Uppununthala
-
అస్తవ్యస్తంగా ’మిషన్ భగీరథ’
సాక్షి,ఉప్పునుంతల : నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్లో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వీధుల వెంట వేసిన పైప్‌లైన్ పనులు సరిగా చేయకపోవడంతో లీకేజీలతో త్రాగునీరు వృథాగా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ నల్లా కనెక్షన్లో భాగంగా వేసి ఉంచిన పైప్‌లకు తూతూ మంత్రంగా నల్లాలు అమర్చారని తెలిపారు. కాంట్రాక్టర్ కేవలం వంతుకు గంతేసినట్లు పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు భగీరథ పనులను నాణ్యతతో చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
2.05లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ
సాక్షి, ఉప్పునుంతల : జిల్లాలో ఇప్పటివరకు 2.05 లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఈ.శ్రీధర్ వెల్లడించారు. ఈనెలాఖరు లోగా తప్పులు సరిచేసి మరో 25వేల పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేయడం, తహసీల్దార్ డిజిటల్ సంతకం, ప్రొసిడింగ్స్, తదితర విషయాలను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్ట్ ‘ఏ’లో ఉన్న 2.68లక్షల రైతు ఖాతాలకు అన్ని వివరాలు సరిగా ఉన్న 2.30లక్షల ఖాతాలకు పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించినట్లు చెప్పారు. వాటిలో రైతులకు రైతుబంధు పెట్టుసాయం చెక్కులతో పాటు 2.05లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన చేయడం జరిగిందన్నారు. మిగిలిన 25వేల పాస్‌పుస్తకాల్లో 6000మంది రైతులు పాస్‌పుస్తకాలు తీసుకోవడాని రాలేదని తెలిపారు. 19వేల రైతు ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాల్లో భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు తదితర వివరాల్లో తప్పులు దొర్లడం, ఇటీవల చనిపోయిన రైతులు, భూములు అమ్ముకున్న వాటిని సరిచేసి ఈనెలాఖరు వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. 38వేల మంది ఖాతాలకు సకాలంలో రైతులు ఆధార్‌కార్డును అందజేయకపోవడం, ఫొటోలు లేకపోవడంతో పాస్‌పుస్తకాలు ప్రింట్ కాలేదని తెలిపారు. ఇక జిల్లాలో పార్ట్–బీ జాబితాల పెండింగ్‌లో ఖాతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, కోర్టు వివాదం, ఒకే భూమికి సంబంధించి ఇద్దరికి మంది పట్టాదార్లు ఉండడం వంటి సమస్యలు కేవలం ఐదుశాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ అదేశాలపై రెండో విడత భూ ప్రక్షాళనలో సరిచేసి అర్హత ఉన్న వాటికి పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. ధరణీ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత త్వరలోనే మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అమలుచేయబోతున్న రైతు బీమా పథకం కోసం ఇటీవల కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం సరిగా సాగడం లేదంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానమిస్తూ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమైనందున ప్రజావాణికి రెండు నెలలుగా కొంత అంతరాయం కలిగిందని, త్వరలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ అమరేందర్ ఉన్నారు. -
ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం
- తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం - మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతలలో దారుణం ఉప్పునుంతల(మహబూబ్‌నగర్): ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసిన తల్లి తనూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మ (22) భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి కొడుకు జశ్వంత్ (5), కూతురు లక్కీ (2). భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహారెడ్డి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. భార్య శ్రీమతి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన ఇద్దరు పిల్లలను అతిదారుణంగా గొంతులు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా బలవంతంగా కత్తితో గొంతుకోసుకుంది. బయట వరండాలో టీవీ చూస్తున్న అత్త, ఇంటి పక్క మహిళలు ఇంట్లోని గది నుంచి ఏదో శబ్దం రావడం గమనించారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. శ్రీమతి మాత్రం గొంతు భాగం కొంచెం తెగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్ అక్కడి చేరుకుని కొనప్రాణంతో ఉన్న ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోవల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో కలివిడిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఏనాడూ గొడవ పడలేదని కూడా వారు తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణం కావచ్చునని స్థానికులు అంటున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లెలో మంగళవారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని విశాఖ నగరంలోని కింగ్ జార్జీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మినీ బస్సు బోల్తా పడింది. ఆ మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులంతా హైదరాబాద్ వాసులే.