ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలిస్తున్న కలెక్టర్
సాక్షి, ఉప్పునుంతల : జిల్లాలో ఇప్పటివరకు 2.05 లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఈ.శ్రీధర్ వెల్లడించారు. ఈనెలాఖరు లోగా తప్పులు సరిచేసి మరో 25వేల పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేయడం, తహసీల్దార్ డిజిటల్ సంతకం, ప్రొసిడింగ్స్, తదితర విషయాలను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్ట్ ‘ఏ’లో ఉన్న 2.68లక్షల రైతు ఖాతాలకు అన్ని వివరాలు సరిగా ఉన్న 2.30లక్షల ఖాతాలకు పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించినట్లు చెప్పారు.
వాటిలో రైతులకు రైతుబంధు పెట్టుసాయం చెక్కులతో పాటు 2.05లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన చేయడం జరిగిందన్నారు. మిగిలిన 25వేల పాస్‌పుస్తకాల్లో 6000మంది రైతులు పాస్‌పుస్తకాలు తీసుకోవడాని రాలేదని తెలిపారు. 19వేల రైతు ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాల్లో భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు తదితర వివరాల్లో తప్పులు దొర్లడం, ఇటీవల చనిపోయిన రైతులు, భూములు అమ్ముకున్న వాటిని సరిచేసి ఈనెలాఖరు వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. 38వేల మంది ఖాతాలకు సకాలంలో రైతులు ఆధార్‌కార్డును అందజేయకపోవడం, ఫొటోలు లేకపోవడంతో పాస్‌పుస్తకాలు ప్రింట్ కాలేదని తెలిపారు. ఇక జిల్లాలో పార్ట్–బీ జాబితాల పెండింగ్‌లో ఖాతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, కోర్టు వివాదం, ఒకే భూమికి సంబంధించి ఇద్దరికి మంది పట్టాదార్లు ఉండడం వంటి సమస్యలు కేవలం ఐదుశాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అదేశాలపై రెండో విడత భూ ప్రక్షాళనలో సరిచేసి అర్హత ఉన్న వాటికి పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. ధరణీ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత త్వరలోనే మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అమలుచేయబోతున్న రైతు బీమా పథకం కోసం ఇటీవల కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం సరిగా సాగడం లేదంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానమిస్తూ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమైనందున ప్రజావాణికి రెండు నెలలుగా కొంత అంతరాయం కలిగిందని, త్వరలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ అమరేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment