుమానం వచ్చింది. సరిగ్గా అతడి తల్లి అనారోగ్యం బారిన పడిన సమయంలోనే ఉద్యోగం కూడా పోయింది. దాంతో డబ్బులు బాగా అవసరమై, తప్పనిసరి పరిస్థితుల్లో అతడు దొంగగా మారాడు. చాలా ఏళ్ల క్రితమే తండ్రి చనిపోవడం, ఇద్దరు తమ్ముళ్లను పెంచే బాధ్యత కూడా అతడిమీదే ఉండటంతో 2015లో ఢిల్లీకి వచ్చి ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టాడు. చివరకు ఇలా దొంగగా మిగిలాడు.