Pass Books Online
-
ముందుకుసాగని రెవెన్యూ పనులు
కొడంగల్: నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల కొరత ఉంది. మండలంలో 14 క్లస్టర్లు ఉండగా ఆరుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. మున్సిపాలిటీగా మారిన కొడంగల్ క్లస్టర్‌కు ఒక్కరు కూడా లేరు. ఈ నేపథ్యంలో రెవెన్యూ పాలన ముందుకు సాగడం లేదు. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల్లో రెవెన్యూ సిబ్బంది కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొడంగల్ మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల పలు రకాల పనులు పెండింగ్ పడిపోతున్న దుస్థితి ఏర్పడింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయడానికి సమయం పడుతోంది. ప్రభుత్వం అందించిన రైతుబంధు చెక్కులదీ ఇదే పరిస్థితి. వీటిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఏడాది క్రితం 1,745 మంది రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు వచ్చాయి. 250 మంది ఎన్ఆర్ఐ చెక్కులు పంపిణీ చేయలేదు. సిబ్బంది కొరత వల్ల కార్యాలయంలో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాకుండా భూముల పంచనామా, క్లియరెన్స్ తదితర పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం మళ్లీ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతు బంధు చెక్కులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా రైతు సమగ్ర సర్వే చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే నెల మే 15 లోపు రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల కొరత ఉన్నందున పనులు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సిబ్బంది కొరత వల్ల ఉన్నతమైన ప్రభుత్వ ఆశయం ముందుకు సాగడం లేదు. -
ఈసారి ‘డేగ’ వంతు
సాక్షి, ముదిగొండ: ఏసీబీ వలలో ఎప్పుడూ అవినీతి చేపలే పడతాయి. ఈసారి మాత్రం ‘డేగ’ చిక్కుకుంది. పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నమోదైన నాలుగు ఎకరాల 12 కుంటల భూమిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు ఓ రైతు నుంచి పదివేల రూపాయలను లంచంగా ఇవ్వాలని వీఆర్ఓ డేగల రాజేంద్రం డిమాండ్ చేశాడు. ఈ అవినీతి ‘డేగ’ పైకి ఏసీబీ అధికారులు వల విసిరారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు. మండలంలోని గంధసిరి గ్రామ రైతు చెమట నాగేశ్వరరావు పేరిటగల పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నాలుగు ఎకరాల 12 కుంటల భూమి వివరాలు నమోదయ్యాయి. వీటిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు నాగేశ్వరరావు కుమారుడు వేణు, నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి వీఆర్ఓ డేగల రాజేంద్రం వద్దకు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పదివేల రూపాయలు ఇస్తేనే, కొత్త పాస్ పుస్తకంలోకి భూమి వివరాలు ఎక్కిస్తానని డేగల రాజేంద్రం స్పష్టంగా చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వేణు చెప్పారు. కొద్ది రోజుల తరువాత, ఎనిమిదివేల రూపాయలకు వీఆర్ఓ దిగొచ్చాడు. ఈ మొత్తాన్ని ఆయనకు వేణు సమర్పించుకున్నాడు. కొత్త పాస్ పుస్తకం చేతికొచ్చింది. తీరా చూస్తే... అందులో, కేవలం రెండు ఎకరాల 23 కుంటల భూమి మాత్రమే ఎక్కింది. మిగతా, ఒక ఎకరం 28 కుంటలన్నర ఎక్కించలేదు. దీని కోసం, వేణు మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు వెళ్లినా వీఆర్ఓ డేగల రాజేంద్రం పట్టించుకోవడం లేదు. మరో ఐదువేల రూపాయలు ఇస్తే... పని పూర్తవుతుందని వేణుకు గురువారం డేగల రాజేంద్రం ఫోన్ చేశాడు. వెంటనే ఖమ్మం చేరుకున్న వేణుకు, ఏం చేయాలో పాలుపోలేదు. తన గోడును వినిపించేందుకు ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లాడు. అవినీతి ‘డేగ’ను ఇలా పట్టేశారు... లంచం కోసం వేణును, అతడి తండ్రిని పీక్కు తింటున్న ఆ ‘డేగ’ను వల వేసి పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం వేశారు. ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద వేణు నుంచి ఐదువేల రూపాయలు తీసుకుంటున్న డేగల రాజేంద్రాన్ని వరంగల్ ఏసీబీ డీఎస్పీ ఎస్.ప్రతాప్, సీఐలు ఎస్వీ రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వెంకట్... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడి నుంచి రైతు కుమారుడు వేణును, వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ముదిగొండ తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. డీటీ కరుణాకర్‌రెడ్డి, వీఆర్ఓ నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతు వద్దనున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించారు. అతని నుంచి వివరా లు సేకరించి రికార్డ్ చేశారు. వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు విలేకరులకు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏసీబీ అధికారులకు 94407 00049 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. -
పాసుబుక్కు ఇవ్వడంలేదని టవరెక్కిన రైతు
గన్నేరువరం(మానకొండూర్): అధికారులు వెంట నే తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరు తూ మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెంది న జేరిపోతుల చొక్కాయ్య మంగళవారం సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలోని 276 సర్వేనంబర్‌లో ఎకరం భూమి తన తండ్రి మొండ య్య ద్వారా వారసత్వంగా వస్తుందని తెలిపాడు. దీనికి సంబంధించి పాసుబుక్కును అధికారులు ఇవ్వడంలేదని ఆరోపించాడు. దీంతో రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదని, సమస్య పరిష్కారం కోసం టవర్‌ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసి చొక్కాయ్య భార్య లత పిల్లలతో సెల్‌టవర్ వద్దకు చేరుకుంది. తమ భూమి నుంచి వరదకాల్వ వెళ్తోందని, భూముల కోల్పోతున్న రైతుల జాబితాలో తమపేరు ఉందని తెలిపింది. ఈ ఏడాది పంటలను సైతం సాగుచేసినట్లు పేర్కొంది. పాసు బుక్కు ఇవ్వడంలో అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ఈ భూమిపై గ్రామానికి చెందిన ఒక రైతు కోర్టుకు వెళ్లాడంతో వివాదం కొనసాగుతోందని, కోర్టు పరిధిలో ఉన్నందున్న జోక్యం చేసుకోలేమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారించడానికి కృషి చేస్తానని ఎస్సై వంశీకృష్ణ హామీ ఇవ్వడంతో చొక్కాయ్య సెల్ టవర్ దిగివచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
2.05లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ
సాక్షి, ఉప్పునుంతల : జిల్లాలో ఇప్పటివరకు 2.05 లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఈ.శ్రీధర్ వెల్లడించారు. ఈనెలాఖరు లోగా తప్పులు సరిచేసి మరో 25వేల పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేయడం, తహసీల్దార్ డిజిటల్ సంతకం, ప్రొసిడింగ్స్, తదితర విషయాలను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్ట్ ‘ఏ’లో ఉన్న 2.68లక్షల రైతు ఖాతాలకు అన్ని వివరాలు సరిగా ఉన్న 2.30లక్షల ఖాతాలకు పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించినట్లు చెప్పారు. వాటిలో రైతులకు రైతుబంధు పెట్టుసాయం చెక్కులతో పాటు 2.05లక్షల ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన చేయడం జరిగిందన్నారు. మిగిలిన 25వేల పాస్‌పుస్తకాల్లో 6000మంది రైతులు పాస్‌పుస్తకాలు తీసుకోవడాని రాలేదని తెలిపారు. 19వేల రైతు ఖాతాలకు సంబంధించిన పాస్‌పుస్తకాల్లో భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు తదితర వివరాల్లో తప్పులు దొర్లడం, ఇటీవల చనిపోయిన రైతులు, భూములు అమ్ముకున్న వాటిని సరిచేసి ఈనెలాఖరు వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. 38వేల మంది ఖాతాలకు సకాలంలో రైతులు ఆధార్‌కార్డును అందజేయకపోవడం, ఫొటోలు లేకపోవడంతో పాస్‌పుస్తకాలు ప్రింట్ కాలేదని తెలిపారు. ఇక జిల్లాలో పార్ట్–బీ జాబితాల పెండింగ్‌లో ఖాతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, కోర్టు వివాదం, ఒకే భూమికి సంబంధించి ఇద్దరికి మంది పట్టాదార్లు ఉండడం వంటి సమస్యలు కేవలం ఐదుశాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ అదేశాలపై రెండో విడత భూ ప్రక్షాళనలో సరిచేసి అర్హత ఉన్న వాటికి పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. ధరణీ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత త్వరలోనే మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అమలుచేయబోతున్న రైతు బీమా పథకం కోసం ఇటీవల కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం సరిగా సాగడం లేదంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానమిస్తూ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమైనందున ప్రజావాణికి రెండు నెలలుగా కొంత అంతరాయం కలిగిందని, త్వరలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ అమరేందర్ ఉన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
బలిజిపేట: పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ విజయ నగరం జిల్లా బలిజిపేట మండలంలోని పెదపెంకి వీఆర్ఓ బె జ్జిపురం నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం శివడవలస గ్రామానికి చెందిన వెంగళ నారాయణరావు, భార్య లక్ష్మీరాణి పేరున పెదపెంకి పంచాయతీ పరిధిలో ఉన్న భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేసేందుకు వీఆర్ఓ నాగేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు. దీనిపై నారాయణరావు ఏసీబీని ఆశ్రయించడంతో పథకం ప్రకారం వీఆర్ఓను పట్టుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సీఐ రమేష్, లక్ష్మోజీ, సిబ్బంది పాల్గొన్నారు.