ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం | mother injured and 2 kids died in mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం

Published Fri, Nov 6 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

mother injured and 2 kids died in mahabubnagar district

- తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం
- మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతలలో దారుణం

ఉప్పునుంతల(మహబూబ్‌నగర్): ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసిన తల్లి తనూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మ (22) భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి కొడుకు జశ్వంత్ (5), కూతురు లక్కీ (2). భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహారెడ్డి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు.

భార్య శ్రీమతి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన ఇద్దరు పిల్లలను అతిదారుణంగా గొంతులు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా బలవంతంగా కత్తితో గొంతుకోసుకుంది. బయట వరండాలో టీవీ చూస్తున్న అత్త, ఇంటి పక్క మహిళలు ఇంట్లోని గది నుంచి ఏదో శబ్దం రావడం గమనించారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. శ్రీమతి మాత్రం గొంతు భాగం కొంచెం తెగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆనంద్ అక్కడి చేరుకుని కొనప్రాణంతో ఉన్న ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోవల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో కలివిడిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఏనాడూ గొడవ పడలేదని కూడా వారు తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణం కావచ్చునని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement