mother injured
-
కొడుకు నీలా లేడంటూ.. తల్లిని చితక్కొట్టారు!
సాధారణంగా కొడుకులు తల్లి పోలిక, కూతుళ్లు తండ్రి పోలిక అంటారు. అయితే పాకిస్థాన్‌లోని లాహోర్‌లో సొంత కొడుకే అయినా తల్లి పోలికల్లో లేకపోవడంతో.. ఆమెను పిల్లలు ఎత్తుకుపోయే మహిళగా భావించి కొంతమంది కలిసి చితక్కొట్టేశారు. లాహోర్‌లోని బోగివాల్ ప్రాంతానికి చెందిన సాదియా అనే మహిళ రంగు, కొడుకు రంగు ఒకలా లేవంటూ కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె ఒక ఇంట్లోకి ఏదో దొంగిలించేందుకు వెళ్తుండగా తాము చూశామని, ఆమెతో పాటు పదేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడని ఆ గుంపులో సభ్యులు చెప్పారు. అయితే ఆ అబ్బాయికి, తల్లికి పోలికలు లేకపోవడంతో.. ఆమె ఆ పిల్లాడిని దొంగిలించి ఉంటుందని అనుకున్నారు. అయితే, అక్కడకు దగ్గర్లోని ఓ కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి.. పోలీసులకు అప్పగించారు. ఆ పిల్లాడు ఆమె కొడుకేనని గుర్తించిన పోలీసులు ఆమెను విడిచిపెట్టారు. అయితే.. ఆ గుంపుపై ఫిర్యాదు చేసేందుకు ఆమె నిరాకరించింది. ఆ గుంపులో దాదాపు 25 మందికి పైగా ఉన్నారు. వాళ్లలో మహిళలు సైతం ఉన్నారు. -
ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం
- తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం - మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతలలో దారుణం ఉప్పునుంతల(మహబూబ్‌నగర్): ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసిన తల్లి తనూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మ (22) భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి కొడుకు జశ్వంత్ (5), కూతురు లక్కీ (2). భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహారెడ్డి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. భార్య శ్రీమతి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన ఇద్దరు పిల్లలను అతిదారుణంగా గొంతులు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా బలవంతంగా కత్తితో గొంతుకోసుకుంది. బయట వరండాలో టీవీ చూస్తున్న అత్త, ఇంటి పక్క మహిళలు ఇంట్లోని గది నుంచి ఏదో శబ్దం రావడం గమనించారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. శ్రీమతి మాత్రం గొంతు భాగం కొంచెం తెగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్ అక్కడి చేరుకుని కొనప్రాణంతో ఉన్న ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోవల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో కలివిడిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఏనాడూ గొడవ పడలేదని కూడా వారు తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణం కావచ్చునని స్థానికులు అంటున్నారు. -
తండ్రి పీక కోసి.. తల్లిపై కత్తితో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ నవోదయ నగర్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తన కన్నతండ్రి పీక కోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తండ్రి ఎల్లయ్య (60) అక్కడికక్కడే మరణించాడు. అడ్డొచ్చిన తల్లి లక్ష్మమ్మపై కొడుకు లక్ష్మణ్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై స్థానికులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మమ్మను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.