థెరిసా నివాసం పేల్చేందుకు ఐసిస్ కుట్ర
కోల్‌కతా: భారత రత్న సెయింట్ థెరిస్సా(మదర్ థెరిస్సా) నివాసంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారు. కోల్‌కతాలోని ఏజేసీ రోడ్డులో గల ఆమె నివసించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని సంకల్పించారు. ఇక్కడే సెయింట్ థెరిస్సాను ఖననం చేసిన విషయం కూడా తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు చేసిన ఈ కుట్రను బయటపెట్టారు. గత జూలైలో బుర్ద్వాన్ రైల్వే స్టేషన్లో ఎన్ఐఏ అధికారులు మహ్మద్ మసీరుద్దీన్ అలియాస్ ముసాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఉగ్రదాడి అనంతరం అప్రమత్తమైన ఎన్ఐఏ ముసాను అదుపులోకి తీసుకొని విచారించింది. అనంతరం ఆ విచారణకు సంబంధించిన చార్జిషీట్‌ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. ఇందులో థెరిసా నివాసం ఇంటిపై ఉగ్రదాడికి కుట్రలు చేసినట్లు ముసా ఒప్పుకున్నాడనే విషయం వెల్లడించారు. ముసాను ఒక్క ఎన్ఐఏ అధికారులు మాత్రమే కాకుండా ఎఫ్‌బీఐ అధికారులు, స్థానిక అధికారులు కూడా విచారించారు. ఈ విచారణలో తనతోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని వారు తర్వాత వచ్చి దాడిలో పాల్గొంటామని చెప్పినట్లు తెలిపాడు.
పాశ్చాత్యులను, ఇతర దేశాలనుంచి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలనుకున్నామన్నారు. పాశ్చాత్యులంటే తనకు అసహ్యం అని చెప్పారు. అతడి సమాచారం ఇవ్వగానే ఎలాంటి ఆందోళన పరిస్థితులు ఏర్పడకుండా మఫ్టీ డ్రెస్సులో కొంతమంది పోలీసులను థెరిసా నివాసం వద్ద ఉంచామని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారించి పంపిస్తున్నారని తెలిపాడు.